పాంచజన్యం ఎప్పుడు ఎలా ఉద్భవించింది... దీని వెనుక కథ ఇదే..!

 

 

పాంచజన్యం మహావిష్ణువు తన చేత ధరించిన శంఖం.  సాధారణంగానే హిందూ సంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి.  శంఖం నుండి వెలువడే శబ్దానికి చాలా శక్తి ఉంటుంది. శంఖం ధ్వని, దాని శక్తి  చాలా వవిత్రమైనది, మంగళకరమైనది.  ఈ శబ్దం విశ్వం అంతా వ్యాపించి ఉంటుందని అంటారు.  అయితే ఈ పాంచజన్యం శంఖం, లక్ష్లీదేవి రెండూ కూడా   సాగరమథనం నుండి లభించినవేనట.  లక్ష్మీదేవి,  పాంచజన్యం శంఖం సోదరీసోదరులని అంటారు. ఎక్కడైతే శంఖాన్ని నిత్యం పూజిస్తుంటారో.. శంఖానాదం చేస్తుంటారో.. అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందట.


 ఆయుర్వేదం ప్రకారం శంఖం ఊదడం వల్ల గుండె,  ఊపిరితిత్తులు బలపడతాయి. యోగ కార్యకలాపాలు,  ధ్యానం, ధారణ, సమాధి కోసం గుండె,  ఊపిరితిత్తులు ఆరోగ్యంగా  దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే యోగా, ప్రాణాయామం,  భగవధ్యానం మొదలైన వాటిని సరిగ్గా చేయగలరు. సముద్ర మథనంలో అయిదు వర్గాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు - రాక్షసులు, దేవతలు, నాగులు, గంధర్వులు,  ఋషులు, మునులు, కాబట్టి దీనిని పాంచజన్య అని కూడా పిలుస్తారట. పాంచజన్యం ఉద్బవించడం వెనుక  ఈ ఐదుగురి  కృషి ఉంది.


వేదాలు,  పౌరాణిక గ్రంధాలలో పాంచజన్యం  ధ్వని, దాని  ప్రతిధ్వని విజయం, కీర్తి, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కౌరవ-పాండవుల మధ్య మహాయుద్ధం ప్రారంభమైనప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు మొదటగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. యుద్ధంలో ధర్మాత్ములైన పాండవుల విజయం ఖాయమని దాని అర్థమట. పాంచజన్య స్వరూపం కూడా ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రపంచంలోని గొప్ప యుద్ధంలో భగవంతుని దయతో విజయం సాధించిన తరువాత మోక్షమనే అమృతాన్ని సేవించే హక్కు పవిత్రమైన వ్యక్తికి మాత్రమే ఉంటుందని పురాణ కథలు చెబుతాయి.


శంఖం ఊదడం వల్ల సాధకుడు బ్రహ్మ శబ్దంతో ఏకమవుతాడట. దాని ప్రతిధ్వని కారణంగా ఇంద్రియాల కదలికకు విశ్రాంతి లభించి మనసు ప్రశాంతంగా  మారుతుందట.  బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని రుచి చూస్తుందట. పాంచజన్య ఆవిర్భావం తరువాతే ధన్వంతరి  అమృత పాత్రతో కనిపించాడు.  ఇక్కడ దాని ఆధ్యాత్మిక అర్థం ఇంద్రియాలు అంతర్ముఖంగా,  మనస్సు ప్రశాంతంగా ఉంటే.. భగవంతుని భక్తి అనే అమృతాన్ని పొందగలడు అని.

                                   *రూపశ్రీ.


More Mysteries - Miracles