థియేటర్లలో క్రిస్మస్కు వస్తున్న 'షకీలా' బయోపిక్!
on Dec 1, 2020
శృంగారభరిత మలయాళీ చిత్రాలతో సంచలన తారగా పేరుపొందిన షకీలా జీవితం ఆధారంగా 'షకీలా' టైటిల్‌తో రూపొందిన బహు భాషా చిత్రం క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో జరుగుతున్న వదంతులకు తెరపడినట్లే. ఇందులో టైటిల్ రోల్‌ను రిచా చాధా పోషించింది. నిర్మాతలు లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ సినీ ప్రియుల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
పోస్టర్లో చీర కట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని, కళ్లకు కలర్ గ్లాసెస్ పెట్టుకొని గ్లామరస్ అవతారంలో అదరగొడుతోంది రిచా. పోస్టర్ బ్యాగ్రౌండ్లో ఆమెను బాక్సాఫీస్ క్వీన్ అనే పొగడ్తలు, ఆమె దేహాన్ని వర్ణించే అశ్లీల పదాలు వంటివి కనిపిస్తున్నాయి. ఇది డర్టీ పిక్చర్ కాదనీ, శృంగార తారగా ఆమెకున్న ఇమేజ్, స్టార్‌డమ్‌ను దాటి చూపించే సినిమా అని ఆ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
ఒకప్పుడు మలయాళీ చిత్రసీమను ఏలిన సెక్స్ బాంబ్‌గా పేరుపొందిన షకీలా షాకింగ్ ట్రూ స్టోరీ ఆధారంగా, జీవితంలో ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు, వివక్ష, సైడ్ క్యారెక్టర్ల నుంచి మొదలై బి-గ్రేడ్ సినిమాలతో అపరిమితమైన క్రేజ్ సాధించే దాకా ఆమె ప్రయాణాన్ని 'షకీలా' చూపించనున్నది. తన సినిమాలతో ఎలా అప్పటి సౌత్ సూపర్స్టార్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిందో కూడా ఈ సినిమా తెలియజేయనుంది.
ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన షకీలా పదహారేళ్ల ప్రాయంలో నటిగా తన కెరీర్ ఆరంభించారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. 90ల కాలంలో, 21వ శతాబ్దారంభంలోనూ అడల్ట్ స్టార్‌గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేశారు. ఆమె సినిమాల కోసం ఓ వర్గం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూసేవారు. ఆమె సినిమా రిలీజయ్యిందంటే థియేటర్ల దగ్గరర సోకాల్డ్ సూపర్స్టార్ల సినిమాలకు మించిన జనం సందడి కనిపించేది.
గతంలో షకీలాను స్వయంగా డైరెక్ట్ చేసిన ఇంద్రజిత్ లంకేష్ రూపొందించిన 'షకీలా' మూవీలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లే కీలక పాత్రలు పోషించారు.
Also Read