హీరోలూ.. కాస్త కిందకు దిగండి ప్లీజ్
on Apr 27, 2015
తెలుగు చిత్రసీమలో నిర్మాత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏ నిర్మాత కళ్లలోనూ ఆనందం లేదు. కష్టాల కన్నీళ్లు తప్ప. సినిమా మొదలెట్టడం వరకే తన చేతుల్లో ఉంది. సినిమా పూర్తి చేయడం, ఆ సినిమాని విడుదల చేయడం అన్నీ దైవాదీనమే. చిన్నా చితకా సినిమాలకే కాదు... బడా స్టార్లున్న సినిమాలదీ ఇదే పరిస్థితి. తడిసి మోపెడవుతున్న బడ్జెట్‌ని ఎలా కంట్రోల్ చేయాలో నిర్మాతలకు పాలుపోవడం లేదు. అందులో భాగంగా బడ్జెట్ కంట్రోల్ విషన్ మొదలెట్టారు కొంతమంది నిర్మాతలు. ఛానళ్లు, వార్తా పత్రికలకు యాడ్ కటింగ్ చేయడం.. ఇందులో భాగమే. `హీరోల పారితోషికాలు తగ్గించకుండా.. మా మీద పడ్డారేంటి?` అని మీడియా గోల పెడుతుంది. త్వరలో హీరోలూ తమ పారితోషికం తగ్గించుకొంటారు.. ఆ దిశ గా ప్రయత్నాలు మొదలెట్టాం అని నిర్మాతలు చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా, మన హీరోలు దిగి వస్తారా? నిర్మాతల కన్నీళ్లు తుడుస్తారా?
మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు పరిశ్రమలో. వెంకీ, నాగ్, బాలయ్య.. వీళ్లంతా సీనియర్లు. రవితేజ, గోపీచంద్, నాగచైతన్య.. వీళ్లంతా మిడిల్ హీరోలు. ఎవరి రేంజుకి తగిన పారితోషికం వాళ్లు అందుకొంటున్నారు. మహేష్ బాబు ఓ సినిమాకి రూ.18 కోట్ల వరకూ పారితోషికం తీసుకొంటాడని టాక్. పవన్ కూడా ఇంచుమించుగా అంతే. ఎన్టీఆర్ పది కోట్లకు తగ్గడు. చరణ్, బన్నీ.. వీళ్లంతా ఏడెనిమిది కోట్లకు తూగుతారు. ప్రభాస్ బాహుబలి కోసం రూ.15 కోట్లు తీసుకొన్నాడట. ఈ అంకెలు వింటుంటే గుండెలు గుభేలు మంటున్నాయి కదూ. హీరోల స్టార్ డమ్, వాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌ని బట్టే పారితోషికాలు ఉంటాయ్. కాదనలేం. కానీ హీరోకే పది నుంచి ఇరవై కోట్ల వరకూ పారితోషికం చదివించుకొంటే.. హీరోయిన్లకు ఎంతివ్వాలి? దర్శకుడికి ఎంతిచ్చుకోవాలి? సినిమా ఎంతటిలో పూర్తి చేసుకోవాలి? ఓ స్టార్ హీరో సినిమా అంటే పారితోషికాల రూపంలోనే దాదాపుగా రూ.30 కోట్ల వరకూ భరించాల్సివస్తుంది. ఓ ఇరవైలో సినిమా పూర్తి చేసినా.. మొత్తానికి రూ.50 కోట్లు అవుతోంది. సినిమా హిట్టయితే ఫర్వాలేదు. కానీ పోతే నిర్మాత పరిస్థితి ఏమిటి? హిట్టయిన సినిమాకే పెట్టుబడితిరిగి రావడం లేదు. ఫ్లాప్ టాక్ వస్తే ఆ నిర్మాత రోడ్డు మీద పడాల్సిందే.
రజనీకాంత్ సినిమా లింగ... మన నిర్మాతల కళ్లూ తెరిపించింది. ఈ సినిమా దాదాపు వంద కోట్ల వరకూ ఖర్చయ్యింది. అందులో రజనీ పారితోషికమే దాదాపుగా రూ.40 కోట్లు. సినిమా బాగా ఆడితే వందకు వంద వచ్చేవే. కానీ అట్టర్ ఫ్టాప్ అయ్యింది. దాంతో.. రూ.30 కోట్లకంటే ఎక్కువ వసూలు చేయలేకపోయింది. అంతే... ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఆత్మహత్యల వరకూ వెళ్లారు. రజనీకాంత్ దిగి వచ్చి పారితోషికం లోంచి కొంత మొత్తం తిరిగి ఇచ్చేంత వరకూ బయ్యర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ పరిస్థితి తెలుగునాట కూడా ఉంది. కానీ ఓ బయ్యరూ నోరు మెదపలేక లోపల లోపల కుమిలిపోతున్నాడు. నిర్మాత ఈ నష్టాల్ని కవర్ చేయలేక.. సినిమాల దూరమవుతున్నాడు. బడ్జెట్ కంట్రోల్ అయితే తప్ప.. ఈ పరిస్థితి అదుపులోకి రాదు. అలా రావాలంటే.. ముందు హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలి. కానీ అదే జరిగే విషయమేనా??
`నా పారితోషికంలో రావాల్సిన బాకీ వస్తేగానీ... డబ్బింగ్ చెప్పను` అని ఈమధ్య మొండికేశాడు ఓ స్టార్ హీరో. అలాంటప్పుడు పారితోషికాలు ఎక్కడ తగ్గించుకొంటారు? ఓ సినిమా హిట్టయితే తమవల్లే ఆడింది అనే భ్రమల్లో బతుకుతున్నారు హీరోలు. అందుకే హిట్ కొట్టగానే పారితోషికాలు పెంచేస్తుంటారు. అలాంటప్పుడు ఎందుకు తగ్గించుకొంటారు? అందుకే నిర్మాతలు కూడా ఓ మధ్యేమార్గం ఆలోచించాలి. సినిమా తీద్దాం.. లాభాలు పంచుకొందాం అంటూ ఓ ఒప్పందం చేసుకొంటే తప్ప పారితోషికాల భారం తగ్గదు. సినిమాలో తన పెట్టుబడీ ఉంటే... మరింత జాగ్రత్తగా మసులు కొంటాడు హీరో. మంచి సినిమా తీయడానికి మరింత శ్రద్ధగా పనిచేస్తాడు. ప్రస్తుతం నిర్మాతల ఆలోచనా అదే. కలసి సినిమా తీద్దాం... లాభాలు పంచుకొందాం అనే కాన్సెప్ట్ హీరోల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి హీరోలేం చేస్తారో చూడాలి. నిర్మాతల్ని ఆదుకొనేందుకు హీరోలు ఓ మెట్టు దిగినా తప్పులేదు. మరి ఆ ఆడుగు వీరిలో ఎవరేస్తారనేది ఆసక్తిగా మారింది.