అటు ఉద్యోగం... ఇటు పిల్లలు... సాధ్యమే!

 

అటు ఉద్యోగం... ఇటు పిల్లలు... సాధ్యమే!

 

ఆడవారు అన్నిరంగాల్లోనూ సమానంగా అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ప్రతిచోటా మగవారికి దీటుగా నిలుస్తున్నారు. కానీ ఈ సందడిలో పడి తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో అన్న అనుమానం వాళ్లని పీడిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఆ ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. కొన్ని జాగ్రత్తలను పాటిస్తుంటే అటు తల్లిగానూ, ఇటు ఉద్యోగిగానూ తమ పాత్రను సమర్థవంతంగా పోషించవచ్చునంటున్నారు నిపుణులు...

గిల్టీ ఫీలింగ్ వద్దు

చాలామంది తల్లులకు తాము ఉద్యోగం చేయడం వల్ల పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నామేమో అన్న అపరాధ భావం వెంబడిస్తూ ఉంటుంది. కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తున్నాన్న ఆలోచనతో ఆఫీసులోనూ, ఆఫీసు పని సక్రమంగా చేయలేకపోతున్ననాన్న బాధతో ఇంట్లోనూ క్రుంగిపోవద్దని సూచిస్తున్నారు. ఉన్న సమయాన్నీ, వనరులనీ సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో అన్న ఆలోచనే కానీ... వెధవ ఉద్యోగం చేయకపోతే బాగుండేది అన్న బాధతో జీవించవద్దని చెబుతున్నారు.

ఉదయం వేళలు కీలకం

చాలా ఇళ్లలో ఉదయం వేళలు హడావుడిగా సాగుతూ ఉంటాయి. పిల్లల్ని బడికి తయారుచేయడం, వంట చేయడం, తను ఆఫీసుకి తయారవడం... లాంటి సవాలక్ష పనులతో ఆడవారు పగలు పొగలు కక్కుతుంటారు. సహజంగానే ఇన్ని పనులతో చిరాకు కలుగుతుంది. అది భర్తతో వాదనలకీ, పిల్లలతో తిట్లకీ దారితీస్తుంది. అందుకే ఉదయం వేళలు వీలైనంత ప్రశాంతంగా సాగిపోయేలా చూడమంటున్నారు. బ్యాగ్ సర్దుకోవడం, టిఫిన్ పెట్టుకోవడం లాంటి చిన్నచిన్న పనులు పిల్లలే చేసుకునేలా ప్రోత్సహించాలి. యూనిఫాం సిద్ధం చేయడం, హోంవర్కు చేయించడం వంటి పనులు రాత్రివేళే ముగించుకునే ప్రయత్నం చేయాలి.

మల్టీ టాస్కింగ్

ఆడవారికి మల్టీ టాస్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే సమయంలో రెండు విభిన్నమైన పనులను ఎలాంటి ఒత్తిడీ లేకుండా కానిచ్చేయడమే మల్టీటాస్కింగ్. టీవీ చూస్తూ కూరలు తరుక్కోవడం, ఫోన్ మాట్లాడుతూ కూర కలియతిప్పడం, ప్రయాణంలో ఫైల్స్ చూసుకోవడం... అన్నీ మల్టీ టాస్కింగ్ కిందకే వస్తాయి. మొదట్లో కాస్త కొత్తగా, అసౌకర్యంగా ఉన్నా... అలవాటయ్యేకొద్దీ సులువనిపిస్తాయి. అన్నింటికీ మించి విలువైన సమయాన్ని ఆదా చేస్తాయి.

పిల్లల ఆశని గమనించాలి

తల్లి ఉద్యోగం చేస్తోందంటే పిల్లలకి సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ తనతో ఎక్కువసేపు గడపడం లేదన్న ఆరోపణా ఉంటుంది. అందుకే వారి ఆరోపణలని ఓపికగా వినండి. ఇంట్లో వీలైనంత సమయాన్ని వారితో గడిపే ప్రయత్నం చేయండి. సాయంత్రం వేళ అలా వారిని షికారుకి తీసుకువెళ్లేందుకూ, అప్పుడప్పుడూ టూర్ ప్లాన్ చేసేందుకూ ప్రయత్నించండి. మీరు వారికి quantity of time ఇవ్వలేకపోవచ్చు, కానీ quality of time ఇచ్చే ప్రయత్నం చేయండి. వీలైతే వారితో గడిపేందుకు ఒక షెడ్యూల్ని కూడా ఏర్పాటు చేసుకోండి.

రూపాయి కోసం

చాలామంది మధ్యతరగతి భారతీయులకి ప్రతి రూపాయీ జాగ్రత్తగా ఖర్చుచేసుకోవాలన్న తపన ఉంటుంది. అది సహేతుకమే! కానీ ఒక రూపాయి ఖర్చుపెడితే కాస్త విలువైన సమయం మిగుల్తుంది అనుకుంటే వెనక్కి తగ్గవద్దు. పనిమనుషులకి, వాషింగ్ మెషిన్లకీ, మైక్రోవేవ్ ఓవెన్లకీ, వాక్యూం క్లీనర్లకీ, టూర్లకీ, సినిమాలకీ... కాస్త డబ్బు ఖర్చుచేయడం ద్వారా పిల్లలతో విలువైన కాలాన్ని గడిపే అవకాశం ఉందనుకుంటే పర్సు బయటకు తీయాల్సిందే!

సమయమే డబ్బు – సమయమే బంధం

మనకి తెలియకుండానే చాలా సమయం అనవసరమైన విషయాలకి వెచ్చస్తూ ఉంటాము. వాటికి అలవాటుపడిపోవడం వల్ల సదరు విషయాలు చాలా అవసరమైనవిగా, అవి లేకపోతే జీవితం లేదేమో అన్నట్లుగా తోస్తాయి. రోజూ పొల్లుపోకుండా పేపరు చదవడం, సీరియల్స్ చూడం, వాట్సప్లో మునిగిపోవడం... ఇలా గడచిపోయిన రోజుని ఓసారి గుర్తుచేసుకుంటే సమయాన్ని abuse చేసిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఆ అలవాట్ల మీద నియంత్రణ సాధిస్తే బోలెడు సమయం మిగుల్తుంది.

- నిర్జర.