దేవుడు ఎక్కడున్నాడు??
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః
సర్వథా వర్తమానో..పి స యోగీ మయి వర్తతే॥
ఎవరైతే సకలభూతములలో ఉన్న నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి ఎక్కడ ఏ కాలంలో ఏవిధంగా ప్రవర్తించినా, అతడి మనసు మాత్రం ఎల్లప్పుడు నాయందే లగ్నం అయి ఉంటుంది.
దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే సందేహము ప్రతి వాడికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు కనపడడు కాబట్టి. అందుకే పోతన గారు ఒక ఆణిముత్యం లాంటి పద్యం మనకు అందించాడు.
"ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.
ఎందెందు వెదకి చూచిన అందందే కలదు దానవాగ్రణి వింటే!!"
భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడు లేదు అనే సందేహము వదిలిపెట్టాలి. భగవంతుని కోసం వెదకాలి. దానికి మార్గము ధ్యానమార్గము. ఇక్కడ ఇంకో మాటకూడా అన్నారు. చక్రి సర్ఫోగతుండు దేవుడు అంతటా ఉన్నాడు. చక్రి అని వాడటంలో అర్ధం చక్రానికి అంచులు లేవు. విస్తరించుకుంటూ పోతుంది. అంతం ఉండదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపి అంతం లేదు. ఎక్కడెక్కడ వెదికితే అక్కడక్కడే ఉన్నాడు. కాకపోతే మనకు ఉండవలసిన లక్షణం మనకన్నా పెద్దలు, గురువులు, శాస్త్రములు చెప్పింది వినడం.
అయితే ప్రస్తుతం మనకు లేని లక్షణం కూడా అదే! ప్రతి వాడూ నాకు అంతా తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు అన్న విషయం వాడికి తెలియదు. అదే అజ్ఞానము వినదగు నెవ్వరు చెప్పిన అనే మాట అందుకే వచ్చింది. కాబట్టి భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు అని గ్రహించాలి. పాలలో వెన్న లాగా, కట్టెలో నిప్పులాగా, నువ్వులలో నూనె లాగా దాగి ఉన్నాడు. మధిస్తే కనపడతాడు ఎన్ని ఆభరణములు ఉన్నా అందులో ఉండే మూలపదార్ధము బంగారము, రకరకాల కుండలు ఉన్నా అందులో ఉండే మూలపదార్ధము మట్టే. అలాగే అన్ని జీవరాసులలో ఉండే వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలో అందరూ ఉన్నారు. కాబట్టి సమస్త జీవరాసులు పరమాత్మ స్వరూపాలే అని భావించాలి.
ఎవరికీ, దేనికీ అవకారం చేయకూడదు, ద్వేషించకూడదు. ఇతర మానవుల పట్ల, జీవరాసుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. అన్ని జీవరాసులయందు ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే, పరమాత్మ మనకు కనపడతాడు. దానినే ఏకాత్మ బుద్ధి అని అంటారు. జీవులలో భేదము చూడకూడదు. ఆ ప్రకారంగా జీవులలో బేధ బుద్ధి లేకుండా ప్రవర్తించేవాడు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా వాడి మనసు మాత్రము పరమాత్మయందే లగ్నం అయి ఉంటుంది. అతడు సమాధి స్థితిలో ఉన్నా, ప్రాపంచిక వ్యవహారాలు చక్కబెడుతున్నా ఒక్కటే. ముల్లు ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది అలాగే జ్ఞాని మనసు ఎల్లప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది. సర్వథా వర్తమానోపి అంటే ఏ ఆశ్రమంలో ఉన్నా అని అర్థం చెప్పుకోవచ్చు. అతడు బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము ఏ ఆశ్రమంలో ఉన్నా, మనసు మాత్రం పరమాత్మయందే లగ్నం అయి ఉంటుంది. అంతే కానీ ఏ విధంగా ప్రవర్తించినా అని విపరీతార్థము తీయకూడదు. అంటే నేను జ్ఞానిని కదా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు కదా అని అనుకోకూడదు. అలా ప్రవర్తిస్తే అంత ఎత్తు శిఖరం నుండి కిందపడతాడు.
ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనసును ఆత్మలో ఉంచిన యోగి మరలా రజోగుణము తమోగుణము వంక మళ్లడం చాలా అరుదు. ఒక వేళ మళ్లితే అతనికి జ్ఞానం ఇంకా రాలేదు అని అర్థం. అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు. ఆత్మజ్ఞానం పొందిన వాడు మరలా ప్రాపంచిక సుఖముల వంక మళ్లడు. కాబట్టి శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడలు చేసాడు, ఎనిమిది మంది భార్యలను చేసుకున్నాడు. ఆయన జ్ఞాని కదా ఇలా ఎందుకు చేసాడు. అనే శుష్క తర్కాలు చెబుతుంటారు. మరి ఆయన భగవద్గీత కూడా చెప్పాడు మనం చెప్పలేము కదా. అది ఆలోచించాలి. కాబట్టి ఆత్మజ్ఞానము పొందిన వాడు, మరలా అధోగతి పాలు కాకుండా చాలా జాగ్రత్త పడాలి. బయట ప్రపంచములో తిరుగుతున్నా మనసు మాత్రము పరమాత్మయందేలగ్నం చేయాలి. అతడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు. దేవుడిని తెలుసుకోగలడు.
◆వెంకటేష్ పువ్వాడ.