మేము సైతం - హిట్టా ఫట్టా??
on Dec 1, 2014
తెలుగు చలన చిత్రసీమ ఎంతో వైభవంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం మేముసైతం. దాదాపు నెల రోజుల నుంచీ.. ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు సాగాయి. దాదాపు చిత్రసీమ మొత్తం స్పందించి.. మేమున్నాం అంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు రూ.15 కోట్ల రూపాయలు సేకరించి సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి అందించారు. అంతా బాగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం సవ్యంగా సాగిందా? ఆట పాటలు అలరించాయా? లేదంటే ఏదో మొక్కుబడి తంతుగా జరిగిందా?? ఇంతకీ మేము సైతం హిట్టా? ఫట్టా?? తెలుసుకొందాం.. రండి.
* వజ్రోత్సవాల తరవాత తెలుగు చిత్రసీమ మొత్తం ఏకమై చేసిన ఏకైక కార్యక్రమం ఇది. అయితే వజ్రోత్సవాలంత హైప్ ఈ కార్యక్రమానికి క్రియేట్ కాలేదన్నది వాస్తవం.
* వజ్రోత్సవాల సందర్భంగా ప్రిపేర్ చేసిన నాటికలు, స్కిట్స్, జోకులు, డాన్స్ పోగ్రామ్‌లూ ఆద్యంతం ఆకట్టుకొన్నాయి. ఇప్పటికీ మా టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం చేస్తే... రేటింగ్స్ విపరీతంగా ఉంటాయి. కానీ.. అంత దమ్ము, అన్ని నవ్వులు ఇక్కడ కనిపించలేదు. బహుశా సమయాభావం వల్ల కావచ్చు.
* లైవ్‌లో నటీనటులంతా అలరిస్తారని ఆశలు పెట్టుకొంటే.. రికార్డింగ్ పోగ్రామ్‌లతోనే సరిపెట్టుకొన్నారు. తెరపై ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చూడడం లేదూ. ఏదో ఆడియో ఫంక్షన్ చూసినట్టుంది తప్ప.... ఓ బృహత్తర కార్యక్రమానికి ప్రత్యక్ష్య సాక్షులుగా నిలిచిన అనుభూతి ఏమాత్రం ప్రేక్షకులకు కలగలేదు.
* బాహుబలి టీమ్ చేసిన వంట పోగ్రాం, మహేష్ ఇంటర్వ్యూ, శ్రియ డాన్సింగులూ ఇవన్నీ రికార్డెడ్ అంటే సరిపెట్టుకోవచ్చు. ఎమ్మెస్ నారాయణలాంటివాళ్లూ రికార్డింగ్‌కే మొగ్గు చూపడం ఏమాత్రం రుచించదు. దాదాపు 80 శాతం కార్యక్రమాలు రికార్డ్ చేసినవే.
* రాజమౌళి బ్యాచ్ కూడా ఎక్కడా కనిపించలేదు. ఓ రికార్డెడ్ పోగ్రాం పంపాం కదా.. అని లైట్ తీసుకొన్నారు వాళ్లంతా.
* కనీసం కృష్ణ, విజయ నిర్మల అయినా ఈ పోగ్రాంకి హాజరైతే బాగుంటుందని కొంతమంది బాహాటంగానే అనుకొన్నారు.
* బ్రహ్మానందం చెప్పినవన్నీ పాత జోకులే! అయితే బ్రహ్మీ చివర్లో చేసిన సోలో యాక్షన్ అందరి హృదయాలూ చమ్మగిల్లేలా చేసింది.
* ఈ కార్యక్రమంలోనూ కొన్ని ప్లస్సులు కనిపించాయి. మరీ ముఖ్యంగా బాలకృష్ణ అందరినీ అలరించాడు. తన ఆట పాటలతో మైమరపించాడు. బాలయ్య జోష్ చూసి అందరికీ ఊపొచ్చింది. వెంకటేష్ కూడా రెచ్చిపోయాడు. అంత్యాక్షరి కార్యక్రమంలో వెంకీదే హంగామా అంతా. చిరంజీవి కూడా స్టెప్పులేయడంతో క్లైమాక్స్ రక్తి కట్టింది.
* ఈ కార్యక్రమంలో తంబోలా కూడా ఉంటుందని ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. అందుకోసం రూ.15 వేల ఖరీదు గల టికెట్లు అమ్మారు. భారీ బహుమానాలు ఉంటాయని ఊరించారు. అయితే తంబోలా ఆట మాత్రం జరగలేదు. ఈ విషయంపై నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
* కొన్ని మైనస్సులు ఉన్నప్పటికీ ఉన్నంతలో గ్రాండ్ గానే నిర్వహించారంతా. 12 గంటలు పాటు ఏకధాటిగా వినోద కార్యక్రమాలు పంచడం అషామాషీ వ్యవహారం కాదు. అదీ తక్కువ టైమ్‌లో. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం కలగకుండా... దిగ్విజయంగానే ముగించారు. అంతేకాదు..
రూ.15 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. ప్రజలకు ఉపయోగపడిన ఈ కార్యక్రమంలో కొన్ని లోపాలున్నా పెద్ద మనసులో వాటిని మన్నించేయొచ్చు. నిర్వాహకులు నిరవధిక శ్రమకు, వారి.. కఠోర దీక్షకు జోహార్లు..!!