పరాశర సరస్సు - లోతెంతో తెలియదు
భారతదేశం యావత్తూ ఏ రాష్ట్రాన్ని చూసినా, అక్కడ ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది. ఆ అద్భుతం వెనుక పౌరాణిక గాథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశాలలో ఒకటి ‘పరాశర సరస్సు’
కొండల మధ్య
హిమాచల్ ప్రదేశ్ గుండా సాగే హిమాలయ పర్వతాలలో దౌలాధర్ పర్వతశ్రేణులు ముఖ్యమైనవి. వీటిలో Mandi (మండి) అనే పట్నానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పరాశర సరస్సు. సముద్రమట్టం నుంచి ఎనిమిదివేల అడుగుల పై ఎత్తున ఉండే ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది. ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది.
భీముడు నిర్మించిన సరస్సు
ఈ సరస్సు వెనకాల ఒక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులంతా కమ్రునాగ్ అనే యోధునితో కలిసి హిమాలయ పర్వతాలగుండా ప్రయాణిస్తున్నారట. అలా ప్రయాణిస్తూ ఉండగా కమ్రునాగ్ ఒకచోట ఆగిపోయి... ఆ ప్రదేశం తనకు చాలా నచ్చిందనీ, ఇక మీదట ఇక్కడే జీవించాలని అనుకుంటున్నాననీ చెప్పాడట. అందుకోసం నిత్యం తన దాహార్తిని తీర్చేలా, అక్కడ ఒక సరస్సుని సృష్టించమని భీముని కోరాడట కమ్రునాగ్. ఆ కోరికను మన్నించి భీముడు తన మోచేతితో ఓ పర్వత శిఖరాన్ని తొలగించాడట. అలా ఏర్పడిన సరస్సే ఇది.
లోతెంతో తెలియదు
భీముడు తన మోచేతితో శిఖరాన్ని నెట్టాడు అన్న వాదనకు బలం చేకూర్చేలా ఈ సరస్సు మోచేయి ఆకారంలో ఉంటుంది. ఇక ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉంది అనేందుకు సాక్ష్యంగా దీని లోతుని ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారట. మంచుతుపానుల సమయంలో సరస్సులోకి పడే వందల అడుగుల దేవదారు వృక్షాలు కూడా మాయమైపోవడమే దీనికి తార్కాణం. ఈ సరస్సు మీద తేలుతూ ఉండే ఓ చిన్న ద్వీపం కాలానుగుణంగా సరస్సులోని ఒక మూల నుంచి మరో మూలకి కదులుతూ ఉండటం మరో విశేషం.
బాలుడు నిర్మించిన ఆలయం
పరాశర మహర్షి ఇక్కడ కొంతకాలం తపస్సుని ఆచరించాడు అని స్థలపురాణం పేర్కొంటోంది. ఆ కారణంగానే ఈ ప్రదేశానికి పరాశర సరస్సు అన్న పేరు వచ్చింది. ఆ పరాశర మహర్షి స్మృతిచిహ్నంగా ఈ సరస్సు పక్కనే ఒక అందమైన చెక్క ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఓ బాలుడు 18 ఏళ్లపాటు కష్టపడి నిర్మించాడని స్థానికులు చెబుతారు. పైగా ఈ ఆలయం మొత్తాన్నీ కూడా ఒకే ఒక్క దేవదారు వృక్షంతో నిర్మించారట.
ఏటా మే- జూన్ నెలల మధ్య ఈ ఆలయం దగ్గర ఓ అద్భుతమైన జాతర జరుగుతుంది. ఆ జాతరలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు. తమతో పాటుగా తమ గ్రామదేవతలను కూడా ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలిసినవారు ఎవరైనా సరే హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లినప్పుడు తప్పకుండా పరాశర సరస్సుని దర్శించి తీరతారు.
- నిర్జర.