జయదేవుడి భక్తి ఎంత గొప్పదో తెలుసా

!

సంగీత నృత్యాలున్నచోట జయదేవుడి పాటలు తప్పకుండా ఉంటాయి. జయదేవుడి 'గీతగోవిందం' ఎంతో ప్రాచుర్యం పొందింది. వంగదేశంలో జన్మించిన జయదేవుడు, జగన్నాథస్వామి భక్తుడు. మధురభక్తి ద్వారా భగవంతుణ్ణి ఆరాధించాడు. సంస్కృతంలో రచించిన 'గీత గోవిందం'లో రాధాకృష్ణుల దివ్య ప్రేమను రసవత్తరంగా వర్ణించాడు.

అప్పట్లో ఒరిస్సాను సాత్యకి అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కూడా కవి. జగన్నాథస్వామి వైభవాన్నీ, గుణ గణాలనూ స్తుతిస్తూ కొన్ని పాటలు వ్రాశాడు. కానీ ప్రజలు జయదేవుడి అష్టపదులనే మెచ్చుకునేవారు. అది రాజుకు బాధ కలిగించింది. జయదేవుడి అష్టపదులు, తన పాటలు ఉన్న గ్రంథాలను గుడి లోపల ఉంచి బయట తలుపులు వేశాడు. ఆశ్చర్యకరంగా తెల్లవారేసరికి జయదేవుని అష్టపదులు భగవంతుని సన్నిధిలో ఉండగా, రాజు రచించిన గ్రంథం గుడి వెలుపల ఉంది. భగవంతుడి నిర్ణయాన్ని అంగీకరించాడు రాజు.

వంగదేశాన్ని పరిపాలించిన లక్ష్మణ సేనుని ఆస్థానంలో ప్రముఖ కవి జయదేవుడు. అతనికి 'కవిరాజు' అనే బిరుదు ఉండేది. జయదేవుని అర్ధాంగి పద్మావతి. ఆమె అపురూప లావణ్యవతే కాకుండా, గొప్ప నాట్యకత్తె. పద్మావతీ జయదేవులది అన్యోన్య దాంపత్యం. జయదేవుడు 'గీత గోవిందం'లోని శ్లోకాలు పాడుతూ ఉంటే, పద్మావతి నాట్యం చేసేదట. జయదేవుడు, రాజుగారి అభిమానం పొందిన విధంగానే పద్మావతి కూడా రాణిగారి ఆదరణ, అభిమానం చూరగొంది. వారిరువురూ ఎంతో ఆత్మీయంగా ఉండేవారు.

ఒకనాడు పద్మావతి, రాణిగారి అంతఃపురంలో ఉండగా, ఒక సేవకుడు వచ్చి "మహారాణీ! మీ సోదరుడు చనిపోయాడు. అతని భార్య సహగమనం చేసింది" అనే వార్తను వినిపించాడు. రాణి చాలా దుఃఖపడింది. పద్మావతి మౌనం చూసి, రాణి ఆమెను కారణం అడిగింది. అప్పుడు పద్మావతి, "మహారాణీ! పతివ్రత అయిన . తన భర్త మరణవార్త వినగానే దేహత్యాగం చేస్తుంది. సహగమనం చేయాల్సిన పని లేదు. సూర్యుణ్ణి విడిచి సూర్యకాంతి ఏ విధంగా మనలేదో అలాగే భర్తను విడిచి భార్య జీవించి ఉండలేదు. అందుచేత సహగమన వార్త నాకు ఆశ్చర్యం కలిగించలేదు” అని సమాధానమిచ్చింది. మహారాణికి అది విని చాలా కోపం వచ్చింది. తగిన సమయం వచ్చినప్పుడు ఆమె పతిభక్తిని పరీక్షించాలి అని భావించింది.

రాజుగారు జయదేవుడితో కలసి వేటకు వెళ్ళిన సమయంలో పద్మావతి, రాణిగారి అంతఃపురంలో ఉంది. వారిరువురూ మాటల్లో మునిగి ఉన్న సమయంలో, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఒక చెలికత్తె వచ్చి, "అమ్మా! మహారాణీ! రాజుగారు, కవిగారు వేటలో ఉన్న సమయంలో ఒక పులి వచ్చి మీద పడి కవిగారిని చంపివేసింది" అని చెప్పింది. ఆ మాటలు చెవిన పడిన మరుక్షణమే. పద్మావతి ప్రాణాలను విడిచింది. జరిగిన సంఘటనతో రాణిగారు నిశ్చేష్టు రాలైంది. వేట నుంచి తిరిగి వచ్చిన రాజుగారు తన భార్య అవివేకం వల్ల పద్మావతి ప్రాణాలు పోయిన సంగతి తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు. క్షమించాల్సిందిగా జయదేవుణ్ణి దీనంగా వేడుకున్నాడు.

అప్పుడు జయదేవుడు, "ప్రభూ! ఇందులో ఎవరి తప్పు లేదు. అంతా విధి విలాసం. భగవంతుని నిర్ణయం" అని పలికి, మరణించిన తన అర్ధాంగి పద్మావతి చెంత కూర్చుని, తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి మనసారా ప్రార్థించాడు. తన్మయంగా హరి గుణగానం చేయసాగాడు. ఆ భక్తుడి గానామృతానికీ, అనన్య మధురభక్తికీ కరిగిపోయిన మువ్వ గోపాలుడు పద్మావతి ప్రాణాలను తిరిగి అనుగ్రహించాడు. పద్మావతి పతిభక్తినీ, జయదేవుని శ్రీకృష్ణభక్తినీ తలచుకుని రాజు, రాణి, ప్రజలూ ఆశ్చర్యపోయారు.

                                        *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories