లోఫర్ రివ్యూ
on Dec 17, 2015
ఎంత మేధావులైనా ఒక్కోసారి పర్‌వర్టెడ్‌గా ఆలోచిస్తుంటారేమో..?
అసలు మేధావి అనేవాళ్లంతా.. అలానే ఆలోచించాలేమో?
లేదంటే.. వాళ్లకసలు గుర్తింపు రాదని భయపడతారేమో..?
అమ్మ
అమ్మ
అమ్మ
అంటూ ప్రతీసారీ అలానే పిలవకూడదు.. దీనెమ్మ.. అని పిలిచినా తప్పులేదు అనుకొంటారేమో!
ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆలోచించడానికి ఇంకేం లేనట్టు, చూపించడానికి తన దగ్గర సరుకు మిగలనట్టు, పాత కథలనే పట్టుకొని వేలాడుతున్న పూరి - సమాజంలోని సున్నితత్వాన్ని పూర్తిగా మరచి, దారి తప్పి - తీసిన సినిమా లోఫర్!!
లోఫర్ ఎలా ఉంది అని చెప్పే ముందు మచ్చుచ్చి ఓ సీన్ వదలాలనిపిస్తోంది.
బానిస శృంఖలాల్లో ఉన్న ఓ ఇల్లాలు.. తొలిసారి భర్తని ఎదిరించి - చెంప దెబ్బ కొడుతుంది.
దాంతో ఆ భర్త అహం దెబ్బతింటుంది.
అప్పటికే తండ్రీ - ఇద్దరు కొడుకులు కలిసి మందుతాగుతుంటారు.
దానికి తోడు ఈ చెంప దెబ్బ.
''నీ అమ్మ నన్ను కొట్టిందిరా'' అంటూ కొడుకుల దగ్గర మొరపెట్టుకొంటాడు తండ్రి.
''నాన్నా.. నీ పెళ్లాన్ని నేను చంపేయొచ్చా'' అంటాడో కొడుకు.
''చంపేయ్'' అని నాన్నగారి సలహా.
దాంతో కత్తి పట్టుకొని అమ్మ వెంట పడతాడు ఓ తనయుడు.
రెండో కొడుకు ఊరకే ఉంటాడా? కన్నతల్లిని అన్నయ్య చంపే విధానాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.
ఇదీ.. 'లోఫర్'లోని ఓ ఆణిముత్యాం?
ఈ సమాజానికి మంచి చెప్పొద్దు. అని సినీ సూత్రాలకు, కమర్షియల్ విలువలకు విరుద్ధం..? నిజమే. కానీ ఇప్పుడేం చూపిస్తున్నావ్? తల్లీ కొడుకుల అనుబంధాని చూడాలనుకొనే భావి ప్రేక్షకుడికి.. చరిత్ర పుటల్లో లోఫర్‌లాంటి సినిమా తగిలితే, అది చూస్తే.. వాడేమైపోతాడు? పూరి లోని పర్‌వెక్టెడ్‌కి ఇంతకంటే నిదర్శనం కావాలా?
ఇప్పుడు కథలోకి వెళ్దాం.. సింపుల్‌గా చెప్పాలంటే.. రాజా (వరుణ్ తేజ్) ని వాళ్లనాన్న (పోసాని) ఓ లోఫర్‌లా పెంచుతాడు. నీ తల్లి చనిపోయింది అని నమ్మించి.. చిన్నప్పుడే తల్లి(రేవతి)ని దూరం చేస్తాడు. తన జీవితంలో ఎదురైన పారిజాతం (దిశాపటాని)ని చూసి ప్రేమలో పడిపోతాడు. దిశా ఎవరో కాదు.. తన మేనమామ కూతురే అని తెలుస్తుంది. అంతేకాదు.. తన తల్లి బతికే ఉందని అర్థమవుతుంది. ఇటు ప్రాణానికి ప్రాణమైన తల్లికీ, అటు ప్రేమించిన ప్రియురాలికి మళ్లీ రాజా ఎలా దగ్గరయ్యాడు అన్నదే.. లోఫర్ స్టోరీ.
పూరి కథల గురించి పెద్దగా ఆలోచించడన్నది తెలిసిన విషయమే. ఈసారీ... దాని గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోలేదు. రెగ్యులర్ ఫార్ములా ఒకటి అనేసుకొని - దానికి మదర్ సెంటిమెంట్‌ని జోడించాడంతే. అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపూ పూరి గత చిత్రాలు ఒకదాని తరవాత మరోటి కళ్లముందు అలా అలా మెదులుతూ వెళ్లిపోతుంటాయి. ఒక్కటే తేడా - హీరో హీరోయిన్లు మారారంతే. అవే ఫైట్లూ, అవే సీన్లూ, దాదాపుగా అవే డైలాగులూ..! కానీ చెప్పేవాళ్లు ఛేంజ్ అయ్యారు. రేవతి, పోసాని కృష్ణమురళి పాత్రలు పక్కన పెడితే.. మిగిలిన సన అంతా భరించడం కష్టం. మధ్యమధ్యలో వరుణ్ తేజ్ ''నేను మాస్ పాత్రలకు రెడీ అయిపోయానోచ్'' అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంట్రవెల్ వరకూ ఈ సినిమాని చచ్చీ చెడీ... పోసాని పంచ్‌లపై ఆధారపడి లాక్కొచ్చేశాడు పూరి. ఆ తరవాత.. ఏం చేయలేకపోయాడు. దాంతో కథంతా అక్కడే గింగిరాలు తిరుగుతుంటుంది. హీరో 'నేను నీ కొడుకుని' అని తల్లి దగ్గర ఎందుకు చెప్పలేకపోయాడో అర్థం కాదు. ఒక వేళ చెప్పేస్తే.. కథకి అక్కడే శుభం కార్డు వేసేయాల్సివస్తుందని పూరి భయపడ్డాడేమో? హీరోయిన్ పాత్ర కూడా అంతే! సెకండాఫ్‌లో ఆమె పాటలకు ముందు మాత్రమే వస్తుంటుంది. ఇంట్రవెల్ తరవాత గంట కథ నడపడం.. పూరి వల్ల కాలేదు. అందుకే బ్రహ్మానందం, అలీ పాత్రల్ని కావాలని ఇరికించాడు. క్లైమాక్స్ కూడా రొడ్డకొట్టుకు వ్యవహారం. హింస మితిమీరింది. పూరి స్టైల్‌కీ - కథకీ - తెరపై చూపించిన సెంటిమెంట్‌కీ పొంతన కుదర్లేదు.
వరుణ్ చూడ్డానికి బాగున్నాడు. తనకు తగిన పాత్ర దొరికింది. ఎత్తును బాగా ఉపయోగించుకొంటూ ఫైట్లు చేశాడు. ఎమోషన్ సీన్లలోనూ ఓకే. దిశాపటాని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. రేవతి తల్లి పాత్రలో మెప్పించింది. తల్లి పాత్ర అంటే జయసుధే అనుకొన్నవాళ్లకు ఇంకో ఆప్షన్ దొరకింది. పోసాని తన వంతుగా ఈ సినిమాని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ లౌడ్ కామెడీ భరించడం మాత్రం కష్టం. బ్రహ్మానందం, అలీ.. పాత్రలు నవ్వించలేకపోయాయి. విలన్లలో క్రూరత్వం తప్ప ఇంకేం కనిపించలేదు.
దర్శకుడిగా పూరి చేసిన మరో విఫల ప్రయత్నం లోఫర్. తనని తాను పూర్తిగా మార్చుకొని తీరాలి. ఓకే జోనర్ లోంచి బయటపడాలి. కొత్తగా ఆలోచించడం మొదలెట్టాలి. అప్పటికి గానీ.. అతని నుంచి మంచి సినిమాలు రావు. సాంకేతికంగా ఈ సినిమా ఎంత బాగుంటే ఎవరికి కావాలి ? కథలో దమ్ము లేనప్పుడు. పూరి సినిమా కదా, ఏదో అద్భుతాలు సృష్టిస్తాడన్న ఆశతో పాటు, జేబులో జెండూబామ్ కూడా పెట్టుకొని వెళ్తే.. ఇంకా బాగుంటుంది.
రేటింగ్: 2/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
