ఆదిశంకరుల రచనలు.. అవి రూపుదిద్దుకున్న సందర్భాలు ఇవే...

అపర శంకరుని అవతారమైన శ్రీశంకర భగవత్పాదులు కారణజన్ములు. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే సన్న్యసించి, పదహారేళ్ళ లోపే వేదాంత రహస్యాలకు భాష్యాలు వ్రాశారు. అద్భుతమైన కవితాశక్తితో ఆసేతు హిమాచలంలోని ప్రతి దైవీ - దేవతా క్షేత్రంలో ఆ క్షేత్రపాలకులైన దైవాలనూ, దైవీ మూర్తులనూ కీర్తిస్తూ స్తోత్రాలు, అష్టకాలు, సర్వదేవతా.. స్తోత్రాలు ముందు తరాల వారికి అందించిన మహానుభావుడు ఆయన.

దశశ్లోకి: 

నర్మదానదీ తీరంలోని ఒక గుహలో గోవింద భగవత్పాదుల వారిని శంకరులు కలుసుకున్నారు. “నీవు ఎవరు" అని అడిగిన గురువు గారికి 'దశశ్లోకి' అనే 10 శ్లోకాలలో తాను ఈ శరీరాన్ని కాననీ, పరమాత్మ  స్వరూపుడననీ చెప్పారు. గోవింద భగవత్పాదుల వారు ఆనందించి శంకరులకు సన్న్యాసదీక్షను ప్రసాదించారు.

బ్రహ్మసూత్ర భాష్యం: 

ఒకమారు నర్మదా నదికి వరదలు రావడంతో గోవింద భగవత్పాదులు ఆశ్రమం కూడా మునిగి పోయే పరిస్థితి వచ్చింది. శంకరులు అది గ్రహించి తన కమండలాన్ని నర్మదా నదికి అభిముఖంగా నేలపై పెట్టి నిశ్చలంగా ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఆ కమండలం వరద నీటిని ఆకర్షించడంతో ఆశ్రమానికీ చుట్టుపక్కల గ్రామాలకీ వరద ప్రమాదం తప్పింది. బయటకు వచ్చిన గోవింద భగవత్పాదులు జరిగింది గ్రహించారు.

వ్యాసమహర్షి అంతక్రితమే గోవింద భగవత్పాదులతో “నర్మదానది వరద ఆపగలిగిన వ్యక్తి బ్రహ్మసూత్రాలకీ, ఉపనిషత్తులకీ, భగవద్గీతకీ (ప్రస్థాన త్రయానికి) వ్యాఖ్యానం వ్రాయగల మహోన్నతుడు" అని చెప్పారు. అది గుర్తుకు వచ్చి శంకరులకు ఆ బాధ్యతను అప్పగించారు గోవింద భగవత్పాదులు. 

లఘుస్తోత్రం: 

 శంకరులు కాశీయాత్రకు బయలు దేరారు. తోవలో ప్రభాకరుడనే వ్యక్తి మూగవాడైన తన కొడుకును శంకరుల దగ్గరకు తెచ్చి అతడి మూగతనం పోగొట్టాల్సిందిగా వేడుకున్నాడు. అప్పుడు శంకరులు అమ్మవారిపై ఒక 'లఘు స్తోత్రం' ఆశువుగా చెప్పారు. తన చేతిని (హస్తం) ఆ బాలుని శిరస్సు మీద ఉంచి (హస్తమస్తక ప్రయోగం) 

"నువ్వెవరివి నాయనా” అని ప్రశ్నించారు. వెంటనే ఆ బాలుడికి మాటలు వచ్చాయి. "స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా"  'నిత్య సత్య స్వరూపుడనైన ఆత్మను నేను' అని శ్లోకాల రూపంలో ఆ బాలుడు జవాబిచ్చాడు. అప్పుడు శంకరులు ఆ బాలుడికి 'హస్తామలకుడు' అని పేరు పెట్టి సన్న్యాస దీక్ష ఇచ్చారు. ఆ శ్లోకాల కృతికి స్వయంగా శంకరులే భాష్యం వ్రాసి, ఆ కృతికీ కృతికర్తకూ అపూర్వమైన గౌరవం ప్రసాదించారు.

చర్చాస్తుతి: 

మరొక శిష్యుడు పుట్టుకతో చెవిటివాడు. అతడి చెవిలో 'చర్చిస్తుతి' అనే అమ్మ వారి స్తోత్రం చదువుతూ అతడి చేత పలికించారు. అతడికి వినికిడి శక్తి వచ్చింది. కాలనాథుడు అనే మరొక శిష్యుడు 'తోటకాష్టకం' అనే స్తోత్రం తోటక వృత్తంలో చెప్పాడు. అతనికి తోటకాచార్యుడు అనే పేరుతో సన్న్యాస దీక్షను అనుగ్రహించారు. కాగా ఆది శంకరుల వారికి ప్రథమ శిష్యుడు కాశీలో లభించాడు. ఆది శంకరులను దైవంగా నమ్మిన అనన్య భక్తుడు విష్ణుశర్మ. ఇతనికి సనందుడు అని పేరు పెట్టి సన్న్యాసదీక్షను అనుగ్రహించారు.

భజగోవింద స్తోత్రం:

 శంకరుల వారికి మొత్తం పధ్నాలుగు మంది శిష్యులు. శంకర భగవత్పాదులు వ్రాసిన 'భజగోవింద ద్వాదశ మంజరికా స్తోత్రం' శ్లోకాలకు ఈ పధ్నాలుగు మందీ ఒక్కొక్క శ్లోకం చెప్పి, మొత్తం 26 శ్లోకాలుగా భజగోవింద శ్లోకాలను చేశారు.

                                     *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories