Previous Page
భవ బంధాలు పేజి 44


    పెద్దలు ఎంతో అనుభవంతో ....తాము అనుభవించి చెప్పిన మాటలు అవన్నీ.. ప్రేమ మైకం లో ఆ మాటలు పట్టించుకోరు తనలాంటి వారు. మధురి మనస్తత్వాన్ని అంచనా వేయడం లో ఎంత పోరపడ్డాడో రోజులు గడిచిన కొద్ది అర్ధమయ్యాయి.
    వంట, వంటిల్లు, ఇల్లు సర్దుకోవడం లాంటి పనులు తనకి సంబంధించిన విషయాలు కావన్నట్టు, పెట్టిందేదో తినేసి వెళ్ళే మాధురిని చూస్తుంటే, చెప్పందే చేసేట్టు లేదని, వంట రాకపోతే మిగతా పనులైనా చేస్తుందని ఆశించిన మురళి విస్తుపోయాడు.
    "అన్నం , కూరలు, టిఫిను, కాఫీ లాంటి పనులు ఒకరు, వారానికి ఒకసారి యిల్లు, వ్యాక్యూమ్ చేయడం , వాషింగ్ మిషను లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం, పక్కలు సర్దడం మరొకరు... నీవేం చేస్తావో ఫస్ట్ ఛాయిస్ నీదే, రెండూ నేను చెయ్యలేను. ఆఫీసు నించి వచ్చి పనులు యిద్దరం పంచుకుందాం" అన్నాడు సౌమ్యంగా.
    "ఇంటి పనికి వారానికి ఒకసారి వచ్చి అన్నీ చేసేందుకు మెయిడ్ ని పెట్టుకుందాం. ఏదో రోజు గిన్నెలు కడిగిస్తున్నాగా" అంది ఉదారంగా.
    మధురి మాటలకు మురళి నోట మాట రాలేదు.
    "వంట నాకు రాదని ముందే చెప్పాగా, నీవు సరే అంటేనే, పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట మార్చకు" అంది కోపంగా.
    "వంట రాదనకు చేయనను. ప్రయత్నిస్తే గా వచ్చేది." హేళనగా అన్నాడు.
    'అవును చేయను. దటీజ్ నాట్ మై జాబ్" అంది కోపంగా లేచి వెడుతూ.
    అన్నట్టే వంట, బ్రేక్ ఫాస్ట్ , వంటపని తను చేసి మిగతావి వదిలేసి పట్టించుకోలేదు. ఆదివారానికి పొద్దుటే ఒక తెల్లమ్మాయి దిగబడి ఇల్లంతా సర్ది, బట్టలుతికి, ఇస్త్రీ చేసి, గిన్నెలన్నీ కడిగి సర్ది , ఇల్లంతా నీట్ గా చేసి పోయింది.
    ఓ ఆవిడ సంపాదిస్తోందిగా బోలెడు, డబ్బిచ్చి చేయించుకుంటుంది. తను ఆఖరికి వంటవాడుగా మిగుల్తాడేమో అనిపించింది మురళికి
ఆమె ధోరణి చూసి.
    "అరె బాబూ , నేవేకాలంలో ఉన్నావింకా? యిప్పటి భార్యాలు ఉద్యోగాలు చేస్తూ వంటలు కూడా చేస్తారా నాయనా? నీ మిసెస్ మాత్రమే కాదు , అందరూ అంతేరా. పక్కలు సర్దడం, వాషింగ్ , డిష్ వాషర్, ఇస్త్రీలు , ఇల్లు మాప్ అన్నీ మనం చేస్తే రెండు పదార్ధాలు వండి ఆపసోపాలు పడిపోతారు. వాళ్ళు సగం, మనం సగం పని షరతులు ముందే పెడుతున్నారు నాయనా....ఇవి వాళ్ళ రోజులు. మొగాళ్ళ , మొగుళ్ళ రోజులు అయిపోయాయి. నోరు విప్పితే పడరు. విడాకులంటున్నారు. ఉన్నదంతా వూడ్చి పట్టుకు పోతారు. జాగ్రత్త "నాయనా" డ్రింక్స్ మధ్య మనసులో మాటలు బయటికి వచ్చేసి ఒకరి గోడు ఒకరు వెల్లబోసుకున్నారు మిత్రులు.
    "పిల్లల్ని తరువాత కనొచ్చని....ముందు ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఫర్నిచర్ కావాలి అంటూ రెండేళ్ళు గడిచి పోయాయి. పిల్లలను కనండి మేం చూస్తాం' ని మా పెద్ద వాళ్ళు ఎంత మొత్తుకున్నా 'ఆ....యిప్పుడు ఇలా అంటారు, కన్నాక మా నెత్తినే పడేస్తారంటుంది మా ఆవిడ" మరో మిత్రుడి గోస.
    "అటు అమ్మ వాళ్ళు రెండేళ్ళయింది పిల్లల్ని కనండి' అంటారు. కావలసినప్పుడు స్వేచ్ వేస్తె ఫ్యాను తిరిగినట్టు పుట్టుకొస్తారను కుంటాను. మన ఖర్మ ఉద్యోగం చేసే పెళ్ళాం అయితే డబ్బుతో సుఖాలన్నీ దొరుకుతాయి అనుకుంటే తిండికే కరువొచ్చింది. సంపాదిస్తున్నాం అన్న అహంకారం పెరిగిపోయింది. పైగా సగం పని నీది అని ముందే షరతులు" ఒకరి కష్టాలు ఒకరు పంచుకుని, ఒకర్నొకరు ఓదార్చుకుని చివరకు విడిపోయారందరూ.
    మరో ఆరునెలలు భారంగా గడిచాయి మురళి కి. ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. కీచులాటలు, అరుచుకోవడాలు, వాదించు కోవడాలు, పెళ్ళయితే ముద్దులు , మురిపాలు , అన్నీ ఊహాగానాలు అని తేలిపోయాయి. మాధురికి ఇల్లు, సంసారం, పిల్లలు, కాపురం ఏమీ అక్కరలేదు. పట్టించుకోదు తను, తన ఉద్యోగం తప్ప ఏదీ పట్టించుకోదని , అన్నం పెడితే తింటుంది. వండక పొతే బ్రెడ్ ముక్కలు, జ్యూస్ లు, పళ్ళు, పిజ్జాలు ఆర్డర్ చేసుకు తినేసి బతికేస్తుంది.
    తీరిక లేని భార్య....ఇది సంసారమా , ఇది కాపురమా? తామిద్దరూ భార్యాభర్తలు, ఆలోచనలు, సందిగ్ధాలు , అనుమానాలు, భయాలు, ఎటూ తేల్చుకోలేని ఆలోచనలు. రాత్రి నిద్ర కరువైంది -- ఈ పెళ్ళా తను కోరుకుంది! వద్దు. ఈ డబ్బూ వద్దు, ఈ ఉద్యోగమూ వద్దు. ఈ పెళ్ళాం అసలే వద్దు. తను సంపాదించిన లక్షలు ఏం చేసుకుంటాడు. తినడానికి తిండి లేదు. లక్షలు దాచి యివ్వటానికి పిల్లలు లేరు. నిరంతరం ఒకటే ఆలోచనలు.
    రోజులు దొర్లిపోతున్నాయి.

                                      *    *    *
    రెండు పెద్ద సూట్ కేసులతో ఒక తెల్లారి యింటి ముందు నిల్చుని బెల్ కొట్టిన మురళిని చూసి విస్తుపోయింది అన్నపూర్ణ.
    "ఏమిటి చెప్పా చెయ్యకుండా ...ఇలా హటాత్తుగా " ఆవిడ అంటుండగానే మురళి తల్లిని తప్పించుకుని సూట్ కేసులతో లోపలికి వెళ్ళాడు.
    "మధురి ఏదీ? రాలేదా?' అంది అనుమానంగా.
    "రాలేదు..రాదు " అని "అమ్మా ముందు కాఫీ యివ్వు తరువాత టిఫిన్ పెట్టు. ఆకలేస్తోంది . తరవాత నిద్రపోయి లేచాక అన్నీ చెప్తాను" అంటూ రూం లోకి దూరాడు మురళి.

                                      *    *    *
    కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి లేచాక, సాయంత్రం తల్లి యిచ్చిన కాఫీ తాగుతూ....
    "అమ్మా, నేను అమెరికా నుండి వచ్చేశాను. ఇక్కడే ఉద్యోగం చూసుకున్నా మా వాళ్ళు ఇండియా లోనే బ్రాంచి పెట్టారు . దాన్లో చేస్తా......."
    "మరి మాధురి ఒప్పుకుందా ? తరువాత వస్తుందా?" అంది ఆరాటంగా అన్నపూర్ణ.
    "తను రాదు. తనిక నా భార్య కాదు. యిద్దరం , మ్యూచువల్ డైవోర్స్ తీసుకున్నాం. అన్ని తెగ తెంపులు చేసుకుని ఎలా వెళ్ళానో, అలా వచ్చేశాను. రెండు సూట్ కేసులతో..." అని గొంతు రుద్దమయింది. ఆవిడ విస్తుపోతూ కొడుకు వంక చూసింది. ఏం అడగాలో , ఏం అనాలో అర్ధం కాలేదావిడకి. చటుక్కున లేచి మురళి తల్లి దగ్గర కూర్చుని ఆవిడ రెండు చేతులూ పట్టుకుని ...
    "అమ్మా, నాకు ఇల్లు, సంసారం చూసుకునే అమ్మాయి కావాలి. భర్తకి అనురాగం, ఆప్యాయతతో దగ్గర కూర్చుని యింత అన్నం పెట్టె యిల్లాలు కావాలమ్మా , యిల్లంటే భార్య, భర్త , పిల్లలు కళకళలాడే నవ్వులుండే పరిస్థితులు కల్పించే భార్యా కావాలమ్మా! భోజ్యోషు మాతలా, నా యిష్టాలు గుర్తెరిగి అన్నపూర్ణ లాంటి భార్య కావాలమ్మా! శయనేషు రంభ అంటారు కాని రంభ లాంటి భార్య అందగత్తె కానక్కర్లేదు . ప్రేమగా, అన్యోన్యంగా ఒకరికొకరు తోడు నీడగా కష్టసుఖాలు పంచుకుని సాగే సంసారం కావాలమ్మా! నాకు లక్షలు సంపాదించే భార్య వద్దు. రాత్రింబవళ్ళు ఆఫీసు పనితో అందనంత ఎత్తుకి ఎదిగిపోయే భార్య వద్దు. నాకు తోడు నీడగా యింటి పట్టునుండి, యిల్లు, భర్త, సంసారం , పిల్లలని చూసుకునే మంచి ఇల్లాలు కావాలమ్మా. అలాంటి అమ్మాయిని చూడమ్మా...." గుక్క తిప్పుకోకుండా మనసులో ఇన్నాళ్ళూ గూడు కట్టుకున్న బాధనంతా ఒక్కసారి వెళ్ళగక్కి తల్లి చేతుల్లో ముఖం దాచుకున్నాడు.
    "ఏమిటి, ఏమైంది. మాధురి నీవు మాటా మాటా అనుకున్నారా? ఏం జరిగింది చెప్పు నాన్నా. ఛ....ఆ కన్నీళ్ళు ఏమిటి?" అంది అయోమయంగా చూస్తూ.
    "అమ్మా, మాదురితో నాకు సరిపడదు. యింక తనతో కలిసి బతకలేనమ్మా. ఇద్దరం మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాం. అక్కడ నించి శాశ్వతంగా వచ్చేశాను. ఆ ఉద్యోగం, ఆ డబ్బు, సుఖాలు అన్నీ వద్దనుకుని ఇక్కడికి వచ్చేశాను. నాకోచ్చే జీతంతో వున్నంత లో హాయిగా బతకాలనిపించింది. అమ్మా, ఈసారి నా పెళ్లి బాధ్యత నీదే. కాస్త చదువుకుని యింటి పట్టుని ఉండి సంసారం చేసుకుంటే చాలు. మంచితనం వున్న పేదింటి పిల్లనైనా సరే, జీవితం సుఖంగా గడిచిపోతే చాలు. నాకింకేం వద్దు" ఆవేదనగా అన్నాడు.
    "మరి మధురి ఏమంది? ఒప్పుకుందా విడిపోడానికి? అంత సులువుగా డైవోర్స్ ఇచ్చేసిందా?" అనుమానంగా అడిగింది . "చేతులెత్తి దండం పెట్టి నన్ను వదిలేయ్. ఈ యిల్లు తీసుకో. నీవు కొన్నదేగా, ణా సేవింగ్స్...యింట్లో సామాను ఏం కావాలంటే అన్నీ తీసుకో. నేను ఇక్కడ ఉండను. ఇండియా వెళ్ళిపోతాను. నాకూ నీకూ సరిపడడం లేదు. జీవితంలో భోజన సుఖం, భార్య సుఖం, పిల్లల సుఖం ఏది లేకుండా లక్షలు సంపాదించి ఏం చెయ్యాలి?' నన్ను వదిలేయి" అని దణ్ణం పెట్టేశాను.
    "నన్ను పెళ్లి చేసుకోమని చంపావు. చేసుకున్నాక యిప్పుడు మారిపోయావు. మీ మగవారిని నమ్మడం నాదే తప్పు. అందేవరకూ కాళ్ళు పట్టుకుంటారు. అందాక నిజ స్వరూపాలు చూపిస్తారు. ఫో? నీకు నేను అక్కర లేకపోతె , నాకూ నీవు అక్కరలేదు. నీతో పాటు నీ సామాను, నీ డబ్బు నాకేం అక్కరలేదు. ఫో- ఫో , ణా ఇంట్లోంచి' అని కోపంగా ఎగిరి రేపు నీ మొహం నాకు కనపడ కూడదని తన గదిలోకి వెళ్లి దాడేల్మని తలుపు మూసుకుంది. బతుకు జీవుడా అనుకుని బట్టలు సర్దుకుని బయటికి వచ్చేశాను. ఇంత సులువుగా వదిలించు కున్నందుకు తేలిగ్గా ఉందిప్పుడు. అమ్మా....ఏం చేస్తావో , నా  బతుకు నీ చేతుల్లో పెడుతున్నా, నీ ఇష్టమే నా యిష్టం...."
    అన్నపూర్ణ దీర్ఘంగా నిట్టూర్చి, కొడుకు తల నిమురుతూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది.

                                   *    *    *
    ఆరేళ్ళు గడిచిపోయాయి.
    ఇప్పుడు మురళి కి యిద్దరు పిల్లలు. వాళ్ళ ముద్దు ముచ్చట్ల తో , ఆటపాటలతో, అనుకూలవతి అయిన భార్యతో ఇదీ ఇల్లంటే అనిపిస్తోంది తనకి.
    అమెరికా కంఫర్ట్  కు తీసిపోని యిల్లు, సామాను, తనూ, పిల్లలే జీవితం అనుకునే భార్య, తోడు నీడై అత్తని బాగా చూసుకునే మంచి మనసున్న భార్య- మగవాడికి సిరిసంపదలు కావు, వున్నదానితో తృప్తి పడి, తను సుఖపడి, తనని సుఖ పెట్టె భార్య దొరికితే చాలు....అనుకున్నవన్నీ అందాక అనిపించింది మురళికి.
    "బతుకున బతుకై తోడోకరుండిన చాలు అదే స్వర్గం' అనిపించి, తనకీ జీవితం యిచ్చిన తల్లికీ, తనకి తోడు నీడగా నిల్చిన కమలకీ జీవితాంతం కృతజ్ఞత గా ఉండడం తప్ప తనేం యిచ్చుకోగలడని అనుకుంటాడు రోజుకి ఒకసారైనా మురళి.

                                         *    *    *        


 Previous Page

WRITERS
PUBLICATIONS