కురుక్షేత్రానికి మూలమివే!

మహాభారతంలో ఆది పర్వముంటుంది. మహాభారత కథకు మొదలు ఇది. నిజానికి మహాభారతం అన్నా, భగవద్గీత సారం అన్నా అందరికీ కురుక్షేత్ర మహా సంగ్రామం గుర్తుకొస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు నలభై లక్షల మంది  పాల్గొన్నారు అయితే అందులో చివరకు మిగిలేది పాండవుల వైపు ఎనిమిది మంది, కౌరవుల వైపు ముగ్గరు. ఇంత ప్రాణనష్టానికి కారణమైన కురుక్షేత్రానికి మహాభారతంలో ఆధిపర్వంలోనే బీజం పడిందని అంటారు. 

ధార్తరాష్ట్రులు దుర్వృత్తం ఎంత బలంగా చిత్రింపబడితే పాండవుల సద్వృత్తం అంత ఉజ్వలంగా ప్రకాశించటానికి వీలౌతుంది. ఇది భారతకథలో సర్వత్రా పాటించే కథా మర్మమే. అయితే, దానికి బీజప్రాయమైన కథాంశాలు ఆదిపర్వంలో స్థాపింపబడ్డాయి. స్థాపింపబడటం అంటే సంఘటనలు చోటు చేసుకోవడం. ఆధిపర్వంలో జరిగినా కొన్ని సంఘటనలే క్రమంగా పెరుగుతూ పోయాయని అర్థం. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి.

1. దుర్యోధనుడు భీముని బలాన్ని సహించలేక అతడిని చంపే యత్నాలు చేయడం. భీముది బలం అంటే దుర్యోధనుడికి చెప్పలేనంత భయం. అందుకే ఎప్పుడూ భీముడిని చంపాలని ప్రయత్నాలు చేసేవాడు.

2. అర్జునుడు విలువిద్యలో అనన్యవీరుడుగా ప్రకాశిస్తూ ఉండగా, అతనికి ప్రత్యర్థిగా కర్ణుడిని అంగరాజుగా చేసి దుర్యోధనుడు ప్రోత్సహించటం. పాండవులకు ఒక అద్భుతమైన శత్రువును తయారుచెయ్యలనే ఆలోచనతో కవచకుండలాలతో పుట్టిన కర్ణుడిని చేరదీసి పాండవులకు శత్రువుగా నిలబెట్టాడు దుర్యోధనుడు. ఇతడు కౌరవులలో పెద్దవాడు అవడం వల్ల నిర్ణయాధికారం ఎక్కువగా ఉండేది. 

3. దుర్యోధనుడు కణికనీతి నాశ్రయించి ధృతరాష్ట్రుని అండదండలతో, శకునికర్ణాదుల సలహాలతో పాండవులకు ఎగ్గుచేయాలని తలపెట్టటం, లాక్షాగృహదహనయత్నం చేయటం. లాక్షాగృహం అంటే లక్క ఇల్లు. మహాభారతంలో పాండవులు నివసించడానికి దుర్యోధనుడు రహస్యంగా కట్టించి పాండవులను అందులో ఉండేలా ఉపాయం వేసి చివరకు దాన్ని అంటించి పాండవులను సజీవంగా దహనం చెయ్యాలని అనుకుంటాడు. ఆ కుట్ర నుండి పాండవులు తప్పించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. 

4. పాండవులు హస్తినాపురంలో ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని భావించి దుర్యోధనుడు తండ్రిని ప్రేరేపించి వారిని ఇంద్రప్రస్థానికి పంపించటం.

పాండవేతి వృత్తంలో ధర్మరాజాదులు ధార్తరాష్ట్రుల కుతంత్రాలనుండి తప్పించుకొనే అధ్యాయాలు కొన్ని, స్వీయ పరాక్రమాదులను ప్రదర్శించి తమ ఆస్తిత్వాన్ని స్థాపించుకొనే సన్నివేశాలు కొన్ని, ఎట్టికష్టాలలోనైనా ధర్మాన్ని పాటించే నచ్ఛీలాన్ని ప్రదర్శించే సన్నివేశాలు కొన్ని కలసి పాండవ నాయక లక్షణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి.

కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజ్వలించే ప్రతీకారజ్వాలలకు ఆదిపర్వంలోనే అంకురారోపణం జరిగింది. భీమదుర్యోధనుల, కర్ణార్జునుల ద్వంద్వయుద్ధాలే కురుక్షేత్ర యుద్ధ పతాకలు(మూలం), పాండవులు ధర్మానికి తలలొగ్గి కష్టాలకు ఓర్చుకోవటం, అజ్ఞాతంగా మారువేషాలలో నివసించటం, శత్రువులకు అసాధ్యమైన అస్త్రశస్త్రాలను తపస్సుతో యశస్సుతో సాధించటం, అపూర్వ విజయాలతో స్వీయకల్యాణాన్ని, లోకకల్యాణాన్ని సాధించటం. శ్రీకృష్ణుని మైత్రివలన దైవానుకూల్యాన్ని సంపాదించుకోవటమూ అనే ప్రధానాంశాలు ఆదిపర్వంలోనే ప్రదర్శితాలై భావిపాండవ కథా జీవితానికి ప్రాతిపదికలుగా పరిఢవిల్లుతున్నాయి. వీటన్నిటి తాత్పర్య మేమంటే ఆదిపర్వం భారతకథకు అన్నివిధాలా బీజభూతం !

        ◆వెంకటేష్ పువ్వాడ.


More Vyasalu