అమ్మకు ఓ అందమైన నిర్వచనం – శారదా మాత
భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకొనేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల గురించిన ప్రస్తావన రాక మానదు. కానీ శారదా మాత లేని ఆ ప్రస్తావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యులకు తల్లిలా భాసించిన శారదా దేవి... మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.
శారదామాత 1853లో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జయరాంబాటి అనే కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు కటిక పేదవారు. కానీ తమ ఇంట ఒక అసాధారణమైన మనిషి జన్మించబోతోందని తెలిపేందుకు, వారికి అనేక దర్శనాలు కలిగేవట. శారదామాత బాల్యం బయటకు సర్వసాధారణంగానే కనిపించేది. తల్లికి ఇంటిపనుల్లో సాయపడటం, పొలానికి వెళ్లి తండ్రికి ఆహారాన్ని అందించడం.... ఇలా ఆమె జీవితం సాగిపోయేది. కానీ ధ్యానమన్నా, పూజలన్నా ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది. ఒక ఎనిమిది మంది యువతులు ఎప్పుడూ తనకు కనిపించేవారని చెప్పేవారు శారద.
అటు శారదాదేవి జీవితం అలా ఉండగా, ఇటు కోలకతాలోని దక్షిణేశ్వరం అనే కాళీ మందిరంలో రామకృష్ణ అనే పూజారి తీవ్ర వైరాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు. నిరంతరం భగవన్నామంతో తపించిపోతున్నాడు. పెళ్లి చేస్తేనైనా అతని వైరాగ్యం కొంత ఉపశమిస్తుందని అతని బంధువులంతా యోచించారు. విచిత్రంగా రామకృష్ణులు దానికి సమ్మతించడమే కాకుండా... తనకి కావల్సిన వధువు ఫలానా జయరాంబాటిలో ఉందని కూడా చెప్పి పంపారట. ఆయన చెప్పిన ఆనవాళ్లని వెతుకుతూ వెళ్లిన బంధువులకు అక్కడ శారదాదేవి కనిపించింది. ఆమె తల్లిదండ్రులతో అన్ని విషయాలూ మాట్లాడుకుని త్వరలోనే నిశ్చితార్థాన్ని జరిపించేశారు. అప్పటికి శారదాదేవి వయసు ఐదేళ్లు మాత్రమే! రామకృష్ణులకు 23 ఏళ్లు.
శారదాదేవికి 18 ఏళ్ల వయసు రాగానే రామకృష్ణునితో కలిసి ఉండేందుకు దక్షిణేశ్వరానికి చేరుకున్నారు. ఆమెను చూసిన వెంటనే రామకృష్ణులు ‘నన్ను ఈ ఐహిక ప్రపంచంలోకి దింపడానికే వచ్చావా?’ అని అడిగారట. దానికి శారదాదేవి చిరునవ్వుతో ‘లేదు! నేను మీ లక్ష్యసాధనలో సాయం చేసేందుకే వచ్చాను’ అని బదులిచ్చారట. అన్నట్లుగానే శారదాదేవి, రామకృష్ణుని కంటికిరెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆయన సాధనలకు ఏ అడ్డు లేకుండా జాగ్రత్తపడేవారు. భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం వారిది! రామకృష్ణుని తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ ఆ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. అలా భావించి ఆమెను షోడశోపచారాలతో పూజించిన సందర్భాలూ ఉన్నాయి.
శారదాదేవి ఒక పక్క భర్త అవసరాలను కనిపెట్టుకుంటూనే, ఆయన కోసం వచ్చే శిష్యుల కోసం వండిపెడుతూ ఉండేవారు. క్రమేపీ ఈ లోకం రామకృష్ణుని పరమహంసగా గుర్తించడంతో పాటుగా... శారదాదేవిని, మాతృమూర్తిగా భావించడం మొదలుపెట్టింది. రామకృష్ణులు 1880ల నాటికి గొంతు క్యాన్సర్‌తో బాధపడటం మొదలుపెట్టారు. అయినా శారదామాత ధైర్యాన్ని కోల్పోలేదు. మారిన ఆరోగ్యంతో ఆయన అవసరాలను మరింతగా గమనించుకుంటూ ఉండిపోయారు. 1886లో రామకృష్ణ పరమహంస మరణంతో ఆయన శిష్యగణం బిత్తరపోయింది. ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో పడిపోయారు. అలాంటి సమయంలో వారికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు.
రామకృష్ణుని మరణం తరువాత శారదామాత తీర్థయాత్రలకు బయల్దేరారు. అలా శ్రీకృష్ణుడు తన లీలలను సాగించిన బృందావనాన్ని చేరుకోగానే, ఆమెకు అనేక దివ్యానుభూతులు కలిగినట్లు చెబుతారు. తీర్థయాత్రలు ముగిసిన పిమ్మట శారదామాత, రామకృష్ణుని జన్మస్థానమైన కామార్పుకూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆమె పడరాని అవస్థలూ పడ్డారు. ఒక పక్క పేదరికంతో మరో పక్క పట్టించుకునేవారు లేకపోవడంతో ఆమె దారిద్ర్యాన్ని అనుభవించారు. అయినా మారుమాటాడకుండా కాలాన్ని గడిపారు. శారదామాత దురవస్థ గురించి తెలుసుకున్న రామకృష్ణుల శిష్యగణం, ఆమెను కోలకతాకు తిరిగి వచ్చేయమని ప్రాధేయపడ్డారు.
కోల్‌కతాకు చేరుకున్న శారదామాతను చూడగానే శిష్యుల సంతోషానికి అవధులు లేకపోయాయి. ఆమె కోసం ఒక నివాసాన్ని ఏర్పరిచి, ఆమె అవసరాలను గమనించుకోసాగారు. శారదామాతను చూసేందుకు, ఆమె దీవెనలను పొందేందుకు, ఆధ్యాత్మిక సూచనలు వినేందుకు తెరలుతెరలుగా శిష్యులు తరలి రాసాగారు. వివేకానందులు వంటి శిష్యులు సైతం ఆమె సలహాని అనుసరించిన తరువాతే ఏ నిర్ణయాన్నైనా అమలుపరిచేవారు. అలా రామకృష్ణుని మరణంతో దిక్కుతోచకుండా పోయిన ఆయన శిష్యులకు శారదామాత ఓ కొత్త ఆశగా చిగురించారు. శారదామాత కలలో సైతం కనిపించి ధైర్యం చెప్పిన సందర్భాలను కోకొల్లలుగా భక్తులు చెప్పుకోసాగారు.
రామకృష్ణ పరమహంస చనిపోయిన 34 సంవత్సరాల వరకూ శారదాదేవి తన శిష్యులను కాచుకున్నారు. అయితే 1920 నాటికి శారదామాత ఆరోగ్యం క్షీణించసాగింది. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టకపోవడం, తరచూ మలేరియా బారిన పడటంతో... ఆమె పరిస్థితి పూర్తిగా విషమించింది. 1920, జులై 20న ఆమె కైవల్యాన్ని సాధించారు. శారదాదేవి మరణించే కొద్ది రోజుల ముందుగా ఆమె చెప్పిన మాటలు, ఆమె పరిణతిని సూచిస్తాయి. ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. బదులుగా మీ లోపాలేమిటో గుర్తించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా సొంతం చేసుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో అంతా మీవారే అని గుర్తిస్తారు’ – ఇంతకంటే అమూల్యమైన సలహాను ఏ మాతృమూర్తి మాత్రం ఇవ్వగలదు. అందుకనే ఆమె అటు భారతీయ ఆధ్యాత్మికతకే కాదు... సంస్కృతికి, అనుబంధానికి కూడా ఒక గొప్ప ఉదహరణగా నిలిచిపోయారు.
- నిర్జర.