Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 10


    "నాకు సమాధానం కావాలి".
    
    "నన్ను విసిగించకు తరళా నా మనసేం బాగోలేదు".
    
    "ఎందుకు బావుంటుంది? ముగ్గురాడవాళ్ళు కలవబోయే సమయం దగ్గిరపడుతుంటే అసలు బావుండదు".
    
    "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధంకావటం లేదు".    

 

    "అంటే మీకే ఇతర స్త్రీతోనూ సంబంధం లేదా?"
    
    లిఫ్టు ఆగింది. ఆయన బయటకు అడుగుపెట్టి రమ్మన్నట్టు చూశారు. నేను కదల్లేదు. "నా తలమీద చెయ్యిపెట్టి చెప్పండి. నేను తప్ప మీకు ఇంకెవరితోనూ పరిచయం లేదని- చెప్పండి".
    
    ఆయన నా దగ్గరికొచ్చి, నన్ను బయటకు లాగారు. వెనుక లిఫ్టు తలుపులు మూసుకుపోయాయి. ఆయన చేతుల్లో గింజుకుంటూ 'నాకు సమాధానం కావాలి. సమాధానం కావాలి' అని హిస్టీరిక్ గా అరవసాగాను.
    
    "ఇది పబ్లిక్ ప్లేస్ తరళా గొడవ చెయ్యకు".    

 

    "పబ్లికా- అవును మీరు ప్రైవేటుగా చేసిన వ్యవహారాలు పబ్లిక్ లోకి రావటం మీ కిష్టంలేదు కదూ".    

 

    "నోర్ముయ్ నేనేం చెయ్యలేదు".

   
    "లేదా ఒట్టేసి చెప్పండి మీకేం సంబంధంలేదని చెప్పండి".
    
    ఆయన నా దగ్గిరకి వచ్చి తలమీద చెయ్యి వేయబోయి ఆగారు. ఆయన ఆగటం చూసి తలెత్తాను. ఆయన కళ్ళు దించుకుని "లేదు" అన్నారు. ఆయన కంఠం నూతిలోంచి వచ్చినట్టుంది.
    
    "లేదట లేదు".
    
    పిచ్చెక్కినట్టు అరిచాను. ఆ కారిడార్ నా అరుపుకి ప్రతిధ్వనించింది. "ఒకరితోకాదు- ఇద్దరితో - ఇద్దరితోకాదు ముగ్గురితో-" ఆయన నా మాటలు వినకుండా కూతురి గదిలోకి వెళ్ళారు. నాకు ఆ పదో అంతస్థు మీద నుంచి దూకేద్దామనిపించింది. కళ్ళు తిరిగి పడిపోకుండా స్థంభాన్ని పట్టుకున్నాను.
    
    ఇంతలో ఆయన గదిలోంచి బయటకొచ్చారు. ఆయన మొహం పాలిపోయింది. నన్నుపట్టుకుని క్రిందకి ఎలా తీసుకొచ్చారో, రిసెప్షన్ వరకూ ఎలా నడిచానో నాకే తెలీదు.
    
    "మూడు నాలుగు గంటల క్రితం నా కూతుర్ని ఇక్కడ రూమ్ తీసుకుని వదిలి వెళ్ళాను. ఏమైంది" అని అడిగారు.
    
    మేము మాటిమాటికి రావటం, వెళ్ళటం ఈ నాటకమంతా చూస్తూనే వున్నాడు ఆ రిసెప్షనిస్టు వెనుక బోర్డు వైపు కూడా చూడకుండానే "మిస్ దేవిక?" అని అడిగాడు.
    
    "యస్...."
    
    "అరగంట క్రితమే ఖాళీచేసి వెళ్ళిపోయారు సర్" అన్నాడు. ఆయన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఖా....ళీ... చే...సి....ం..దా? అని గొణిగారు. ఆయన అయోమయంగా నావైపు చూశారు.
    
    నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్ధం కావటం లేదు. ఒక పెద్ద మలుపు- మా ఆయన వూహించనిది జరుగుతూ వుందనీ, ఆయన గతంలో చేసిన దానికి మానసికంగా ఫలితం అనుభవిస్తున్నారనీ మాత్రం తెలుస్తుంది.
    
    మరి ఏ పాపమూ చేయని నాకెందుకీ శిక్ష?    
    
                                                              * * *
    
    నాకు శ్రీదేవి విషయమై మొట్టమొదటి అనుమానం ఆయన మీదకే వెళ్ళింది.    

 

    నేను హోటల్ నుంచి ఇంటికి వెళ్ళి ఆ తరువాత ఆయనతో కలసి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి, తిరిగి ఇక్కడికి వచ్చేలోపల శ్రీదేవి మాయమైంది. అంటే ఈయనకి ఈ విషయంలో ఎవరో తోడ్పడి వుంటారు.
    
    ఇంకెవరు? ఇన్ స్పెక్టరు సత్యనారాయణ అయివుంటాడు. వీళ్ళంతా కలిసికట్టుగా ఈ కేసు మాఫీ చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్దరాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చినప్పుడే అర్ధమైంది.
    
    మొదట ఫోన్ రాగానే, పోలీస్ స్టేషన్ కెళ్ళి అక్కడనుంచి తన కూతుర్ని తీసుకెళ్ళి హోటల్ లో పెట్టారు. తరువాత ఇంటి కెళ్ళారు. అప్పటికి నేను ఇంట్లో లేకపోవటంతో కంగారుపడి వుంటారు.
    
    ఇప్పుడు- తార్కికంగా ఆలోచిస్తే జరిగిందేమిటో నాకు క్రమక్రమంగా బోధపడుతూ వుంది.
    
    ...నేను ఇంట్లో లేకపోవటంతో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వుంటారు. అక్కడ సత్యనారాయణ నేను తనకి ఫోన్ చేసి అసలు విషయమంతా కూపీ లాగిన సంగతి ఆయనకి చెప్పి వుంటాడు. ఈయన బెంబేలెత్తి పోయి వుంటారు. మా ఇంటిముందు గూర్ఖా, నేను కారు తీసుకుని బయలుదేరిన సంగతి చెప్పివుంటాడు.
    
    నేను హోటల్ కి బయలుదేరిన సంగతి ఆ విధంగా తెలిసిపోయి వుంటుంది.
    
    నేను ఇంటికి రాగానే నిలదీస్తానని ఆయన వూహించి వుంటారు. ఇన్ స్పెక్టర్ సహాయంతో ముందు శ్రీదేవిని మాయంచేసి ఆ సాక్ష్యం దొరక్కుండా తప్పించుకున్నాడు.
    
    -కానీ గోపీచంద్ నన్ను కలుస్తాడని వీళ్ళు కలలో కూడా వూహించలేదు.
    
    అందుకే శ్రీదేవి పేరు చెప్పినప్పుడు ఆయన మొహం నిబ్బరంగా వుంది. గోపీచంద్, భాగ్యేశ్వరిల పేర్లు చెప్పగానే కంగారుపడ్డారు.
    
    ఇప్పుడిక నా కర్ధంకాని విషయం ఒకటే.
    
    విమానాశ్రయానికి అని చెప్పిన గోపీచంద్ ఎలా మాయమయ్యాడు?
    
    సినిమాలలో డబుల్ యాక్షన్ లోలా ఒకే పోలిక ఉన్న ఆ కుర్రవాడు కనపడితే ఈయన బండారం అంతా బయటపడి వుండిపోవును.
    
    ఇప్పుడే ఈ రాత్రి-ఇక్కడే.
    
    కానీ నేరస్తుల్ని అంత తొందరగా బయటపడేస్తే అ అదేవుడికి నాటక సూత్రధారి అన్న పేరెందుకు వుంటుంది.
    
    ఈ రాత్రి నేనిక ఏమీ ఆలోచించలేను. ఆ హోటల్లో వాళ్ళముందు ఆయనతో గొడవకూడా అనవసరం. నేను చేయవలసిందేమిటో ముందే నిర్ణయించుకున్నాను. అందుకని బయటకు నడవబోయాను.
    
    ఆయన నాతోపాటు రాలేదు. రిసెప్షనిస్ట్ నే, "అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్ళారా- ఒక్కతే వెళ్ళిపోయిందా?" అని అడిగారు.
    
    రిసెప్షనిస్ట్ ఏదో చెబుతున్నాడు- "ఖాళీ చేస్తున్నట్టు చెప్పమన్నారండీ ఇప్పుడే కదా తీసుకున్నారు అన్నాను కూడా కానీ..." అతడింకా చెప్తూనే వున్నాడు. నా దృష్టి ఆమె గది తాలూకు బిల్ మీద పడింది.
    
    విద్యుద్ఘాతం తగిలినట్టు అయింది.
    
    'దేవిక' అని వుంది దానిమీద.
    
    స్వంత కూతురి పేరు కూడా మార్చి ఆయన హోటల్లో రూమ్ తీసుకున్నారు.
    
    రేపొద్దున్న ఏదైనా గొడవ జరిగితే, 'శ్రీదేవి' అన్న పేరే వినలేదు అనటానికి-
    
    ఇంతకన్నా నికృష్టత వేరే వుంటుందా?
    
    ఈయన నా భర్త!
    
    ఈయన్తోనే నేనూ పాతిక సంవత్సరాలు కాపురం చేసింది-
    
    ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నది-
    
    ప్రబంధ్ సాయంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS