భక్తి, ముక్తి, శక్తి ప్రదాత తులసి
తులసిని మిగతా ప్రపంచం మొత్తం ఒక మొక్కలా చూడవచ్చు. కానీ, భారతీయ సంప్రదాయం మాత్రం తులసిని కేవలం ఒక మొక్కలా చూడదు.. తులసిని భక్తి, ముక్తి, శక్తి ప్రదాయినిగా చూస్తుంది. తులసి మొక్కను సేవించి తరిస్తుంది. తులసిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ప్రతి హిందువు ఇంటిలో తులసి మొక్క కొలువై వుంటుంది. హిందువులు తాము పూరింట్లో వున్నప్పటికీ, తులసికి మాత్రం ‘కోట’ కట్టి పూజిస్తారు. తులసికి అనేక ఔషధ గుణాలున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. హిందూ సమాజం మాత్రం తులసిలోని ఔషధ గుణాలను గుర్తించడంతోపాటు, తులసిలో భగవంతుడిని కూడా దర్శిస్తోంది. తులసిని భక్తిగా పూజిస్తూ శక్తిని, ముక్తిని పొందుతోంది.
‘తులసి’ అనే సంస్కృత పదానికి ‘సాటిలేనిది’ అని అర్థం.
‘‘యన్మూలే సర్వ తీర్థాని సన్మధ్యే సర్వ దేవతా
యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్’’
అ శాస్త్రాల్లో పేర్కొన్నారు. తులసి మొక్క కాండం నుంచి సమస్త దేవతలు నివసిస్తారని, అగ్రభాగంలో నాలుగు వేదాలు, మూల స్థానంలో సర్వ తీర్థాలు నివాసం వుంటాయని ఈ శ్లోకం చెబుతోంది. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, అడవి తులసి, రుద్ర తులసి, మరువక తులసి, నీల తులసి... ఇలా తులసి వివిధ రూపాల్లో వెలసి మానవజాతికి శక్తిని అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 180 రకాల తులసి వున్నట్టు పరిశోధకులు చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఏడు రకాల తులసి మొక్కలు కనిపిస్తూ వుంటాయి.
తులసిని అతి పవిత్రమైన మొక్కగా పూజించడం వేదకాలం నుంచి వుంది. తులసి వేదకాలం నుంచే దేవతా మొక్క స్థాయిని పొంది పూజలు అందుకుంటోంది. పురాతన పుణ్యక్షేత్రాల్లో తులసి తోటలను పెంచడం చూస్తూ వుంటాం. పండరీపురంలో అతి పెద్ద తులసి వనం వుంది. మన తిరుమల వేంకటేశ్వరుడికి తులసి దళం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ తులాభారంలో తులసి దళానికి శ్రీకృష్ణుడు లొంగిపోయిన విషయం తెలిసిందే కదా. అలాగే కార్తీక మాసంలో శివుడికైనా, విష్ణువుకైనా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం వారి ఖాతాలో పడిపోతుంది. ఆషాఢ మాసంలో తులసి దళాలున్న నీటితో విష్ణువుకు అభిషేకం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుంది. మాఘమాసంలో విష్ణువు పవళించే పానుపు మీద తులసి దళాలు వుంచితే వారికి ఆ దేవదేవుని కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి.
బృహన్నారదీయ పురాణంలో తులసి మొక్క గురించి చెబుతూ ‘‘గంగాస్మరణం, శ్రీహరి నామస్మరణం ఎలాగైతే పాపహరణాలో తులసి నామస్మరణం కూడా పాపహరణం’’ అని పేర్కొన్నారు. తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుందని, తులసిని ప్రార్థించడం వల్ల అనేక రోగములు నశిస్తాయని, తులసిని పూజించే వారు యముడి గురించి భయపడాల్సిన అవసరం లేదని స్కాంద పురాణంలో పేర్కొన్నారు.
తులసి గురించి పురాణాలలో ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొన్న ప్రకారం తులసి ధర్మధ్వజుడు అనే వ్యక్తి కుమార్తె. ఆమె ఒకసారి తపస్సు చేసుకుంటున్న గణపతిని చూసి మోహించి, తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆయన్ని కోరుతుంది. ఆయన దానికి నిరాకరిస్తాడు. దాంతో ఆమె గణపతితో గొడవకు దిగడంతో ఆయన తులసిని రాక్షస జన్మ ఎత్తుతావని శపిస్తాడు. అప్పుడు తులసి గణపతి పాదాల మీద పడి రోదించగా, రాక్షస జన్మ ముగిసిన అనంతరం నువ్వు పవిత్రమైన మొక్కగా మారతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని గణపతి వరం ఇచ్చాడు. ఆ తర్వాత తులసి శంఖచూడుడు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు శివుని చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందింది. అయితే అప్పటి నుంచి తులసి సర్వదేవతలకూ ప్రీతిపాత్రం అయినప్పటికీ, గణపతి విషయంలో మాత్రం తులసికి కొన్ని నిషిద్ధాలు వున్నాయి. గణపతిని తులసితో కొన్ని ప్రత్యేక రోజుల్లో తప్ప ప్రతిరోజూ పూజించరాదు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో తులసి ఆకుతో పూజించవచ్చు.
- అంతర్యామి