'మజిలీ'తో ముద్ర వేసిన చైతూ 'లవ్ స్టోరి'తో ప్రేమలో పడేస్తాడా?
on Dec 1, 2020
'జోష్' నుంచి 'వెంకీ మామ' వరకు పద్దెనిమిది సినిమాలు చేసిన నాగచైతన్యకు 50 శాతం విజయాలు లభించాయి. 'మజిలీ'తో మంచి విజయం సాధించడంతో పాటు నటుడిగానూ అదరగొట్టిన అతను 'వెంకీ మామ'లో తన మేనమామ వెంకటేశ్‌తో కలిసి నటించి ఆకట్టుకున్నాడు. ఆరేళ్ల క్రితం 'మనం'లో తొలిసారి ద్విపాత్రలు పోషించి మెప్పించాడు. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునతో కలిసి నటించినా, ఏమాత్రం బిగుసుకుపోకుండా 'ఫ్రీ'గా నటించి అలరించాడు.
ఓ పిల్లవాడి తండ్రయిన రాధామోహన్ పాత్రలో సీరియస్నెస్నూ, నాగార్జున పాత్రలో అల్లరితనాన్నీ బాగా ప్రదర్శించి, ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ అనుభవంతో 'వెంకీమామ'లో వెంకటేశ్‌తోనూ కలిసి నటించాడు. క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్‌ను డైరెక్టర్ బాబీ శ్రద్ధగా తీర్చిదిద్దినట్లయితే ఇంకా బాగా పేరు తెచ్చుకొని ఉండేవాడే.
తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'లవ్ స్టోరి'ని కంప్లీట్ చేశాడు చైతూ. ఇందులో అతని జోడీగా సో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవి నటించింది. ఇప్పటికే ఓ పాట టీజర్లో చైతూ ప్రదర్శించిన హావభావాలు చూసి, అతని ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులూ శభాష్ అన్నారు. చైతూలోని నటుడు మరోసారి ఈ సినిమాతో విజృంభించాడని వారు నమ్ముతున్నారు. సంక్రాంతికి 'లవ్ స్టోరి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీతో చైతూ మరో ఘన విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read