అధిక మాసం అంటే ఏమిటి
బుధవారం... అంటే జూన్ 17వ తేదీ నుంచి అధిక ఆషాఢ మాసం ప్రారంభం అయింది. ‘అధిక మాసం’ అనే మాటను మనం అప్పుడప్పుడు వింటూ వుంటాం. ఇంతకీ అధిక మాసం అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? అధిక మాసం ఎన్నేళ్ళకు ఒకసారి వస్తుంది? అధికమాసం అనేది ఎలా ఏర్పడుతుందనే సందేహాలను నివృత్తి చేసుకుందాం.
పంచాంగ గణనం ప్రకారం సంవత్సరాన్ని సౌరమాన, చాంద్రమాన పద్ధతులలో లెక్కిస్తారన్న విషయం తెలిసిందే. సౌరమాన సంవత్సరానికి, చాంద్రమాన సంవత్సరానికి మధ్య ఉన్న తేదా పదకొండుంపావు రోజులు. చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే తక్కువ వ్యవధి కలిగి వుంటుంది. అదేవిధంగా చాంద్రమాన మాసం కూడా సౌరమాన మాసం కంటే చిన్నది. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభం కాదు. అలాంటి సందర్భంలో సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసానికి అధికమాసం అని పేరు.
సాధారణంగా ఒక నెలను కొలవటానికి చంద్రుడు భూమిచుట్టూ తిరగడాన్ని ప్రమాణంగా తీసుకుంటూ వుంటాం. భూమిచుట్టూ చంద్రుడు ఒక్కసారి తిరిగితే అది నెల కింద లెక్క. దానినే చాంద్రమానం అని కూడా అంటారు. అయితే అలా 12 రాశులలో చంద్రుడు తిరిగిన సమయాన్ని మనం సంవత్సరం అని అనలేం. ఎందుకంటే, సూర్యమానానికి, చంద్రమానానికి మధ్య పదకొండుంపావు రోజుల తేడా వుంది కదా. అదే సూర్యుడు 12 రాశులలో ఒక్కోరాశిలో ఒక్కోనెల సంచరించడాన్ని సౌరమానం అంటాం. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం అనేది ప్రతి నెలలోనూ జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మనం ‘మకర సంక్రాంతి’ పేరుతో పండుగలా జరుపుకుంటాం. అయితే మిగతా రాశుల్లో ప్రవేశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వం.
సౌరమానం, చంద్రమానాల్లో వున్న తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెలకంటే ఎక్కువకాలం సంచరించాల్సి వస్తుంది. దానినే అధికమాసం అంటాం. ఇందులో మొదటి నెలలో రవి సక్రాంతి వుండదు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటాం.
- శ్రీరామ్