మహేష్, ప్రకాష్‌రాజ్ మధ్య పోటీ
on Sep 30, 2015
ఇవాళారేపు ఏదైనా ఊరిని దత్తత తీసుకున్న సెలబ్రిటీలని ముద్దుగా ‘శ్రీమంతుడు’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాని ఇలా ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తోనే తీసి హిట్టు కొట్టాడు. సెలబ్రిటీలు, బాగా డబ్బున్న శ్రీమంతులు ఊళ్ళను దత్తత తీసుకునే సంప్రదాయం ఎప్పటి నుంచో వుంది. మొన్నామధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అయినా ఆయన్ని అప్పుడెవరూ ‘శ్రీమంతుడు’ అని పిలవలేదు. కానీ, ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజైన తర్వాత ఊళ్ళని దత్తత తీసుకునే దత్తాత్రేయులందర్నీ శ్రీమంతుడు అని పిలవటం ఫ్యాషనైపోయింది.
‘శ్రీమంతుడు’ రిలీజై హిట్టయ్యాక వాళ్ళూ వీళ్ళూ ఐడియా ఇస్తేగానీ మహేష్‌బాబుకి తన సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. మహేష్ బాబు దత్తత స్వీకారోత్సవం అక్కడితో ఆగలేదు. అటు ఆంధ్రాలో వున్న ఊరిని దత్తత తీసుకున్న తర్వాత ఇటు తెలంగాణలో ఉన్న ఊరిని దత్తత తీసుకోకపోతే బాగోదు కదా... అందుకే తెలంగాణలో, మహబూబ్ నగర్ జిల్లాలో వున్న సిద్ధాపూర్‌ని కూడా దత్తత తీసేసుకున్నాడు. వెరైటీ ఏమిటంటే, నటుడు ప్రకాష్‌రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లె అనే ఊరు మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ పక్కనే వుంది. మహేష్‌బాబు, ప్రకాష్ రాజ్ వెండితెర మీద పోటాపోటీ నటన ప్రదర్శించిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి.
ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్కపక్కనే వున్న ఊళ్ళను దత్తత తీసుకున్నారు. ఆ ఊళ్ళను డెవలప్ చేసే విషయంలో కూడా ఈ అగ్రనటులు పోటీ పడతారని, ఆ ఊరు కంటే నా ఊరినే ఎక్కువ డెవలప్ చేయాలని భావిస్తారని, అందువల్ల తమ ఊళ్ళు రెండూ బాగుపడిపోతాయని ఆ రెండు ఊళ్ళ వాసులూ సంబరపడిపోతున్నారట. మొత్తమ్మీద మహేష్‌బాబు, ప్రకాష్‌రాజ్.. వీళ్ళిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో, ఎవరు నంబర్‌వన్ ‘శ్రీమంతుడు’ అవుతాడో వేచి చూద్దాం.