కుంభమేళా లో మాత్రమే కనిపించే నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా...
కుంభమేళా భారతదేశం యావత్తు జరుపుకునే అతిపెద్ద వేడుక. పన్నెండేళ్లకు ఒక సారి పుష్కరాలు జరుగుతాయని అందరికీ తెలుసు. ఈ పుష్కరాలలో కుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుంభమేళాలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం అని నమ్ముతారు. ఈ కుంభమేళా ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో ప్రారంభం అవుతాయి. అది కూడా ఈ ఏడాది జనవరి 13వ తేదీ నుండి కుంభమేళా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా కుంభమేళాలో ఆకట్టుకునేది నాగ సాధువుల ఉనికి. అప్పటి వరకు వాళ్లంతా ఎక్కడుంటారో ఏమో తెలియదు కానీ.. కుంభమేళాలో మాత్రం ప్రత్యక్షం అవుతారు. అసలు నాగ సాదువులు, అఘోరాలు కుంభమేళాకు ఎందుకు వస్తారు. వీరు దుస్తులు లేకుండా దిగంబరంగా ఎందుకు ఉంటారు? తెలుసుకుంటే..
నాగసాధువులు, అఘోరాలు కుంభమేళాలో కనిపిస్తుంటారు. వీరిది ఒక ప్రత్యేకమైన జీవనశైలి. వీరు భవబంధాలు త్యజించినవారు. సాధారణ జనావాసాలకు, జనాలకు దూరంగా ఉంటారు. లోతైన ధ్యానంలో మునిగి ఉండటం, మోక్ష సాధనకు ప్రయత్నించడం వీరి లక్ష్యం. సాధారణంగా మనుషులను, మనుషుల మనసును శరీరం శాసిస్తుంది. కానీ నాగ సాధువుల విషయంలో ఇది విభిన్నం. వారి మనసు పూర్తీగా వారి ఆధీనంలో ఉంటుంది. వీరు ధ్యానం, తపస్సు, బ్రహ్మచర్యం తప్పక పాటిస్తారు. నిజమైన నాగ సాదువులు, అఘోరాలు జనావాసాలలోకి రారు. ప్రజలకు కనిపించే విధంగా వారు ఉండరు. ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించి ఉంటారు.
జనవరి 13వ తేదీ పుష్యమాస పూర్ణిమ తిథి ఉంటుంది. ఈ తిథి నుండి కుంభమేళా పుణ్యస్నానాలు మొదలవుతాయి. అయితే కుంభమేళా వేడుకలు మొదలయ్యాక అన్ని రోజులలో స్నానాలు చేయడం అంత మంచిది కాదు. పుణ్య స్నానాలకు ప్రత్యేక తిథులు ఉన్నాయి. 14వ తేదీ మకర సంక్రాంతి. ఈ రోజు కుంభమేళా పుణ్యస్నానం చేయడం మంచిది. తరువాత జనవరి నెలలోనే 29వ తేదీ. ఈ రోజు మౌని అమావాస్య. మౌని అమావాస్య రోజు పుష్కర స్నానం చేయడం చాలా మంచిదట. తరువాత ఫిబ్రవరి 3వ తేదీ కూడా పుణ్య స్నానానికి మంచిది. ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి అవుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 12వ తేదీ పూర్ణిమ తిథి వచ్చింది. ఈ రోజు కూడా పుణ్య స్నానం ఆచరిస్తే మంచిదే. చిపరగా ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి జరుగుతుంది. ఈ మహాశివ రాత్రి నాడు కుంభమేళా పుణ్య స్నానం చేయడం ఎంతో మంచిది.
కుంభమేళా ఎందుకంత పవిత్రం..
సాధారణంగా నదీ స్నానం, సముద్ర స్నానం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. కానీ కుంభమేళా సమయంలో స్నానానికి మరింత విశిశ్టత ఉంది. దేవదానవులు అమృత కలశం కోసం యుద్దం చేస్తున్నప్పుడు అమృత కలశం నుండి అమృత చుక్కలు చింది భూమి మీద పడ్డాయట. అవి కూడా గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పడ్డాయని, ఇలా పుష్కరాల సమయంలో ఆ నదులలో స్నానం చేస్తే ఆ అమృత బిందువుల ప్రభావం వల్ల ఎలాంటి అనారోగ్యాలైనా నయం అవుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, జీవితంలో చేసుకున్న పాపాలు నశిస్తాయని నమ్ముతారు. అందుకే కుంభమేళా సమయంలో ప్రయాగ క్షేత్రంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుండో ప్రయాణం చేసి వెళుతుంటారు.
*రూపశ్రీ.
