ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం రాజన్-నాగేంద్రలో రాజన్ కన్నుమూత
on Oct 12, 2020
నిన్నటి తరం ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం రాజన్-నాగేంద్రలో పెద్దవారైన ఐరావతం రాజన్ ఆదివారం (అక్టోబర్ 11) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితమే అంటే 2000 సంవత్సరంలో నాగేంద్ర మృతి చెందారు. ఆ ఇద్దరూ అన్నదమ్ములు. నాలుగు దశాబ్దాలకు మించిన కెరీర్‌లో వారు 450 సినిమాల వరకు పనిచేసి, ఎన్నో మరపురాని పాటలను సంగీత ప్రియులకు అందించారు. వారి మాతృభాష తెలుగు అయినప్పటికీ కన్నడ చిత్రసీమలో స్థిరపడ్డారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, తుళు భాషా చిత్రాలకు ఎన్నింటికో వారు బాణీలు సమకూర్చారు. సింహళ భాషా చిత్రాలకు సైతం వారు పనిచేశారు.
గ్యాస్ట్రిక్ సమస్యతో తన తండ్రి మృతి చెందినట్లు రాజన్ కుమారుడు అనంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆదివారం గ్యాస్ సంబంధిత నొప్పితో బాధపడిన ఆయన, పడుకోవడానికి వెళ్లారనీ, ఆ నొప్పి ఎక్కువవడంతో ఆయన మృతి చెందినట్లు అనంత్ చెప్పారు.
రాజన్ 1932లో మైసూరులోని శివరాంపేటలో జన్మించారు. కన్నడ చిత్రం 'సౌభాగ్యలక్ష్మి'తో నాగేంద్రతో కలిసి సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు. 1957లో వచ్చిన 'వద్దంటే పెళ్లి' వారి తొలి తెలుగు చిత్రం. చివరి సారిగా పనిచేసిన తెలుగు చిత్రం 'అ ఆ ఇ ఈ' (1994). కన్నడంలో 370 సినిమాల దాకా పనిచేసిన వారు, 60 తెలుగు చిత్రాలకు బాణీలు సమకూర్చారు. 1978లో వచ్చిన 'పంతులమ్మ' చిత్రానికి అందించిన సంగీతంతో ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డు అందుకున్నారు.
వారు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించిన చిత్రాల్లో ఖైదీ కన్నయ్య, మదనకామరాజు కథ, అగ్గి పిడుగు, నవగ్రహ పూజా మహిమ, పూజ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, తాతయ్య ప్రేమలీలలు, అద్దాల మేడ, మంచు పల్లకీ, వయ్యారి భామలు వగలమారి భర్తలు, నాలుగు స్తంభాలాట, అమ్మాయి మనసు, మూడు ముళ్లు, పులి బెబ్బులి, రాజు రాణి జాకీ, రెండు రెళ్లు ఆరు, చూపులు కలిసిన శుభవేళ, ప్రేమఖైదీ, అప్పుల అప్పారావు వంటివి ఉన్నాయి.
తీయ తీయని తేనెల మాటలతో, ఏమో ఏమో ఇది, ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు?, ఎన్నెన్నో జన్మల బంధం, పూజలు సేయ పూలు తెచ్చాను, మానసవీణా మధుగీతం, ఎడారిలో కోయిలా, వీణ వేణువైన సరిగమ విన్నావా, మల్లెలు పూసే వెన్నెల కాసే, ఆకాశం నీ హద్దురా, అబ్బో నేరేడు పళ్లు అబ్బాయి కళ్లు, రాగంతీసే కోయిలా, నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది, మేఘమా మెరవకే ఈ క్షణం, చినుకులా రాలి నదులుగా సాగి, కాస్తందుకో దరఖాస్తందుకో వంటి రసగుళికల్లాంటి పాటలు వారందించిన స్వరాల నుంచి పుట్టాయి.
Also Read