ఆడకుండానే... ఓడిన ఎన్టీఆర్
on Dec 16, 2015
''బరిలోకి దిగుతున్నా.. కాచుకో'' అన్నప్పుడు.. 'ఆట' మొదలెట్టాల్సిందే. అప్పుడే కదా.. ఓడిందెవరో, గెలిచేదెవరో తేలేది. ఎన్టీఆర్ కూడా... సంక్రాంతికి సవాల్ విసిరాడు. వచ్చేస్తున్నా.. చూసుకోండి అన్నాడు. దాంతో ఈ సంక్రాంతికి బాబాయ్ - అబ్బాయ్ ల పోటీ చూడొచ్చని అభిమానులూ ఉవ్విళ్లూరారు. ఇద్దరిలో గెలిచేదెవరో చూద్దామని చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూడ్డం మొదలెట్టింది. తీరా చూస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఔను.. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో విడుదల కావడం లేదు. అందుకు సవాలక్ష కారణాలు.
ఈ సంక్రాంతికి మొదట బెర్తు ఖాయం చేసుకొన్నది డిక్టేటరే. బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరు. ఈ పండగ ఆయనకు బాగా కలిసొచ్చింది. అందుకే.. డిక్టేటర్‌నీ సంక్రాంతికే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అందుకు ఏర్పాట్లూ మొదలయ్యాయి. మధ్యలో ఎన్టీఆర్ కూడా సమరశంఖం పూరించాడు. ఫిబ్రవరిలో రావల్సిన నాన్నకు ప్రేమతో సినిమాని పట్టుబట్టి సంక్రాంతి బరిలో దించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. సన్నిహితులు వారిస్తున్నా, దర్శకుడు వొద్దన్నా వినకుండా - బాబాయ్‌తో పోటీకి రెడీ అయ్యాడు. అయితే ఎన్టీఆర్ అనుకొన్నదేదీ జరగట్టేదు. షూటింగ్ నత్తనడక నడుస్తోంది. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ఇది చాలదన్నట్టు... తండ్రిమరణంతో దేవిశ్రీ ప్రసాద్ కొన్నాళ్లు నాన్నకు ప్రేమతో యూనిట్‌కి దూరమయ్యాడు. ఆయన వస్తే గానీ.. ఆర్.ఆర్ జరగదు. సో... నాన్నకు ప్రేమతో సినిమాని సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టం. అందుకే.. ఇప్పుడు ఈ సినిమా పోటీ నుంచి తప్పుకొంది.
ఎన్టీఆర్ బరిలో దిగితే... సంక్రాంతికి బాలయ్యతో డీ కొడితే.. ఎవరు నెగ్గేవారో ఎవరు ఓడేవారో తెలిసేది. ఆ పోటీ రసవత్తరంగా ఉండేది. కానీ ఎన్టీఆర్ సైడ్ అయిపోవడంతో.... సంక్రాంతి మజా తగ్గినట్టైంది. ఎనీవే.. బాలయ్య మాత్రం డిక్టేటర్‌తో వచ్చేస్తున్నాడు. నందమూరి అభిమానులకు అది చాలు కదా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
