గురు ప్రదోష పూజ, ఉపవాసం గురించి ఈ విషయాలు తెలుసా!
ప్రదోష వ్రతం లేదా పూజ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం చేస్తారు. అన్ని గ్రహాలు, గణాలు పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి. ఈ కారణంగా పరమేశ్వర అనుగ్రహం ఉంటే అన్ని గ్రహ బాధలు తొలగిపోతాయని, గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. అయితే ప్రదోష పూజలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో గురు ప్రదోష వ్రతం కూడా ఒకటి. గురువారం వస్తుంది కాబట్టి దీన్ని గురు ప్రదోష పూజ లేదా వ్రతం అని అంటారు. ప్రదోష కాలంలో చేసే శివ ఆరాధన చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో పిల్లల సంతోషం పెరుగుతుంది. సాధారణంగా ప్రదోష పూజ చేసేవారు ఉదయం అంతా శక్తి మేర ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేస్తుంటారు. ఇంతకీ గురు ప్రదోష వూజ రోజు చేయవలసిన కొన్ని పనులు తెలుసుకుంటే..
నవంబర్ నెల 28 వ తేదీ గురువారం అవుతుంది. గురువారం ఆచరించేది కాబట్టి దీనికి గురు ప్రదోష వ్రతం అని పేరు. గురు వారం ప్రదోష కాలంలో శివప్రదోష పూజ చేసుకోవాలి. గురువారం సాయంత్రం 5.35 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా చెబుతారు. ఈ సమయంలో చేసే శివ పూజనే ప్రదోష పూజ అంటారు. కృష్ణపక్షం లో త్రయోదశి నవంబర్ 28 వ తేదీ వస్తుంది. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 5.35 గంటల తర్వాత ప్రదోష కాలం ప్రారంభం అవుతుంది. ఈ గురు ప్రదోష పూజలో వివిధ సమస్యలకు వివిధ రకాలుగా శివ పూజ చేసుకోవచ్చు.
వివాహం కోసం..
ఎంత ప్రయత్నించినా వివాహం కాని వారు గురు ప్రదోష పూజ రోజు ఒక రాగి పాత్రలో నీటని నింపి అందులో బెల్లం, కొద్దిగా పచ్చి శనగలు వేయాలి. తరువాత ఈ నీటితో శివుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తుంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఆర్థిక సమస్యలు..
ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా, డబ్బుకు లోటుగా ఉన్నా గురు ప్రదోష రోజున పంచదార, కుంకుమతో శివుడికి అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే ధన సమస్యలు తీరి తొందరలోనే ఐశ్వర్యం చేకూరుతుందట.
వివాహంలో అడ్డంకులు..
వివాహం కుదిరి ఆ తరువాత ఏదో ఒక విధంగా అవి ఆగిపోతుంటే గురు ప్రదోష పూజ రోజు శివ పార్వతుల విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున శివపార్వతులను పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది.
కెరీర్..
ఎంత కష్టపడినా ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు గురు ప్రదోష పూజ రోజు ప్రదోష కాలంలో శివ పూజ చేయాలి. ఎవరైనా పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేస్తే కేరీర్ లో పురోగతి లభిస్తుంది. చంద్ర దోషం ఎదుర్కొంటున్నవారికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. తెలుపు రంగు వస్త్రాలు దానం చేస్తే చంద్ర దోషం తొలగిపోతుంది.
గ్రహ దోషాలు..
గ్రహ దోషాలు తొలకాలంటే నల్ల నువ్వులను నీటిలో కలిపి శివుడికి అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది. గురు ప్రదోష వ్రతాన్ని సాధారణంగా ఎవరు ఆచరించినా వారి జీవితంలో ఎదుగుదల, తల పెట్టిన పనులలో విజయం లభిస్తాయి. జీవితంలో సంతోషం నెలకుంటుంది.
*రూపశ్రీ.