వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు సాక్షాత్తు పార్వతిదేవి చెప్పిన అమూల్యమైన సలహాలు..!

హిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
ఓర్పు, నమ్మకం..
ప్రతి సంబంధం బలంగా మారడానికి సమయం అవసరం. పార్వతి దేవి తన సంబంధంలో సహనం, నమ్మకం శివుడితో ఆమెకున్న అవినాభావ బంధానికి చిహ్నం. పార్వతి దేవి శివుడిని పొందడానికి సంవత్సరాలుగా తపస్సు చేసింది. అందుకే ప్రతి అమ్మాయి ఎంతో ఓర్పు కలిగి ఉండాలని చెబుతారు. ఓర్పు కలిగి ఉంటే ఎన్నో విషయాలు సాధ్యం అవుతాయని పార్వతీ మాత చెబుతుంది.
గుర్తింపు..
వివాహ జీవితంలో ప్రతి స్త్రీ తన గుర్తింపును కాపాడుకోవాలని పార్వతీ మాత చెబుతుంది. అలాగే భాగస్వామి గుర్తింపును గౌరవించాలి. పార్వతి శివుడిని పొందడానికి తపస్సు చేసింది, కానీ తన శక్తిని, గుర్తింపును కూడా కాపాడుకుంది. అలాగే ఆమె శివుడిని గౌరవించింది. ప్రతి కొత్త వధువు వివాహం తర్వాత తనను తాను కోల్పోయే బదులు, తన గుర్తింపుతో సంబంధాన్ని కొనసాగించాలి, తన భాగస్వామిని గౌరవించాలని పార్వతీ మాత చెబుతుంది.
నిజమైన బంధం..
నిజమైన బంధం అంటే సంక్షోభ సమయాల్లో కూడా మీతో పాటు నిలిచి ఉండేది. సముద్ర మథనం అయినా, శివుని తాండవ సమయం అయినా, పార్వతి దేవి ఎల్లప్పుడూ తన భర్తకు అండగా నిలిచింది. నిజమైన జీవిత భాగస్వామిగా ఉండటం అంటే మంచి సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లో కూడా భర్తకు అండగా నిలబడటం అని ఇది మనకు బోధిస్తుంది.
మౌనం కాదు..
ఏదైనా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడల్లా పార్వతి మాత శివుడితో ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడేదట. వైవాహిక జీవితంలో సంభాషణ అవసరమని, విషయాలను దృష్టిలో ఉంచుకుని మౌనంగా ఉండటం వల్ల దూరం పెరుగుతుందని పార్వతీ మాత చెబుతుంది. అందుకే భార్యాభర్తలు గొడవలు జరిగినప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకోవాలి. మౌనంగా ఉండి అవతలి వారిని బాధపెట్టకూడదు.
త్యాగం.. ఆత్మగౌరవం..
వివాహం తర్వాత పార్వతీ మాత చాలా త్యాగాలు చేసింది. కానీ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. సంబందం కోసం రాజీ పడవచ్చు కానీ.. తమను తాము కోల్పోకూడదని పార్వతీ మాత చెబుతుంది.
గమనిక.. ఇందులోని విషయాలు పలు సోషల్ మీడియా వేదికలలో ఉన్న సమాచారం ఆధారంగా పొందుపరచడం జరిగింది.
*రూపశ్రీ.



