Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 3

 

"డబ్బు కోసం, పదవుల కోసం నువ్వు ఇంత దిగజారి పోతావు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే అసహ్యం, జాలి రెండూ కలుగుతున్నాయి"

అంతే, ఆ రోజు నుంచి తనతో మాట్లాడటం మానేసింది. కొడుకు ని హాస్టల్ లో చేర్పిన్చింది, తనను చూస్తూ పెరిగితే తనలా అవుతాడేమో అని అంట. 

హాస్టల్ లో చేర్చాలని ఆమె నిర్ణయించుకున్న రోజు పెద్ద రభస జరిగింది. అప్పటికి తమ కొడుకు అభి వయసు పదేళ్లు ఉంటాయి. వాడు వెళ్లనని భోరు, భోరున ఏడ్చాడు. 

"మనిద్దరి మధ్య గొడవకి వాడిని ఎందుకు బలి చేస్తున్నావు?" అన్నాడు తనా రోజు.

ఒక సారి తన వైపు చూసి మొహం తిప్పుకుని అంది.

"ఇక్కడే ఉండి నీ పనులు చూస్తూ పెరిగితే విలువలు, పాడూ ఏమీ లేకుండా గొడ్డు పెరిగినట్లు గా పెరుగుతాడు. నాకది ఇష్టం లేదు." 

కళ్ళల్లో త్రుణీకారభావం స్పష్టంగా కనపడుతోంది.

అంటే తను గొడ్డా? ఉక్రోషం వేసింది.

అడిగితే అవునంటుందేమో అని భయం.

"నువ్వు ఖాళీ గానే ఉంటావు కదా. నా లాగా అవకుండా జాగ్రత్త గా పెంచుకోవచ్చుగా." అన్నాడు. 

తన వాదన లో పస లేదని తనకే అర్థం అవుతూనే ఉంది.

"నన్ను మాత్రం నువ్వు ఎన్నాళ్ళు ఉంచుతావో నాకు అనుమానమే. అలా కాకపోయినా నీతో నేను ఎన్నాళ్ళు ఉండగలనో నా మీద నాకు సందేహం." ఒక్కొక్క మాట తూటా లాగా తగులుతోంది. 

ఇక లాభం లేదు. గొంతు పెంచబోయాడు. అప్పుడే అభి వచ్చాడు. 

"నేను హాస్టల్ కి వెళ్తానులే నాన్నా. మీరు గొడవ పడకండి" 

ఏదో వాడిని అడ్డం పెట్టుకొని అన్నా ఒక్క వాదన లో గెలుద్దామంటే అడ్డం పడ్డాడు వెధవ. వాళ్ళమ్మ లాగే పుట్టుక తో వృద్ధుడు. 

గొడవ పడొద్దట. అన్నీ ముదురు మాటలు.

అభి పెద్దయిపోతున్నాడు. ఎప్పుడన్నా సెలవులకి వచ్చినప్పుడు చూడటమే. అప్పుడు కూడా తనెక్కువ ఇంట్లో ఉండడు కాబట్టి వాడితో ఏదో బంధం తెగిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఇప్పుడు వాడు అమెరికా లో అండర్ గ్రాడ్ చదువుతున్నాడు. 

ఇన్ని కబుర్లు చెప్తుంది. ఏం, కొడుకు ని ఇండియా లోనే ఉంచి చదివించొచ్చుగా. మళ్లీ అట్లా కుదరదు. 

ఒక్కోసారి కక్ష తీరేలా ఆమెని తిట్టాలనీ,  అరవాలనీ అనిపిస్తుంది. కానీ ఆమెతో ఎటూ వాదన లో గెలవలేడు. ఎందుకు అనవసరంగా పరువు పోగొట్టుకోవడం అని అన్నిటికీ నోరు మూసుకుని తనే అడ్జస్ట్ అయిపోతున్నాడు. తన మీద తనకే జాలేస్తోంది.

ఆమె అంటే తనకి భయం అని తెలిస్తే తన అనుచరులు ఏమవుతారో.

అభి కూడా చానాళ్లు గా తనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. 

తన మీద ఏమైనా చాడీలు చెప్పి ఉంటుందా? 

లేదులే, బృంద అటువంటి మనిషి కాదు. ఆమె వ్యక్తిత్వం తలుచుకునప్పుడు అతనికి కొద్దిగా గర్వంగా కూడా అనిపిస్తుంది. 

ట్రోఫీ గెలిచిన వాడికి కలిగే ఆనందం.

ఈ సంఘటన జరిగినప్పుడు డ్రామా చేసింది కానీ కొన్నాళ్లకి దారిలో కి వస్తుందిలే అనుకున్నాడు. కానీ దాదాపు పదేళ్ళు దాటినా మౌనం వీడలేదు. ఒక్క మాట మాట్లాడదు. 

ఒకోసారి ఆ మొండి తనానికి ముచ్చట వేస్తుంది కూడా. 
***
విష్ణు ని పిలిచింది బృంద.

టాబ్లెట్స్, మంచి నీళ్ళు ఉన్న ట్రే అతనికి ఇచ్చి సుధీర్ కి ఇమ్మని సైగ చేసింది.
మాట్లాడకుండా మింగాడు వాటిని సుధీర్. 

ఆమె దగ్గర తనకు నోరు పెగలదు. పోలీసులని చూసి దొంగలు, దేవతల్ని చూసి రాక్షసులు, పరమ స్ట్రిక్ట్ బాస్ ని చూసి పని చేయని ఉద్యోగి, సోషల్ మీడియా ని చూసి పొలిటీషియన్లు ఎలా భయపడతారో తనలో అటువంటి భయమే ఉంది ఆమెని చూస్తే. 

ఈ విష్ణుగాడికి ఆమె అంటే మహా భక్తి. తను ఆమె పుట్టింటి తరపు నుంచి వచ్చిన వాడిలా ఫీల్ అయిపోతుంటాడు. మదాలస ని చూసినప్పుడల్లా ముందు వీడి మొహం మాడిపోతుంది.

అతని ఆలోచనలు కంట్రోల్ లేకుండా, ఒక దానితో ఒక దానికి సంబంధం లేకుండా ఒక దాన్నుంచి మరో విషయం లోకి వెళ్లిపోతున్నాయి.

మదాలస...తెల్లటి కొండచిలువ లాంటి మదాలస గుర్తు రాగానే పెదవుల మీద నవ్వు కదలాడింది అతనికి. 

ఎప్పుడూ శ్రద్ధ గా అలంకరించుకుని ఉంటుంది. ఆమె శరీరం లో మేకప్ కానీ, నగ కానీ లేని భాగం ఉండదు. "తన మీద ఎంత ప్రేమ లేకపోతే అంత సమయం తన కోసం రెడీ అవటానికి వెచ్చిస్తుంది?!" ఒకసారి తనకు తెలియకుండానే పైకి అనేశాడు.

"మీకు అలా అర్థం అయిందా సార్? మేకప్ లేకుండా చూస్తే మీరు భయపడి పోతారనీ, మీ నుంచి రాబట్టేవి రాబట్టడం కష్టం అవుతుందని ఆమె తాపత్రయం." 

విష్ణు ఒకసారి తన పక్కనే నిలబడి గొణిగాడు. 
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS