రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? - 2

/strong>తెలుసా? - 1
రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? - 1రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 2

రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? - 2

 

Shri Rudram or the Namakam (chapter five) describes the name or epithets of Rudra, which ... There are eleven hymns; each has its own purpose and meaning.

 

అనువాకము 5.
యజుస్సు 1.
నమో భవాయచ రుద్రాయచ.
ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.
నమశ్శర్వాయచ పశుపతయేచ.
పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము.
యజుస్సు 3.
నమో నీలగ్రీవాయచ శితి కంఠాయచ.
నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 4.
నమః కపర్దినేచ వ్యుప్త కేశాయచ.
జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము.
యజుస్సు 5.
నమస్సహస్రాక్షాయచ శతధన్వనేచ.
ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమో గిరిశాయచ శిపివిష్టాయచ.
కైలాసమున ఉండువాఁడును, శయనించువాఁడును, విష్ణువును తన హృదయమున ధరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమో మీఢుష్టమాయచేషుమతేచ.
మేఘ రూపమున మిక్కిలి వర్షము కురిపించువాఁడును, బాణములు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమో హ్రస్వాయచ వామనాయచ.
(అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా నున్నట్టియును, (వ్రేళ్ళు మున్నగు అవయవముల సంకోచమువలన) వామనుఁడుగా నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమోబృహతేచవర్షీయసేచ.
ఆకారముచే ప్రౌఢుఁడైనట్టియు, గుణములచే సమృద్ధుఁ డైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.
నమోవృద్ధాయచ సంవృద్ధ్వనేచ.  
వయసుచే అధికుఁడైనట్టియు, శృతులచే బాగుగా వృద్ధి పొందునట్టివాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.
నమో అగ్రియాయచ ప్రథమాయచ.
జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో ముఖ్యుఁడును అగు పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 12.
నమ ఆశవే చాజిరాయ చ.
అంతటను వ్యాపించినట్టి గమనకుశలుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 13.
నమశ్శీఘ్రియాయచ శీభ్యాయచ.
శీఘ్రముగా పోవు వాఁడును, ఉదక ప్రవాహముననున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 14.
నమఊర్మ్యాయచా వస్వన్యాయచ.
తరంగములతో గూడి యున్నట్టియు, ధ్వని రహితమైన స్థిరమైన జలమున ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 15.
నమస్స్రోతస్యాయచ ద్వీప్యాయచ.
ప్రవాహమున నున్నట్టియు, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.
అనువాకము 5 సమాప్తము.
అనువాకము 6.
యజుస్సు 1.
నమోజ్యేష్ఠాయచ కనిష్ఠాయచ.
విద్య ఐశ్వర్యము మున్నగు వానిచే జ్యేష్ఠుఁడైనట్టి వాఁడున్నూ విద్యాదులతో కనిష్ఠుఁడైన వాడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 2.
నమః పూర్వజాయచాపరజాయచ.
జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్టి జగ దవసాన సమయమున అగ్ని రూపమున జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 3.
నమోమధ్యమాయచాపగల్భాయచ.
మధ్య కాలమున దేవ తిర్య గాది రూపమున జన్మించి నట్టియును, ప్రరూఢములు కాని ఇంద్రియములు కలవాడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 4.
నమో జఘన్యాయచ బుధ్నియాయచ.
గవాదులపశ్చాత్భాగమున వత్సాది రూపమున నున్నట్టియును, వృక్షాదుల మూలమున శాఖాదుల రూపమున నున్నట్టి పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 5.
నమస్సోభ్యాయచ ప్రతిసర్యాయచ.
పుణ్య పాపములతో కూడుకొన్నవాఁడును, రక్షాబంధమున కర్హమైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమో యామ్యాయ క్షేమ్యాయచ.
యమలోకమునఁ బాపులను శిక్షించు వాని రూపమున జన్మించి నట్టియును, మోక్షమున కర్హుడై యున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ.
సర్వ సస్యములతో నిండిన భూమితో ధాన్యాది విశేష రూపమున ఉన్నట్టియు, మేడి, నక్కు నాగలి రూపమున భూమిని దున్ని, అందలి సారమును వెలిబుచ్చునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమశ్శ్లోక్యాయచావసాన్యాయచ.
వేదమంత్రములచే తెలియ దగు మహిమ కలవాఁడై, వానిలోనున్నట్టియును, వేదాంతములైన ఉపనిషత్తులచే నిరూపింప దగు తత్వము కలవాఁడు కాన వానిలో నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమో వన్యాయచ కక్ష్యాయచ.
వృక్షాది రూపమున నున్నట్టియును, లతాది రూపమున నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.
నమశ్శ్రవాయచ ప్రతిశ్రవాయచ. 
శబ్ద రూపుఁడును ప్రతి ధ్వని రూపుఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11
నమ అశుషేణాయచాశురథాయచ.
వేగముగా పోవు సేన కలిగినట్టి, వేగముగా పోవు రథము కలిగినట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.
నమశ్శూరాయచావభిందతేచ.
యుద్ధమున ధైర్యము కలవాఁడును, శత్రువులను సంహరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 13.
నమో వర్మిణేచ వరూధినేచ.
కవచము కలిగినట్టియు, గృహము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 14.
నమో బిల్మినేచకవచినేచ.
బిలము ఉపమానముగా కలదియును, యుద్ధమున శిరో రక్షకమునగు కిరీటము కలవాఁడును, శరీర రక్షకమైన కవచము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.
నమశ్శ్రుతాయచ శ్రుత సేనాయచ.
వేద ప్రసిద్ధుఁడైనట్టియు, శత్రు నిగ్రహమందు ప్రసిద్ధమైన సేన కలవాఁడునగు శివునకు నమస్కారము.
అనువాకము 6 సమాప్తము.

అనువాకము 7.
యజుస్సు 1.
నమో దుందుభ్యాయచాహన్యాయచ.
భేరీ నుండి బయల్వెడలిన శబ్దము స్వరూపముగా కలవాఁడును, దుందుభిని మ్రోగించు దండముతో మొత్తుటచే బయల్వెడలిన నాదము రూపముగా కలవాఁడును, వంశ దండోద్భవుఁడు అగు శివునకు నమస్కారము.
యజుస్సు 2.
నమోధృష్ణవేచ ప్రమృశాయచ.
యుద్ధమున పలాయన రహితుఁడును, పర సైన్య వృత్తాంతమును పరామర్శించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 3.
నమో దూతాయచప్రహితాయచ.
స్వామి వృత్తాంతములను స్వస్వామి జనులకు తెలియ జేయుటలో కుశలుఁ డైనట్టియు, స్వామిచే పంపఁ బడిన పురుషుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 4.
నమో నిషఙ్గిణేచేషుధిమతేచ.
ఖడ్గము కలవాఁడును బాణాధారమైన అమ్ముల పొది కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 5.
నమస్తీక్ష్ణేషవేచాయుధినేచ.
వాడి బాణములు కలవాఁడును, బహ్వాయుధములు కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమస్స్వాయుదాయచసుధన్వనేచ.
శోభనమైన త్రిశూల రూపమగు ఆయుధము కలవాఁడును, శోభనమైన పినాక రూపమగు ధనుస్సు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమస్సృత్యాయచ పథ్యాయచ.
పాద సంచార యోగ్యమైన క్షుద్ర మార్గమునకు అర్హుఁడును, రథాశ్వాది సంచార యోగ్యమైన ప్రౌఢమార్గము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమః కాట్యాయచ నీప్యాయచ.
కుత్సితమైన జలము అనగా అల్ప జలము ప్రవహించు చోటును కటము అందురు. అందు జల రూపమున నున్న శివుఁడు కాట్యుఁడు. అతనికి నమస్కారము. అథో ముఖము గాను, అడ్డము గాను జలము ప్రవహించు చోటను జల రూపమున నున్న శివునకు నమస్కారము.
అనువాకము 7 సమాప్తము.

అనువాకము 8.
యజుస్సు 1.
ఓం నమస్సోమాయచ రుద్రాయచ.
ఉమతో గూడి యున్నట్టియు, సకల జీవుల రోదన హేతువైన దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.
నమస్తామ్రాయచారుణాయచ.
ఉదయ కాలమున ఆదిత్య రూపుఁడగుటచే అత్యంత రక్త వర్ణుఁడై ఉన్నట్టియు, ఉదయానంతరమున ఇంచుకంత రక్త వర్ణుఁడై ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 3.
నమశ్శంగాయచ పశుపతయేచ.
సుఖమును పొందించు వాఁడును, సుఖము నుత్పాదించు వాఁడును, భయ హేతువులైన పాప రోగ చోరాదుల నుండి రక్శించు వాఁడును అగు  మహా దేవునకు నమస్కారము.
యజుస్సు 4.
నమ ఉగ్రాయచ భీమాయచ.
విరోధులను నశింప జేయుటకు క్రోధ యుక్తుఁ డైనట్తి వాఁడును, దర్శన మాత్రము చేత విరోధులకు భయ హేతు వైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 5.
నమో అగ్రేవధాయచ దూరేవధాయచ.
అగ్రమునందు వధ కలవాఁడును (ముందున్నవానిని సంహరించువాఁడు) దూరమునందు వధ కలవాఁడును, అగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమోహంత్రేచహనీయసేచ.
దూర సమీప వర్తి శత్రువులను ధ్వంసము చేయువాఁడును, శత్రు ధ్వంసము చేయువాఁడును, సర్వాతిశాయి శక్తిచే సర్వులను సంహరించు వాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః.
కల్పవృక్షాది స్వరూపుఁడును, హరిత వర్ణములును, కేశ సదృశములునగు ఆకులు గల వృక్షములు స్వరూపముగా కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమస్తారాయ.
ఓంకార రూపమైన ప్రణవముచే ప్రతిపాదింపఁబడు శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమశ్శంభవేచమయోభవేచ.
సుఖము నుత్పాదించు వాఁడును, లోకములకు సుఖము భావించు వాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 10.
నమశ్శంకరాయచ మయస్కరాయచ.
విషయ సుఖములను జేకూర్చు వాఁడును, మోక్ష సుఖమును జేకూర్చువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.
నమశ్శివాయచ శివతరాయచ.
కల్యాణ స్వరూపుఁడై స్వయముగ నిష్కల్మషముగ నుండు వాఁడును, మిక్కిలి కల్యాణ స్వరూపుఁడుగా నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.
నమస్తీర్థ్యాయచ కూల్యాయచ.
ప్రయాగాది తీర్థములందు సన్నిహితుఁడై యుండునట్టియును, నదీ తీరములందు ప్రతిష్టింపఁబడిన లింగరూపమున నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 13.
నమ పార్యాయచ వార్యాయచ.
సంసార సముద్రము దాటించి, మోక్ష కాములచే ధ్యానింప దగిన వాఁడును, సంసార మధ్యమున నున్నవారికి కామ్య ఫలదుండునగు శివునకు నమస్కారము.
యజుస్సు14.
నమః ప్రతరణాయచోత్తరణాయచ.
గొప్ప మంత్ర జపాదుల యొక్క రూపము వలనఁ బాప తరణమునకు హేతువైనట్టియు, తత్వ జ్ఞాన రూపమున సంపూర్ణముగా సంసారము నుండి దాటించు వాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.
నమ ఆతార్యాయచాలాద్యాయచ.
జీవ రూపమున మరల సంసార గమనమునకు అర్హుఁడైనట్టియు, సంపూర్ణముగా కర్మఫలము ననుభవించు జీవుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 16.
నమశ్శష్ఫ్యాయచ ఫేన్యాయచ. 
గంగా తీరాదులతో జన్మించు కుశాంకురాదులకు అర్హుఁడైనట్టియును, నదీ మధ్య గత ఫేనమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 17.
నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ.
సికతకు అర్హుఁడైనట్టియును, ప్రవాహమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
అనువాకము  8 సంపూర్ణము.

అనువాకము 9.
1) నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచ.
ఊషర క్షేత్రములం దుండునట్టియును, పది మంది నడుచు త్రోవలోనుండు నట్టి శివునకు నమస్కారము.
2) నమకిగ్ ం శిలాయచక్షయణాయచ.
కుత్సితములు అనగా క్షుద్రములగు శిలలు గల ప్రదేశముల నుండునట్టి, నివాస యోగ్య ప్రదేశమునం దుండునట్టి శివునకు నమస్కారము.
3) నమః కపర్దినేచ పులస్తయేచ.
జటా బంధము కలవాఁడును భక్తుల యెదుట నుండు నట్టి శివునకు నమస్కారము.
4) నమో గోష్ఠ్యాయచ గృహ్యాయచ.
గోశాలలో నుండునట్టియు, సామాన్య గృహములలో నుండునట్టి శివునకు నమస్కారము.
5) నమస్తల్ప్యాయచ గేహ్యాయచ.
తల్పము నందును మంచము పైని శయనించునట్టియును, ధనికుల ప్రాసాదమునం దుండు వాఁడు నగు శివునకు నమస్కారము.
6) నమః కాట్యాయచ గహ్వరేష్ఠాయచ.
కుత్సితముగా తిరుగువాఁడును, ముండ్లతో నిండిన లతాదులచే ప్రవేశింప నలవి కాని ప్రదేశమున నుండువాఁడును, విషయములైన గిరి గుహాదులలో నుండువాఁడునగు శివునకు నమస్కారము.
7) నమోహద్రయ్యాయచ నివేష్ప్యాయచ.
అగాధ జలములం దుండువాఁడును, నీహార జలమం దుండువాఁడునగు శివునకు నమస్కారము.
8) నమః పాగ్ ం సవ్యాయచ రజస్యాయచ.
పరమాణువులం దున్నట్టియును విస్పష్టమైన ధూళిలోనున్నట్టి శివునకు నమస్కారము.
9) నమః శ్శుష్క్యాయచ హరిత్యాయచ.
కాష్ఠములం దున్నట్టియును, తడిసిన దాని యందు క్రొత్త దాని యందున్నట్టి శివునకు నమస్కారము.
10) నమో లోప్యాయచో లప్యాయచ.
తృణాదికము లోపించు కఠిన ప్రదేశమున నున్నట్టియును, రెల్లు మొదలగు తృణములం దున్నట్టి శివునకు నమస్కారము.
11) నమ ఊర్వ్యాయచ సూర్మ్యాయచ.
భూమియందుండువాఁడును, చక్కని కెరటములు గల నదులయందుండు వాఁడునగు శివునకు నమస్కారము.
12) నమః పర్ణ్యాయచ పర్ణ్యశద్యాయచ.
ఆకులం దున్నట్టియును, ఎండుటాకుల మొత్తమునం దున్నట్టి శివునకు నమస్కారము.
13) నమో పగురమాణాయచాభిఘ్నతేచ.
సిద్ధము చేయబడిన ఆయుధములు కలవాఁడును, సంపూర్ణముగా సంహరించునట్టి శివునకు నమస్కారము.
14) నమాఖ్ఖితతేజ ప్రఖ్ఖితతేజ.
ఇంచుకంత దుఃఖము కలిగించునట్టియు, అత్యంత దుఃఖము కలిగించునట్టి శివునకు నమస్కారము.
15) నమో వఃకిరికేభ్యోదేవానాగ్ ం హృదయేభ్యః.
భక్తులకు ధనమును చిమ్మెడి ఉదారులగు రుద్రావతారులకును, సర్వ దేవ ప్రియుఁ డగుటచే సర్వ దేవతల హృదయమగు వారికి నమస్కారము.
16) నమో విక్షీణకేభ్యః.
క్షీణించు వాని కంటే విపరీతములై ఎపుడునూ నశింపని శివ శక్తులకు నమస్కారము.
17) నమో విచిన్వత్కేభ్యః.
అపేక్షించు అర్థమును సంపాదించి యొసంగు శివునకు నమస్కారము.
18) నమ అనిర్హతేభ్యః.
సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల యొక్క పాపములను, అచేతనము లందలి దోషములను, లోపములను, తొలగించు శివునకు నమస్కారము.
19) నమ అమీవత్కేభ్యః.
సంపూర్ణముగా స్థూల భావము పొంది దేవతలలో కల శివునకు నమస్కారము.
అనువాకము 9 సమాప్తము.

అనువాకము 10.
ఋక్కు 1.
ద్రాపే అంధసస్ఫతే దరిద్రం నీల లోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాంమాభేర్మాஉరో
మో ఏషాం కించనామమత్.
కుత్సితమైన గతిని పొందించువాఁడా! అన్నమును రక్షించువాఁడా! ఏమియునూ లేనివాఁడా! కంఠమున నల్లనివాఁడవై ఇతరత్ర ఎఱ్ఱనివాఁడా!  పుత్రపౌత్రాదుల యొక్కయు ఈ మాదగు గో మహిష్యాదుల యొక్కయు, సమూహమును భయపెట్టకుము. ఈ మోక్షమందిన అందఱిలో ఒక వస్తువునైనను నశింప జేయకుము. రోగమందినవారిగా జేయకుము.
ఋక్కు 2.
యాతే రుద్ర. శివా తనూశ్శివావిశ్వాహ భేషజీ.
శివా ఋద్రస్య భేషజీ తయానో మృడ జీవసే.
ఓ శివుఁడా! నీదగు ఒక శరీరము శాంతమైనది. ఆ శరీరముతో మమ్ములను జీవింప జేయుటకు సుఖింప జేయుము. ఆ శరీరము అన్ని దినములందును రోగ దారిద్ర్యాదులను తొలగించుటకు ఔషధము వంటిది కాన శుభకరమైనది. శివుని యొక్క తాదాత్మ్యము పొందుటకు ఔషధ రూపమైనదియును, జ్ఞాన దానముచే సంసార దుఃఖమును తొలగించును గాన మంగళకరమైనదియును అగుచున్నది.
ఋక్కు 3.
ఇమాగం రుద్రాయ తవసేకపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహేమతిం. యథానశ్శమసద్ద్విపదే  చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ న్ననాతురం.
ఏ ప్రకారముగా మా యొక్క పుత్ర పౌత్రాది రూప మనుష్యునకును మహిష్యాది రూప పశువునకును, సుఖము అగునో, ఇంతే కాదు. ఈ గ్రామము నందలి ప్రపంచము సుఖ పూర్ణమును, ఉపద్రవ శూన్యమును అగునో అట్లు మేము రుద్రుని కొఱకు ఈ పూజ ధ్యానము మున్నగు వానికి చెందిన బుద్ధిని గొప్పగా పోషించు చున్నాము. బల యుక్తుఁడును, తాపస వేషుఁడును, క్షీణించు ప్రతిపక్ష పురుషులు కలవాఁడు నగు రుద్రునకు సకలమును సమర్పించు చున్నాము.
ఋక్కు 4.
మృడానో రుద్రో తనో మయస్కృధిక్షయ ద్వీరాయ నమసా విధేమతే.
యచ్ఛంచయోశ్చ మనురాయజే పితాతదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ.
ఓ శివా! మమ్ములను ఇహ లోకమున సుఖింపఁ జేయుము. ఇంతే కాదు. మాకు పర లోకమునను సుఖమును చేయుము.   నశింప చేయ బడిన మా పాపములును, వీరులును గల నీకు నమస్కారముతో సేవించెదము. పాలకుఁడైన ప్రజాపతి ఏ సుఖమును, దుఃఖమునకు దూరముగా నుండుటను, ఏ లేశమును సంపాదించెనో ఆ సర్వమును మేము ఓ శివుఁడా! నీ యొక్క ప్రణయమును, స్నేహాతిశయమును కలుగగా పొంద గలము.
ఋక్కు 5.
మనో మహాంత ముతమానో అర్భకం. మాన ఉక్షంత ముతమాన ఉక్షితం.
మానోవధీః పితరం  మోత మాతరం ప్రియా మాన స్త నువో రుద్ర రీరిషః.
ఓ రుద్రుఁడా! మా యొక్క ముదుసలియైన పురుషుని హింసింపకు. అంతే కాదు. మా యొక్క బాలుని హింసింపకుము. అంతే కాదు. మాయొక్క నీరు చిమ్ముటకు సేవ చేయుటకును సమర్ధుఁడైన పురుషుని హింసింపకుము. అంతే కాదు. మా యొక్క గర్భమందలి పురుషుని హింసింపకుము. మా యొక్క తండ్రిని చంపకుము. అంతే కాదు.మా తల్లిని కూడా చంపకుము. మా యొక్క ప్రియమైన శరీరములను హింసింపకుము.
ఋక్కు 6.
మానస్తోకేతనయేమాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః.
వీరాన్ మానో రుద్ర భామితో உవధీర్హవిష్మంతో నమసా విధేమతే.
రుద్రుఁడా! మా యొక్క సంతానమందును దయ చూపి హింసింపకుము.   మా యొక్క ఆయుర్దాయము విషయమై హింసింపకుము. మాయొక్క గోవులందును, మాయొక్క గుఱ్ఱముల విషయమై హింసను ఆచరింపకుము. కృద్ధుఁడవై మాయొక్క వీరులను, భృత్యులను వధింపకుము.  మేము హవిస్సు గలవారమై నిన్ను నమస్కారముతో సేవించెదము.
ఋక్కు 7.
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మేతే అస్తు. రక్షాచనో అధిచ దేవ బ్రూహ్యధాచనః. శర్మ యచ్ఛద్వి బర్హాః.
గోవులను చంపునట్టియు, అంతే కాదు పుత్ర పౌత్రాది పురుషులను సంహరించు నట్టియు నశింపఁ జేయఁ బడిన సేవకులు గల్గినట్టి  నీయొక్క (ఉగ్ర)రూపమున ఉండు గాక. సుఖకరమగు నీయొక్క రూపము మాయందుండుగాక. ఇంతే కాదు. మమ్ములను అన్ని విధముల కాపాడుము. అంతే కాదు. ఓ ప్రభూ! మమ్ములను ఇతరుల కంటే అధికులుగ చెప్పుము. ఇంతే కాదు రెండు లోకములను వృద్ధి చేయు నీవు సుఖమునొసంగుము.
ఋక్కు 8.
స్తుతిశ్రుతంగర్త సదం యువానం మృగన్న భీమ ముపహత్ను ముగ్రం. మృడాజరిత్రే రుద్రస్తవానో  అన్యంతే అస్మన్ నివపంతు సేనాః.
గుహను పోలిన హృదయ పద్మమును సర్వదా ఉండునట్టియును, నిత్యము యువకుఁడైనట్తియును, భయంకరమైన సింహము వలె ప్రళయ కాలమున సర్వ జగత్తును నశింపఁ జేయుటకు భయంకరుఁడైనట్టియు ప్రసిద్ధుఁడైన రుద్రుని ఓ నాదగు వాకా! స్తోత్రము చేయుము. మా వచనము చే స్తుతింప బడిన వాడవై ప్రతి దినము నశించు మా శరీరమునకు సుఖము చేకూర్చుము. నీ సేవలు అన్యుఁడగు శత్రువును నశింపఁ జేయు గాక.
ఋక్కు 9.
పరిణో రుద్రస్ర్యహేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతి రఘోయోః. అవస్థిరామఘవ ద్భ్యస్తనుష్వమీఢ్వస్తోకాయతనయాయ మృడయ.
శివుని యొక్క ఆయుధము మమ్ములను పూర్తిగా క్రోధముచే ప్రజ్వరిల్లునట్టియు పాప పరిహారక రూపమును గోరు శివుని యొక్క భయంకరమైన బుద్ధి మమ్ములను విడిచి పెట్టును గాక. వొరోధ వినాశనకై చెక్కుచెదరక యున్న భయంకర బుద్ధిని హవిస్సనెడి అన్నముతో గూడిన యజమానుల నుండి తొలగింపుము. భక్తుల కోరికలను అమితముగా నొసంగు రుద్రుఁడా! మా పుత్రులకు మా మనుమలకును సుఖమునొసంగుము.
ఋక్కు 10.
మీఢుష్టమశివతమశివోనస్సుమనాభవ. పరమే వృక్షి అయుధం నిధాయ కృత్తింవసాన ఆచన పినాకం బిభ్రదాగహి.
అతిశయముగా వర్షించి తడుపువాఁడా!(కామముల నొసంగువాఁడా)మిక్కిలి శాంతమైన స్వరూపము కలవాఁడా! మమ్ములను గూర్చి శాంతుఁడవును, మంచి మనస్సుతోడను స్నేహముతోడను గూడినవాఁడవగుము. త్రిశూలాదికమును అత్యున్నతమైన మఱ్ఱి రావి మున్నగు వృక్ష జాతమునందుంచి, వ్యాఘ్ర చర్మమును మాత్రము దాల్చువాఁడవై మా కెదురుగా రమ్ము. పినాకమను ధనుస్సును హస్తమున ధరించుచు రమ్ము.
ఋక్కు 11.
వికిరిదవిలోహిత  నమస్తే అస్తు భగవః. యాస్తే సహస్రగ్ ం  హేతయో உన్యమస్మన్నివపంతుతాః.
విశేషముగ భక్తుల సన్నిధిని బహు విధముల ధన రాసులను జిమ్మి ఒసంగువాఁడా! తెల్లనివాఁడా! లేదా, మిక్కిలి ఎఱ్ఱనివాఁడా! ఓ భగవంతుఁడా! నీకు నమస్కారమగు గాక. నీకు ఏ ఆయుధములు వేలకొలది కలవో (వానిని) వాటి చే మాకంతే ఇతరుఁడైన విరోధిని నశింపజేయును గాక.
ఋక్కు 12.
సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి.
ఓ శివా నీ యొక్క చేతులందు ఆయుధములు వేయి విధముల వేలకొలదీ కలవు. ఓ భగవంతుఁడా! సమర్థుఁడవగ్చు, ఆ ఆయుధములకు ముఖములను, శల్యములను మాకు పరాఙ్ముఖమగునట్లు చేయుము.
అనువాకము 10 సమాప్తము.

అనువాకము 11.
ఋక్కు 1.
సహస్రాణి సహస్రశో యేరుద్రా  అధిభూమ్యాం
తేష్హాగ్ ంసహస్ర యోజనే உవహన్వాని తన్మసి.
భూమి యొక్క ఉపరి భాగమున ఏ రుద్రులు సహస్ర ప్రకారులై సహస్ర సంఖ్యాకులై, కలరో ఆరుద్రులయొక్క ధనుస్సులును, మాకంటే సహస్ర యోజనములు దాటిన పిమ్మట గల దేశమున తొలగింపబడిన వింటి త్రాడు కలవిగా జేసి ఉంచుము.
ఋక్కు 2.
అస్మిన్ మహత్యర్ణవే உంతరిక్షేభవా అధి.
ఈ కాన వచ్చు మహా సముద్రముతో సమానమైన అంతరిక్షము నాశ్రయించి యున్న రుద్రమూర్తి విశేషములు సహస్ర యోజనముల దూరమున ఉండుగాక.
ఋక్కు 3.
నీలగ్రీవాశ్శితి కంఠాః శర్వా అధః క్షమాచరాః.
రుద్రుని యొక్క మూర్తి విశేషములు కొన్ని ప్రదేశములందు నీల వర్ణములును, ఇతర ప్రదేశములందు శ్వేత వర్ణములై యుండును. నీల కంఠములు హింసించు నవియును పాతాళమున సంచరించు నవియును ఐయున్నవి.
ఋక్కు 4.
నోలగ్రీవాశ్శితికంఠా దివగ్ ం రుద్రా ఉపశ్రితాః.
నీల శ్వేత వర్ణములును, నలుపు కంఠమునందు గల రుద్రాంశ గల దేవాదులు  స్వర్గమును ఆశ్రయించి యుండిరి.
ఋక్కు 5.
ఏ వృక్షేషు సస్పింజరా నీల గ్రీవా విలోహితాః.
వృక్షము లందు ఏ రుద్రులు కలరో వారు లేత గడ్డి వలె పింజర వర్ణము కలవారు. నీల వర్ణమైన గ్రీవము కలవారు. కొందరు విశేషముగ రక్త వర్ణము కలవారు.
ఋక్కు 6.
యే భూతానామధిపతియో విశిఖాసః కపర్దినః.
ఏ రుద్రులు కాన రాని శరీరము కలవారై మనుష్యులకు ఉపద్రవములను గావించు భూత గణములకు ప్రభువులో వారిలో కొందరు నున్నగా చేయ బడిన   శిరస్సులు కలవారై జటాజూటము లకలవారై జీవులను హింసిచు చున్నారు. వారు దూరముగా నుందురు గాక.
ఋక్కు 7.
యే అన్నేషు వివిద్యంతి పాత్రేషు పిబతో జనాన్.
ఏ రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింప దగిన వస్తువు లందు గూఢముగా నున్నవై జనులను విశేషముగా బాధించు చున్నవో త్రాగ తగిన పాలు మున్నగు వానిలో నున్నవై త్రాగుచున్న జనులను విశేషముగా బాధించు చున్నవో అవి దూరముగా నుండును గాక.
ఋక్కు 8.
యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః.
ఏ రుద్రులు లౌకికములును వైదికములునగు మార్గములను రక్షించువారో , అన్న సమూహమును భరించువారో, అన్న ప్రదానముచే జీవులను పోషించువారో, వారు మిశ్రములై విరోధులతో యుద్దము చేయువారు అగుచున్నారు. వారు దూరముగా ఉందురుగాక.
నవమము,
యజుస్సు1.
ఏ తీర్థాని ప్రచరంతి సృకావంతోనిషంగిణః.
ఏ రుద్రులు కాశీ ప్రయాగాది క్షేత్రములను రక్షించుటకు సంచరించుచున్నారో వారు ఈటెలు కలవారును, కత్తులు కలవారును అయి యుండిరి.
దశమము.
యజుస్సు 2.
య ఏతావంతశ్చ భూయాగ్ సశ్చ దిశో రుద్రా వితస్థిరే . తేషాగ్ ం సహస్ర యోజనేవ ధన్వాని తన్మసి.
ఏ రుద్రులు వేలకొలది కలరో అంతకంటె అధికులై అన్ని దిక్కులను ప్రవేశించి కలరో వారి యొక్క ధనుస్సులను వేయి యోజనముల దూరమున వింటి త్రాడు తొలగించి ఉంచుడు.
ఏకాదశ.
యజుస్సు 3.
నమో రుద్రేభోయే పృధివ్యాం ఏ உంతరిక్షే.
యే దివి  యేషామన్నంవాతోవర్షమిషవ.
స్తేభ్యోదశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీ
ర్దశోదీచీ ర్దశోర్ధ్వాస్తేనో మృడయంతు తేయం ద్విష్మోయశ్చనోద్వేష్టి తంవోజంభేదధామి.
ఏ రుద్రులు భూమిపై కలరో,ఏరుద్రులకు ఆహారమే బాణములో, అన్నమే బాణములుగా గల రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు ఆకాశమునందుఁ గాలరో, ఏ రుద్రులకు వాయువు బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు స్వర్గమునందు కలరో, ఏ రుద్రులకు వర్షము బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. తూర్పు ముఖముగా పది వేళ్ళ చివరలు గల అంజలుల తోడను, దక్షిణ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, పడమట ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఉత్తర ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఊర్ధ్వ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఆ రుద్రులకు నమస్కారములు. ఆ రుద్రులు మమ్ములను సుఖపఱచుదురు గాక.  ఎవనిని ద్వేషింతుమో, ఏ శత్రువు మమ్ములను ద్వేషించునో, ఆ శత్రు ద్వయమును రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో ఉంచుచున్నాను.
అనువాకము 11 సమాప్తము

 

కంటిన్యూ పార్ట్ - 3 ....


More Shiva