దేవకి కడుపున పుట్టిన మొదటి బిడ్డ ఎలా మరణించాడు..
దేవకి గర్భవతి అయింది. తమకు రక్షకుడైన శిశువును ప్రసాదించమని, ఆ శరణాగత రక్షకుని, ఆశ్రిత పారిజాతాన్ని, ఆ దంపతులు, తమ దయనీయ స్థితికి బాధపడుతూ ప్రార్థిస్తున్నారు. కాలమహిమగా నెలలు నిండాయి. దేవకి ప్రసవించింది.
ఈ గడ్డు స్థితిలోనే.... సాధువు, ధర్మమూర్తి అయిన అక్రూరున కంసుని వద్దకు రాయబారం పంపాలని యాదవ ప్రముఖులు తలిచారు. అష్టమగర్భ శిశువు కదా కంసుడిని వదించేది. ఇప్పుడు పుట్టినవాడు కేవలం ప్రథమ శిశువు. ఈ మొదటివాని వలన రాబోయే ప్రమాదంలేదు కాబట్టి, కంసుడు శిశుహంతకుడు కాకుండా నివారిద్దామని తలచిన యాదవులు అక్రూరుని పెద్దగా పెట్టుకుని కంసుని వద్దకు చేరారు.
అదే సమయంలో తానన్నమాట ప్రకారం జన్మించిన ప్రథమ శిశువును తీసుకుని వసుదేవుడు కంసుని వద్దకు వచ్చాడు. అప్పుడు కంసుడు తన నమ్మకమైన అనుచరులతో, మగథ సేనా వీరులతో, తన సింహాసనంపై ఠీవిగా కూర్చుని ఉన్నాడు. కనీసం వచ్చిన యాదవ ప్రముఖులకు కనీస మర్యాద కూడా చేయలేదు. అయినా ధర్మాత్ముడైన అక్రూరుడు వినయ విధేయతలతో చేతులు జోడించి -
"రాజా! కరుణించి ఇప్పుడు జన్మించిన బాలుడు, అర్భకుడు. ఇతడు నీకేమి అపకారం చెయ్యగల్గుతాడు ? ఆలోచించు. శిశుహత్యలు వద్దు. శిశు హంతకునిగా పేరు పొందవద్దు. దానంత పాపం మరొకటి లేదు. ఇది ఆర్యులకు తగదు. ఇక నీకు ప్రమాదకారుడంటావా, అష్టమ గర్భశిశువు కాని ఈ ప్రథమ జన్మశిశువు కాదు. అయినా నీవంటి వీరాధీవీరుని, ఈ బాలురు ఎదిరించ నిలువగలరా ? వీరినుండి వచ్చే ప్రమాదమెంత ? దీనిని నీవు అరికట్టలేవా ? ఇది నీకు అసాధ్యమా? అన్నాడు.
"సర్వము సాధ్యమే. అందుకే ప్రమాదాలను, ప్రమాదకారులను ఆదిలోనే త్రుంచి వేయడం తెలివైనవారి పని. అదే నేను చేస్తున్నాను. అంటాడు కంసుడు.
ఆ మాటలు వినగానే వసుదేవుడు.. "రాజా! "నా విష్ణుః పృథ్వీ పతిః" అన్నారు. రాజంటే.... సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే. చతుర్భుజాలతో ధర్మసంరక్షుడివై, నీ ప్రజలను కన్నపిల్లలవలె పాలించి పోషించి, రక్షించాలి. ఇది శాస్త్ర ధర్మం అన్నాడు.
వారి మాటల్ని లక్ష్యపెట్టక తిరస్కార భావంతో, వికటాట్టహాసం చేసాడు సంసుడు. ఆ వికృత నవ్వుతో ఉచ్ఛనీచాలు మరచినట్లు ... మీ దేవుడంత కరుణామయుడైతే, అతన్నే ఆశ్రయించకపోయావేం? సహాయపడమని ఏడ్వకపోయారా ? అని దెప్పి పొడుస్తున్నట్లు మాట్లడాడు. తరువాతే..నేను దేవుడిని కాను కంసుడను. ఉగ్రసేనుని కుమారుడను. ఆ దేవుడితో నన్ను పోల్చకండి. నాకు పాపభీతి, కరుణ, కొంచెమైనా లేదని తెలుసుకుంటే చాలా సంతోషిస్తాను! అన్నాడు కంసుడు.
అయినా ధర్మాత్ముడు అయిన అక్రూరుడు, వసుదేవుడు తమ మనసులో ఉన్న విషయాలను కంసుడికి చెబుతూనే ఉన్నారు. వేదనను వివరిస్తున్నారు. ఇది వాదన కాదు, మా వేదనని కూడా తెలిపారు. కంసుని ముందు వారి వాదన, వేదన, మొత్తం వృథా అయింది. కంసుడు తన సింహాసనం నుండి లేచాడు. తిరస్కారభావంతో వారిని చూస్తూ ..
వసుదేవుని చేతులలో నుండి ఆ పురిటబిడ్డను గబుక్కున లాక్కున్నాడు. కాళ్ళు పట్టుకుని ఆ బిడ్డను నేలకేసి కొట్టాడు. అక్రూర, వసుదేవులు బిత్తరపోయారు. ఇతర యాదవ ప్రముఖులు భయకంపితులయ్యారు. ఈ విధంగా వసుదేవుడి మొదటి బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.
*రూపశ్రీ.
