మరణించిన పెద్దలకు మనం ఎందుకు భోజనం పెట్టాలి.. పెట్టకపోతే ఏమౌతుందో తెలుసా...??
శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
భారత దేశము ప్రపంచములోనే విశిష్టమైన ప్రాంతము. కర్మ భూమి. అందుకే దేవతలు సైతం ఈ కర్మ భూమిలో పుట్టి తమ తమ అవతారములు సంబంధించిన పనులు చేయాలని, రాక్షసులు తమ ఈ జన్మను పూర్తి చేసుకుని మంచి జన్మకు వెళ్లాలని తహతహలాడతారు. అది ఇక్కడే ఈ భూమి మీదనే సాధ్యం అవుతుంది. మన సనాతన ధర్మం "అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభామ్" అని తెలుపుతోంది. అంటే మంచి, చెడు ఏదైనా సరే మనం చేసుకుని అనుభవించాల్సిందే. అందుకే
పునరపి జననం
పునరపి మరణం
పునరపి జననీ
జఠరే శయనం
అని ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా ఎన్నోసార్లు జీవుడు పుడుతూ, మరణం అనే పేరుతో ఆ శరీరాన్ని వదలి మరో చోట పుట్టడం చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆత్మకు మరణం అంటూ ఏమీ ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా
నైనంఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః
అని ఆత్మకు మరణము ఉండదు. నీరు తడపలేదు. అగ్ని కాల్చలేదు. నాశనం అనేది లేదు.
ఒక జన్మ నుంచి మరొక జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి వెంటనే జన్మ లభించదు. అలాంటప్పుడు క్రితం జన్మలో చేసిన కర్మల ఫలితముగా వెంటనే జన్మ లభించనప్పుడు ఆ ఆత్మా పితృ లోకం అనే చోట ఉంటుంది అని గరుడ పురాణం చెపుతోంది. అక్కడ ఉండి ఆ జీవుడు ఆకలి, దప్పికలతో బాధపడుతూ తన పూర్వ జన్మకు సంబంధించి ఎవరైనా తర్పణాలు ఇస్తారేమో తనకు ఆహరం, నీరు లభిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైనా మరణించినప్పుడు చేసే కర్మలలో కూడా అంతకు ముందు మరణించిన మూడు తరాల వారు వసు, రుద్ర. ఆదిత్య రూపాలలో ఉంటారని వారికి మనం భోజనం పెట్టాలని తెలుస్తూ ఉంటుంది. అలా పెట్టే విధానములో బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, అగ్ని ద్వారా పంపడం, ఆవుకు పెట్టడం ద్వారానో, మంచి చెరువులో చేపలకు ఆహరం అందించడం ద్వారానో పితృ దేవతలకు మనం పెట్టే ఆహారం, నీరు అందుతుంది.
భాద్రపదమాసములో పౌర్ణమి మరునాటి నుంచి అమావాస్య వరకు ఇలా మరణించిన పెద్దలకు తర్పణాలు విడవడం, పిండప్రదానం చేయడము వంటివి చేసి వారికి మన కృతజ్ఞత తెల్పడం కొరకు "పితృ పక్షాలు" అనే పేరుతో ఒక సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు. ఈ సమయములో ప్రస్తుత కుటుంబ పెద్ద, మరణించిన తన పూర్వీకులందరకు తర్పణాలు వదలి, వీలైనంత బ్రాహ్మణులకు దానం చేసి, భోజనం పెట్టి గౌరవిస్తారు. ఆ సమయం యొక్క విశిష్ట ఏమిటి అంటే మంత్రముతో పాటుగా తర్పణాలు ఇచ్చేటప్పుడు కేవలం తన పెద్దలకు అని మాత్రమే కాకుండా స్నేహితులకు, తెలిసిన వారికి, నిజానికి తెలియని వారికి కూడా తర్పణాలు వదలవచ్చు. తెలియని వారు అంటే ఎవరు అనే సందేహం వస్తుంది కదా? ఒక్కోసారి ప్రకృతి విపత్తులతో అంటే భూకంపాలు, వరదలు, ఘోర ప్రమాదాలలో చాలామంది మరణిస్తూ ఉంటారు. ఆచూకీ కూడా తెలియదు వాళ్ళ వాళ్లకు. అలాంటి వారికి కూడా శాంతి కలగాలని, వారు ఆకలితో అలమటించకుండా ఉండాలని ఆ సమయములో సంకల్పం చెప్పి తర్పణాలు విడవవచ్చు. కులం, మతం అనేవాటితో సంబంధం లేకుండా కొంతమంది పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు అనే కొంతమంది చేస్తూ ఉంటారు. పాశ్చాత్యులు సైతం థాంక్స్ గివింగ్ డే అనే పేరుతో తమ నుంచి దూరంగా ఉన్న తల్లి తండ్రులను కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అయితే మన భారతావనిలో ఉమ్మడి కుటుంబం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అంతే కాకుండా, మరణించిన తరువాత కూడా వారిని గుర్తు పెట్టుకుని కృతజ్ఞతగా ఉండడం అనేది మన సంస్కృతిలో చాలా పెద్ద భాగము పోషిస్తుంది. మన పెద్దలకు మన ప్రేమ, కృతజ్ఞత చూపించడం ఒక కోణం అయితే
"లోకాః సమస్థా సుఖినో భవంతు" అన్న ప్రాచీన భారతీయ సంస్కృతిలోని అద్భుతమైన ఆచరణీయమైన చక్కని ఆచారం ఇది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా.
ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గురించి ప్రస్తావించాలి. ఎంత దానం చేసే వారైనా ఈ పితృ దేవతలకు తర్పణాలు వదలాలి. పిండ ప్రదానం చేయాలి. దానం లో అన్నదానం తప్పకుండా ఉండాలి అని మహాభారతంలో ఒక కథ తెలియచేస్తోంది.
కర్ణుడు ఎంతో దాన కర్ణుడిగా పేరు పడ్డ వ్యక్తి. మహాభారత యుద్ధం పూర్తి అయి పాండవులు తప్ప అందరు మరణించారు. కర్ణుడు కూడా మరణించాడు. యమ లోకానికి అతని ప్రయాణం ప్రారంభము అయింది. వెళుతూ ఉండగా ఆకలి వేసింది. తోవలో బోలెడు తీయటి పండ్లు ఉన్న చెట్లు ఉన్నాయి. ఆనందముగా వెళ్లి కోసుకుని తినబోగా బంగారు పండుగా మారిపోయి తినడానికి రాలేదు. ఎన్నిసార్లు కోసుకున్న అలాగే అవ్వడంతో ఆశ్చర్యపడ్డాడు. సరే పోనీ అని అక్కడి తీయని నీటి జలాశయం ఉంటే ఆ నీరు తాగుదాము అని దోసిలి లోకి తీసుకుని తాగబోగా బంగారు ద్రవంగా మారిపోయి తాగడానికి రాలేదు. ఎన్ని సార్లు, ఎన్ని చోట్ల ప్రయత్నించినా అలాగే అవ్వడంతో ఆ ప్రయాణములో ఆకలి,దప్పికలతో,అలసటలతో అల్లాడిపోతూ కళ్లనీళ్లు పర్యంతం అవ్వడం చూసి దేవతలకు జాలి కలిగి అతని వద్దకు వచ్చారు. "నాయనా కర్ణా, నువ్వు గొప్పగొప్పగా బంగారం దానం చేసావు కానీ అన్నం పెట్టలేదు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆకలితో వస్తే అతనికి ఆహరం పెట్టకుండా, మోయలేనంత బంగారం ఇచ్చి పంపావు. అతను నీరసంతో మోయలేక పడిపోతే ఈసడించి భటులతో గెంటించేసావు. మరణించిన వారికి తర్పణాలు, పిండ ప్రదానం చేయలేదు. అందుకే ఈ కష్టం నీకు" అని చెప్పారు. ఎంతో బాధ పడ్డాడు, తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దేవతలు సంతోషించి అతని మంచి పనులకు ఫలితముగా ప్రితృలోకములో ఉన్న పితృదేవతలకు స్వయంగా ఆహరం పెట్టే అవకాశం ఇచ్చారు. కర్ణుడు వెంటనే పితృ లోకం వెళ్లి వారికి ఆహారం, నీరు అందించాడు. ఆ తరువాత అతని ప్రయాణం హాయిగా కొనసాగింది.
అంటే ఎంత దానం చేసినా కూడా అన్నదానం చేయడం, పితృ పక్షాలలో వారికి తర్పణాలు వంటివి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఇలా చేసి పితృదేవతకు శాంతి చేయడము వలన ఇంట్లో గొడవలు లేకుండా శాంతిగా ఉంటుంది అని, సత్సంతానప్రాప్తి కలిగి వంశం వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెపుతారు. అంతే మన పిల్లలకు పెద్దలను గౌరవించడము, మరణించిన తరువాత కూడా గుర్తు పెట్టుకోవడం వంటివి నేర్పించిన వారము అవుతాము. ఒక చక్కని సంప్రదాయాన్ని భావి తరాలకు నేర్పిన వారము అవుతాము. అందుకే, మనమంతా ఈ పెద్దల పండుగ, పితృ పక్షాలలో మన పెద్దలకు నమస్కరించి వారిని ఆదరించి వారి ఆశీర్వాదం పొంది హాయిగా జీవిద్దాం. తరిద్దాం.