ఈ రోజే కాలభైరవ జయంతి.. ఈ పనులు చేస్తే దుఃఖాలు బాధలు పటాపంచలు అవుతాయి..!
కార్తీక మాసంలో కృష్ట పక్ష అష్టమి తిథి రోజు కాల భైరవ జయంతిగా జరుపుకుంటారు. అష్టమి తిథి మధ్యాహ్నం రోజు కాల భైరవుడు శివుడి ఐదవ అవతారంగా ఉద్భవించాడు. ఈ రోజు కాల భైరవుడిని పూజించడం వల్ల జీవితంలో బాధ, భయం, దఃఖం అనేవి పటాపంచలు అవుతాయట. అష్టమి తిథి 22వ తేదీ సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి 23వ తేదీ సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా కింద చెప్పుకునే పనులు చేస్తే జీవితంలో కష్టాలు నెమ్మదిగా మాయమవుతాయి.
మంత్రం..
కాలభైరవ జయంతి రోజున కాల భైరవ నామాలను స్మరించుకోవడం, ఆయన మంత్రాన్ని పఠించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. "ఓం కాలభైరవాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆవనూనె..
కాల భైరవుడికి ఆవనూనె అంటే చాలా ఇష్టమట. ఆయన జన్మదినం రోజు కాల భైరవ ఆలయంలో లేదా ఇంట్లో ఆయన చిత్ర పటం లేదా విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలట. ఈ దీపం రాత్రంతా వెలుగుతూ ఉండేలా చూడాలి. ముఖ్యంగా శత్రువ నుండి రక్షణ కావడానికి, శత్రువుల మీద విజయం సాధించడానికి, ఆర్థిక సమస్యల నుండి బయట పడటానికి, కుటుంబంలో సంతోషం, శాంతి కలగడానికి ఆవనూనె దీపం పెట్టడం చాలా సహాయపడుతుంది.
కుక్కలకు ఆహారం..
కాలభైరవుడి వాహనం కుక్క. కుక్కను కూడా భైరవుడు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా నల్ల కుక్కలు ఉంటే కనుక కాల భైరవ జయంతి రోజు రొట్టె లేదా తీపి గారెలను ఆహారంగా పెట్టాలి. ఇలా చేస్తే కాల భైరవుడి అనుగ్రహం కలుగుతుందట. ఇది మాత్రమే కాకుండా జీవితంలో జరిగే అవాంఛనీయ సంఘటనల నుండి ఇది రక్షిస్తుందట.
పారాయణ..
కాలభైరవ జయంతి రోజు కాల భైరవ స్తోత్రం లేదా అష్టకాన్ని పారాయణ చెయ్యాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పారాయణ చెయ్యడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కుటుబం సభ్యులలో ఎవరికైనా వ్యాధులు, మానసిక ఒత్తిడి వంటివి ఉంటే వాటి నుండి ఉపశమనం కలిగించడంలో ఇది సహాయపడుతుంది.
నల్ల నువ్వులు, మినపగుండ్లు..
నల్ల నువ్వులు, నల్ల మినప గుండ్లు, నల్లని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిదట. కాలబైరవ జయంతి రోజు ఈ పని చేస్తే పితృ దోషం, గ్రహ దోషాలు, ఇతర వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇవి దానం చేసేటప్పుడు జీవితంలో అన్ని కష్టాలు వెళ్లిపోవాలని మనస్సులో ప్రార్థించాలి.
*రూపశ్రీ