వివేకానందకు శారదాదేవి ఆశీస్సులు
స్వామీ వివేకానంద ప్రసంగించడం కోసం అమెరికాకు బయలుదేరారు. బయలుదేరే ముందు ఆయన శారదాదేవి వద్ద ఆశీస్సులు పొందాలనుకున్నారు. అనుకున్నట్టే స్వామీ వివేకానంద శారదా మాత వద్దకు వెళ్ళారు. "అమ్మా...నేను అమెరికాలో జరిగే ప్రపంచ మతాల మహాసదస్సులో ప్రసంగించడానికి వెళ్తున్నాను. మీ ఆశీస్సులు కోసం వచ్చాను" అని అన్నారు స్వామీ వివేకానంద. "అమెరికా సదస్సులో ఏం మాట్లాడుతావు" అని అడిగారు శారదామాత. "హిందూ మత తత్వంపై మాట్లాడుతాను. అలాగే ధర్మాల గురించి మాట్లాడుతాను. మన భారతదేశంలోని మతాలపై మాట్లాడుతాను" అన్నారు స్వామీ వివేకానంద. "అదే అడుగుతున్నాను...ఏం మాట్లాడుతావని?" అని ఆమె మళ్ళీ అడిగారు. "అమ్మా, గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస నాకు చెప్పిన విషయాలను మరింత విడమరిచి చెప్తాను" అన్నారు స్వామీ వివేకానంద. "అన్నీ నిజమనా? అన్నది అమ్మ ప్రశ్న. "చెప్పిన వాళ్ళల్లో తొంభై శాతం మంది అబద్ధం చెప్పారు. పది శాతం మంది నిజం చెప్పారు. నిజం చెప్పిన పది శాతం మంది రాయకుండా వెళ్ళిపోయారు. అది నమోదు చేయడమే నా ప్రధమ కర్తవ్యం" అని చెప్పారు స్వామీ వివేకానంద. అప్పుడు వంటింట్లో ఉన్న శారదా మాత స్వామీ వివేకానందతో "ఆ కత్తి తీసుకొచ్చి ఇవ్వు" అన్నారు. స్వామీ వివేకానంద కత్తి తీసుకొచ్చి శారదా మాతకు అందించారు. శారదాదేవి ఆనందంతో ఆ కత్తిని అందుకుంటూ " నీ ప్రయాణం విజయవంతమవుతుంది" అని దీవించారు. "నువ్వు కత్తి నాకు అందిస్తున్నప్పుడు కత్తి వెనకున్న మూల భాగాన్ని ఇచ్చినట్లే తత్వమూలాన్ని అక్కడికొచ్చే వారి చేతికివ్వు" అని శారదా మాత సూచించారు. అలాగే అని స్వామీ వివేకానంద అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లి ప్రపంచ మతాల సదస్సులో ప్రసంగించి హర్షద్వానాలు అందుకోవడం తెలిసిందేకదా?
- యామిజాల జగదీశ్