భగవంతుడి పైనుంచి మనసు చెదరకూడదు
మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన జ్ఞాని ఏకనాథుడు. పదో ఏటనే ఆయన మనసు భగవంతుడిపై కేంద్రీకృతమైంది. ఆ వయస్సు పిల్లలలాగా కాకుండా ఆయన ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండేవారు. ఒకసారి, "ఏకనాథా.... నువ్వు దేవగిరికి వెళ్లి జనార్ధన్ పంత్‌ని చూసి రా. ఆయన నీకు గురువుగారై ఉండి ఆధ్యాత్మికంగా ఒక మంచి దారి చూపుతారు" అని ఎవరో ఒక వ్యక్తి చెప్తున్నట్టు అనిపించింది. ఎవరా మాటలు చెప్తున్నారా అని చుట్టూ చూసారు. కానీ దగ్గరలో ఎవరూ కనిపించలేదు. చెప్పింది ఎవరైతేనేం అనుకుని ఆయన ఆలస్యం చెయ్యకుండా దేవగిరికి వెళ్ళారు. జనార్ధన్ పంత్‌ని కలిసారు. ఆయన పాదాలకు నమస్కరించిన ఏకనాథుడు "నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. భగవంతుడి కృప నాకు లభించేటట్లు ఒక దారి చూపండి" అని మనసులోని మాటను చెప్పుకున్నారు. దేవగిరి ప్రాంతానికి దివానుగా ఉన్న జనార్ధన్ పంత్ తమ శిష్యుడిగా ఏకనాథుడిని స్వీకరించారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఏకనాథుడు గురువుగారికి భక్తిభావంతో శుశ్రూష చేసారు. అది ఒకరోజు సాయంత్రం వేళ. ఏకనాథుడికి ఒక పద్దుల పుస్తకం ఇచ్చి ఇందులో ఒక రూపాయి తగ్గినట్టు, తప్పు ఎక్కడ జరిగిందో చూడమని జనార్ధన్ పంత్ అన్నారు. ఏకనాథుడు రాత్రంతా నిద్రపోకుండా ఆ లెక్కంతా చూసారు. తెల్లవారుతున్న వేళ ఏకనాథుడు ఆ తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టారు. ఆయన ఆనందానికి అంతులేదు. తప్పు ఎక్కడ దొర్లిందో గురువుగారికి పట్టరాని ఆనందంతో చెప్పారు ఏకనాథుడు. అప్పుడు జనార్ధన్ పంత్ "లెక్కలో జరిగిన ఓ చిన్న తప్పును కనిపెట్టడానికే నువ్వు ఇన్ని గంటలు శ్రమించావు. మనసుని మరి దేనిపైనా మరల్చకుండా ఆ పొరపాటు తెలుసుకున్నావు. అటువంటప్పుడు పరమాత్ముడైన ఆ భగవంతుడిని కనుక్కోవడానికి మరెంతగా మనసుని అటూ ఇటూ చెదరిపోనివ్వకుండా శ్రమించాలో ఆలోచించు. ఓ చిన్న లెక్కలో జరిగిన తప్పుని కనిపెట్టినందుకే ఇంతగా ఆనందిస్తున్నావు..... జీవితమనే అధ్యాయంలోని లెక్కల్లో ఉండే తప్పులను కనిపెట్టి వాటిని దిద్దుకుంటే మరెంత ఆనందం కలుగుతుందో ఆలోచించు." అని చెప్పారు. ఇలా తానేమిటో తెలియచెప్పిన గురువుగారికి మరొక్కసారి పాదాభివందనం చేసి ఏకనాథుడు తనను తాను పరీక్షించుకోవడానికి దీర్ఘ ధ్యానంలోకి ప్రవేశించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు ఏకనాథుడు.
- యామిజాల జగదీశ్