పవన్ బాటలో శ్రుతిహాసన్
on Nov 3, 2014
మేక్ ఏ విష్ సంస్థ విన్నపం మన్నించి... మృత్యువుతో పోరాడుతున్న శ్రీజ అనే అమ్మాయిని కలసుకొని ధైర్యం చెప్పొచ్చాడు పవన్ కల్యాణ్. పవన్ స్పందన చాలామంది తారల్ని ఆలోచింపజేసింది. మొన్నామధ్య రామ్‌చరణ్ కూడా ఇలానే స్పందించి ఓ బాలుడి చివరి కోరిక తీర్చాడు. ఇప్పుడు వీరిద్దరి బాటలో శ్రుతిహాసన్ కూడా పయనించింది. పుణేకు చెందిన సీతల్ అనే బాలిక గత కొంతకాలంగా మృత్యువుతో పోరాడుతోంది. డాక్టర్లు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇక ఆమె చివరి కోరికల్ని తీర్చడం మినహా చేసేదేం లేదని డాక్టర్లు కూడా తేల్చేశారు. శీతల్‌కు శ్రుతిహాసన్ అంటే అభిమానమట. ఆమెతో ఒక్కసారి మాట్లాడాలని శీతల్ తన చివరి కోరికగా బయటపెట్టింది. దాంతో మేక్ ఏ విష్ సంస్థ ముందుకొచ్చి... శీతల్ కోరిక తీర్చడానికి శ్రుతిని సంప్రదించింది. బొంబేలో ఓ షూటింగ్ నిమిత్తం బిజీగా ఉన్న శ్రుతి.. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన పూణె వచ్చింది. శీతల్‌నికలుసుకొని ధైర్యం చెప్పింది. శీతల్ తో దాదాపు 30 నిమిషాలు గడిపింది. అలా ఆ చిన్నారి కోరిక తీర్చి వెళ్లింది. అభిమానం అంటే ఒకరి దగ్గర నుంచి పుచ్చుకోవడమే కాదు, తిరిగి ఇవ్వడం కూడా. ఈ విషయాన్ని మన తారలు బాగానే గుర్తు పెట్టుకొంటున్నారు. థ్యాంక్యూ శ్రుతి.