దేవుడి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా ఈ వస్తువులు నేల మీద ఉంచకూడదు..!
భారతీయులు మొదట ఇంట్లో దేవుడి పూజ చేసుకున్న తరువాతే వండుకోవడం, తినడం, ఇతర పనులు అన్నీ చేసుకుంటారు. ఇప్పటి బిజీ జీవితాలలో పూజలు హడావిడిగా జరుగుతున్నాయేమో కానీ.. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసి, దేవుడి పూజ చేసుకున్నాక ఇతర పనులు చూసుకునేవారు ఎక్కువ. పూజలు వ్యవహారాల గురించి పెద్దలు చెప్పడం, వాటిని పిల్లలు పాటించడం అనేది ఒక తరం దగ్గర నెమ్మదించింది. ఈ కారణం వల్ల ఇప్పటి తరంలో చాలామందికి పూజ సమయంలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు తెలియవు. పూజ సమయంలో కొన్ని వస్తువులు నేల పై ఉంచడం వల్ల ఆ పూజా ఫలితం దక్కదని అంటున్నారు. ఇంతకీ ఏ వస్తువులు కింద ఉంచకూడదు తెలుసుకుంటే..
శాలిగ్రామం..
శాలిగ్రామం సాక్షాత్తు విష్ణుస్వరూపం. పైగా శాలిగ్రామాన్ని నీటిలో మాత్రమే ఉంచుతుంటారు. సాధారణంగా శాలి గ్రామం ఇంట్లో ఉంచి పూజ చేసుకునేవారు చాలా నియమ నిష్టలతో ఉంటారు. అలాంటి శాలి గ్రామాన్ని పొరపాటున కూడా నేలపై ఉంచకూడదట.
శంఖం..
శంఖంలో లక్ష్మీదేవి నివిశిస్తుందని చెబుతారు. దీన వల్ల పూజ సమయంలో శంఖాన్ని నేలపై ఉంచడం వల్ల లక్ష్మీదేవి కోపిస్తుందట. అలా జరిగితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు.
దీపం..
పూజ చేసేటప్పుడు చాలా మంది తప్పు చేస్తుంటారు. ప్రమిదను నేలపై పెట్టి దీపం వెలిగించి ఆ తరువాత ఆ దీపాలు దేవుడి ముందు, తులసి కోట దగ్గర పెడుతుంటారు. దీపాలను కింద పెట్టకూడదు. ఎల్లప్పుడూ ఒక పళ్లెంలో దీపాలను పెట్టి ఆ తరువాత వెలిగించుకోవాలి.
బంగారం..
బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై ఉంచడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్టేనట. అందుకే బంగారాన్ని నైలపై ఉంచడం మంచిది కాదు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెబుతారు.
దేవుడి పటాలు లేదా విగ్రహాలు..
దేవుడి పటాలు లేదా విగ్రహాలను నేలపై ఉంచకూడదు. కనీసం శుభ్రం చేసే సమయంలో అయినా సరే.. దేవుడి విగ్రహాలను పటాలను నేరుగా నేలపై ఉంచకూడదు. కనీసం ఒక కాగితం లేదా వస్త్రం వేసి అయినా వాటి మీద విగ్రహం లేదా పటాలను ఉంచాలి.
*రూపశ్రీ.