గొప్పవారి తత్వానికి ఉదాహరణ!!


కొందరికి ఇతరుల గురించి పూర్తిగా తెలిసి ఉండదు. పైకి కనిపించినట్టు అంతా ఉండదు.  కృష్ణుడు గీతాసారాన్ని అర్జుడికి చెప్పేవరకు, కృష్ణుడి విశ్వరూప దర్శనం అయ్యేవరకు అర్జునుడికి కృష్ణుడి లోతు( ఇక్కడ లోతు అంటే మనిషి యొక్క పూర్తి స్వభావం అని అర్థం) తెలియలేదు. కానీ తెలిసిన తరువాత అర్జునుడి ఆలోచన మారిపోయింది.

ఇదివరకు జరిగినవి అన్నీ గుర్తుకు వస్తున్నాయి. కృష్ణార్జునులు బావా బావమరుదులు. సరసాలు ఆడుకునేవాళ్లు. కలిసి తిరిగేవాళ్లు. కలిసి భోజనం చేసే వాళ్లు. ఏమోయ్ కృష్ణా! అంటే ఏమోయ్ అర్జునా! అని పిలుచుకునేవాళ్లు. మరి ఇంతటి విశ్వరూపుడిని అనంతుడిని అంతటా నిండి ఉన్న వాడిని నేను అలా ఎలా అన్నానా అని తల గోక్కుంటూ ఇలా అన్నాడు. "ఓ కృష్ణా! నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత, ప్రమాద వశాత్తు అంటే పొరపాటున, “ఓయ్ కృష్ణా! హే యాదవా! హే మిత్రమా!” అని హేళనగా పిలిచి ఉంటాను. నీతో పక్కన కూర్చుని భోజనం చేసాను. నీతో కలిసి విహరించాను. నీతో కలిసి నిద్రించాను. మనం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ. నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుటా నిన్ను యాదవుడవని నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కానీ వేరుకాదు. పైచెప్పివన్నీ నేను చేసిన అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు." అని వేడుకున్నాడు.

చాలా మంది విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఎదుటివాళ్లతో ఎంతో సరదాగా, ఎంతో చిలిపితనంగా ఉన్నప్పుడు స్నేహితుల్లా, ఆత్మీయులుగా అనిపిస్తారు అలాగే కలసిపోతాం కూడా. కానీ ఎదుటివాళ్ళ స్థాయి ఏమిటో తెలిసాక, అది ఎంతో పెద్దది (అంటే ఇక్కడ కొలమానం వ్యక్తిత్వం, మరియు వాళ్లలో ఉన్న విషయ సామర్థ్యము) అని అర్థమయ్యాకా చిలిపిగా మాట్లాడినవి కూడా ఎంతో తప్పుగా మాట్లాడిన మాటల్లా అనిపిస్తాయి. ఇక్కడ అర్జుడికి అదే భావం కలిగింది.

ఇంతటి మహాపురుషుడిని నేను చులకనగా చూచాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదేనమస్కరిస్తూ తను తెలియకుండా ఏమైనా తప్పుచేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలనీ వేరుగా తలచవద్దనీ ప్రార్థించాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా, మా మాదిరి మాలో కలిసిపోయి ఉండటం వలన ఆ పొరపాటు ప్రమాదవశాత్తు, నా తెలియనితనం వలన జరిగింది కానీ వేరు కాదు అని తనకు తాను నచ్చచెప్పుకున్నాడు అర్జునుడు.

ఓ దేవా! మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమరికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కాబట్టి నేను పరిహాసానికి అన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి. అని వేడుకున్నాడు.

(దీని వలన మనకు తెలిసింది ఏమిటంటే, గొప్పవాళ్లు, ఆత్మతత్వం తెలిసిన వాళ్లు ఎవరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతే కాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్లను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎవరైనా తమను తాము గొప్పవాళ్లమనీ, అన్నీ తెలిసిన వాళ్లమనీ మహిమలు కలవాళ్లమనీ ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదనీ మనం అనుకోవలసి వస్తుంది.)

                                ◆ వెంకటేష్ పువ్వాడ.


More Vyasalu