"ఆ అమ్మాయే చేసుంటుంది. ఎత్తకు. మనమేం చేయాలో ఆలోచించుకుని అప్పుడు లిఫ్ట్ చేద్దాం" అన్నాడు యోగి హుషారుగా.

 

    "ఒక వేళ ఇది అపర్ణ ఫోనయితే?" ప్రశ్నించాడు శ్రీధర్.

 

    "ఏమవుతుంది? ఎందుకు తియ్యలేదంటుంది. బాత్ రూమ్ లో వున్నానని చెప్పొచ్చు."

 

    "ఇంతకీ ఇప్పుడేం చేద్దామని నీ ఆలోచన?" అడిగాడు శ్రీధర్.

 

    "ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడావనుకో, ఆమె మాటలు నీకు మాత్రమే వినిపిస్తాయి. నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావనే ఆనందోద్వేగంలో వుంటావు తప్ప, ఆమె ఆచూకీ గురించి ఆలోచించవు, ఆలోచించలేవు. నేనామె మత్తులో లేను. మందు మత్తులో వున్నాను. ఇప్పుడు నా బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. ఆమె మీద నాకెలాంటి ఆసక్తి లేదు. కనుక నా సర్వశక్తుల్ని ఆమె సంభాషణ మీద కేంద్రీకరిస్తాను. మీ యిద్దరు మాట్లాడుకునే సంభాషణ నాకు వినిపిస్తే, ఆమెని బోల్తా కొట్టించడానికి నువ్వు ఏం మాట్లాడాలో సైలెంట్ గా ఒక పేపరుమీద రాసి నీకు చూపిస్తుంటాను. అదే నువ్వు మాట్లాడు" అన్నాడు యోగి.

 

    "అదెలా సాధ్యం?" అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యపోతూ.

 

    "నీది కార్డ్ లెస్ ఫోన్. నువ్వు హేండ్ సెట్ తీసుకో. సరిగ్గా అదే సమయంలో నేను బేస్ పీస్ స్పీకర్ బటన్ ప్రెస్ చేస్తాను. హేండ్ సెట్ లో నీకు, బేస్ పీస్ ద్వారా నాకు ఒకేసారి ఆమె మాటలు వినిపిస్తాయి. అయితే ఒక విషయంలో జాగ్రత్తగా వుండాలి. అనవసరమైన శబ్దాల్ని మనం క్రియేట్ చేస్తే- బేస్ పీస్ కున్న బిల్టిన్ మైక్రోఫోన్ ద్వారా అతి చిన్న శబ్దమైనా ఆమెకు వినిపిస్తుంది. దానికి కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. బొటనవేలితో బిల్టిన్ మైక్రోఫోన్ హోల్ ని మూసేస్తాను. అయినా జాగ్రత్తగా వుండటం మంచిది..." అంటూ యోగి స్క్రిబ్లింజి పేడ్, పెన్ తీసుకుని కార్డ్ లెస్ బేస్ పీస్ ని టీపాయ్ దగ్గరికి జరుపుకుని-

 

    "లిఫ్ట్ చెయ్" అన్నాడు. అప్పటికే యోగి మెదడులో ఒక చురుకైన ఆలోచన చోటుచేసుకుని వుంది.

 

    ఇవేవీ తెలీని పూజ అనే అపరిచితురాలు శ్రీధర్ తో మాట్లాడడానికి సంసిద్ధంగా వుంది ఫోన్ కి ఆవేపున.

 

    వణుకుతున్న చేత్తో నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్రీధర్. సరిగ్గా అదే టైంకి సింక్ అయ్యేలా, బేస్ పీస్ స్పీకర్ ఫోన్ బటన్ ప్రెస్ చేశాడు యోగి.

 

    అప్పటికే యోగి స్క్రిబ్లింజి పేడ్ మీద ఒక వాక్యం రాసి శ్రీధర్ వైపుకి తిప్పాడు.

 

    దాన్ని చూస్తూ-

 

    "హలో...ఎవరు...?" అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఎగ్సైట్ మెంట్ ని నియంత్రించుకుంటూ.

 

    "రావున్నాడా?" అదే కంఠం, అదే మార్ధవం, అదే చిలిపితనం... అదే మాధుర్యం... అదే మృధుత్వం!

 

    "హలో మిస్ పూజ....హౌ ఆర్యూ? రావు పోయాడు. గౌడ పోయాడు. గడ్డం గుజ్రాల్ వచ్చాడు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో యమ బిజీగా వున్నాడు. నువ్వు సైట్ కొట్టాలన్నా సాధ్యంకాదు. అందమైన అమ్మాయికన్నా అధికారమే గొప్పది గదా ఇండియన్ పొలిటీషియన్స్ కి" నవ్వుతూ చెప్పాడు ఓవేపు యోగికేసి చూస్తూ.

 

    "ఈ గుజ్రాల్ మరీ ఘోరమయ్యా బాబూ! పి.వి.నే చాలా బెటర్. చూద్దాం, లెటజ్ సీ...దేఖేంగే అంటారు. ఈయన అది కూడా అనడు. అవునూ...ఏంటి ఇంతసేపు... ఏం చేస్తున్నావ్? ఇప్పుడే పడుకున్నావా?" అడిగిందామె.

 

    ఆమె మాటలు బేస్ పీస్ స్పీకర్ ఫోన్ లోంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి యోగికి. నిజంగానే ఆమె కంఠం ఎవరినైనా ఆమె మెస్మరిక్ స్పెల్ లో పడేసేలా వుంది. అద్భుతమైన లాలిత్యం, శ్రీధర్ పట్ల ఆమెకున్న ఆసక్తి, ఇష్టాన్ని ఎంతో ప్రగాఢంగా బహిర్గతం చేస్తోంది ఆమె కంఠం.

 

    నిజంగానే అంత మధురమైన కంఠాన్ని తనెప్పుడూ విని వుండలేదు. ఆ కంఠానికి శ్రీధర్ ఏమిటి... ఎవరయినా పడిపోవలసిందే!

 

    "బాత్ రూమ్ లో వున్నాను, అందుకే లేట్...సారీ..." యోగి స్క్రిబ్లింగ్ పేడ్ మీద ఏం రాసి చూపించాడో అదే అన్నాడు శ్రీధర్.

 

    "నీది కార్డ్ లెస్ ఫోన్ గదా! హేండ్ పీస్ తోటే బాత్ రూమ్ కి వెళ్ళవచ్చుగా?" అంది ఆమె తిరిగి.

 

    అప్పటికే యోగి మరో వాక్యం రాసి అతని ముందుంచాడు.

 

    "మర్చిపోయి వెళ్ళాను. వచ్చింది నీ ఫోనే అయుంటుందని వూహించి ఒళ్ళు కూడా తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చాను. ఫ్లోరంతా తడిసిపోతోంది" అన్నాడు శ్రీధర్.

 

    "దట్స్ గుడ్...భక్తికి, ప్రేమకి, శృంగారానికి శుభ్రత చాలా ముఖ్యం, భుజం సపోర్ట్ తో హేండ్ పీస్ ని చెవి కానించుకుని ఒళ్ళు తుడుచుకో" అందామె.

 

    ఏం మాట్లాడాల్సిందీ అప్పుడే పేడ్ మీద వేగంగా రాస్తూ- ఒక్కక్షణం ఆగమన్నట్లు యోగి శ్రీధర్ కి కళ్ళతోనే సంజ్ఞ చేశాడు.

 

    "ఏయ్...ఏం చేస్తున్నావ్? ఒళ్ళు తుడుచుకుంటున్నావా?" తిరిగి ఆమె ప్రశ్నించింది శ్రీధర్ వెంటనే మాట్లాడలేకపోయేసరికి.

 

    "ఆ...అవును..." అన్నాడు శ్రీధర్ తడబాటుగా.

 

    అది చూసి యోగి చిరాకుపడి తడబాటు పడతావెందుకు అని రాసి శ్రీధర్ కి చూపించాడు.

 

    శ్రీధర్ టెన్షన్ తో వుండటంతో, అది ఆమెతో మాట్లాడాల్సిందేమో అనుకుని-

 

    "తడబాటు పడతావెందుకు?" అనేశాడు ఫోన్ లో.

 

    అది వింటూనే తల కొట్టేసుకున్నాడు యోగి.

 

    "తడబాటా? నేనా? నువ్వు తడబాటు పడుతూ నన్నంటావేమిటి? వాట్ హేపెన్డ్ టు యూ?" ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తూ అందామె.

 

    రామ... రామ... ఏంటిరా... ఇలా చేస్తున్నావ్ అని రాసి శ్రీధర్ కి చూపించాడు యోగి.

 

    "రామ...రామ...ఏంటిరా ఇలా చేస్తున్నావ్?" యధాతధంగా అనేశాడు శ్రీధర్ ఫోన్ లో.

 

    ఫోన్ కి ఆవేపునున్న పూజ బిత్తరపోతే-ఎదురుగా వున్న యోగి గుడ్లురిమి చూశాడు శ్రీధర్ కేసి.

 

    "రామ రామ ఏమిటి? నేనేం చేస్తున్నాను? ఆర్యూ ఫైన్? నీవే నన్ను రా అని సంబోధించడం నాకు చాలా బాగా నచ్చింది..." అందామె.