‘జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ‘శివుడు’ నాశనకారుడా? ఎంత తప్పు భావన అది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? ధానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి.
ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మే’ అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది.పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం..భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం..వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇక మిగిలివున్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఉదాహరణకు..., ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి.. ఎక్కడకు పోతుంది? తన ఉత్పత్తి స్ధానమైన దీపంలోకే వెళ్లి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే.. దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే.. ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడు..అంటే..తను వచ్చినచోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమౌతున్నదన్నమాట. దీనిని బట్టి మనకు ఏమర్థమౌతోంది? దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్నచోట స్వార్ధం ఉంటుంది. స్వార్దం ఉన్నచోట లయానికి తావులేదు. కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో భుజిస్తాడు. రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి, స్ధితులకు ఆద్యుడయ్యాడు. సర్వజగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం