సంతోషి మాత రాఖీ దేవత!
మన రాష్ట్రం నుంచి ఉత్తరాది వైపు వెళ్తున్నా, లేదా ఉత్తరాది నుంచి వచ్చే వాహనాలను గమనించినా సంతోషిమాత పటం కనిపిస్తూ ఉంటుంది. ఒక చేత ఖడ్గంతో, మరోచేత త్రిశూలంతో ఉండి సింహారూఢినిగా సంచరించే ఆ రూపానికి సందడి చేకూరుస్తూ `మైతో ఆరతి ఉతారూరే సంతోషి మాతాకీ` అనే పాట వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఎవరీ సంతోషి మాత !
సంతోషి మాత నేపథ్యం గురించి ఆ నోట ఈ నోట వినిపించడమే కానీ, పురాణాలలో ఆమె ప్రసక్తి అంతగా కనిపించదు. ఉత్తరాదిన వినిపించే గాథల ప్రకారం సంతోషి మాత వినాయకుని కుమార్తె. ఒక రక్షాబంధనం రోజున అన్నదమ్ములందరూ, అక్కచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుంటున్నారట. ఆ దృశ్యాలని గమనించిన వినాయకుని కుమారులకి చాలా బాధ కలిగిందట. తమకి కూడా ఓ చక్కటి చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నారట వాళ్లు. నారదుడు ఆ పిల్లల కోరికను తీర్చమని వినాయకుని కోరడంతో... వినాయకుడు, సంతోషిమాతను సృష్టించాడు. అలా వినాయకుని కుటుంబంలోకి సరికొత్త సంతోషాలను తీసుకువచ్చింది కాబట్టి, ఆమెను సంతోషిమాతగా పిలవసాగారు. కేవలం దేవతలకే కాదు, తనని కొలిచిన మానవులందరికీ సకలసంతోషాలనూ ఒసగుతుంది కాబట్టి ఆ పేరు స్థిరపడిపోయింది.
సంతోషిమాత గురించి ఈ గాథలు ఎప్పటి నుంచి ప్రచారంలో ఉన్నాయోకానీ 1960ల నుంచి ఆమెను కొలిచే భక్తుల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోయింది. సంతోషిమాత వ్రతం పేర ఒక వ్రతం కూడా ప్రచారంలోకి వచ్చింది. దీని ప్రకారం 16 శుక్రవారాలపాటు ఒంటిపూట భోజనం మాత్రమే చేస్తూ, అమ్మవారిని పూజించాలి. ఇందుకోసం పంచభక్ష్యాలు ఏవీ అవసరం లేదు. ప్రతి భారతీయుని ఇంట్లోనూ ఉండే బెల్లం/ పంచదార, కాసిని శనగలు నివేదిస్తే చాలు అమ్మవారు సంతోషిస్తారు. అయితే వ్రతాన్ని ఆచరించే సమయంలో పుల్లటి పదార్థాలను తీసుకోవడం మాత్రం నిషిద్ధం. పులుపు మానసికస్థితి మీద ప్రభావం చూపిస్తుందని ఇప్పటి వైద్యులు కూడా చెబుతున్నారు కదా! రక్తపోటు అధికంగా ఉన్నవారికి ముందు ఆహారంలో పులుపు తగ్గించమనే చెబుతారు. ఇక 16వ శుక్రవారంనాడు 8 మంది బాలురను భోజనానికి పిలిచి, ఈ వ్రతానికి ఉద్యాపన చేయాలి. సంతోషిమాత వ్రతాన్ని ఆచరించి సకలశుభాలను పొందిన సత్యవతి అనే భక్తురాలి కథను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు.
ఒకవైపు సంతోషిమాత వ్రతం గురించి ప్రచారం జరుగుతుండగా, 1975లో `జై సంతోషిమా` అనే హిందీ చిత్రం వచ్చింది. పెద్దగా తారాగణం లేకుండా, అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం ఉత్తరాది భక్తులను కుదిపేసింది. అప్పట్లో మధ్యతరగతి ప్రజలకు సినిమానే గొప్ప దృశ్యమాధ్యమంగా ఉండేది. `జై సంతోషిమా` చిత్రాన్ని అప్పటి జనం ఎంతగా ఆరాధించారంటే, ఆ సినిమా ప్రదర్శించే హాలుని ఒక పవిత్రస్థలంగా భావించేవారట. పైన పేర్కొన్న పాట అందులోదే! ఈ చిత్రం ద్వారా సంతోషిమాత జన్మవృత్తాంతం, ఆమె వ్రత వైభవం జనంలోకి విస్తృతంగా ప్రచారం కావడంతో, చాలా అమ్మవారి గుళ్లలో సంతోషిమాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. సంతోషిమాత చాలా ఇళ్లకి ఇలవేల్పుగా మారింది.
సంతోషిమాత, లక్ష్మీదేవి అవతారమని కొందరంటే... దుర్గామాతకి ప్రసన్న రూపమే సంతోషిమాత అని మరికొందరు విశ్వసిస్తారు. ఎవరేమనుకున్నా, ఎలా కొలుచుకున్నా సంతోషిమాత సకల సంతోషాలనూ ఒసగుతూనే ఉంది. ఎందుకంటే ఆమె భక్తులందరికీ తల్లి కదా!
- నిర్జర.