కథలు రాసుకుంటున్న కృష్ణ భగవాన్!
on Mar 5, 2021
ఎలాంటి హంగామా లేకుండా పంచ్ డైలాగ్స్ వేసి నవ్వించడంలో కృష్ణ భగవాన్‌కు ఉన్న టాలెంటే వేరు. ఆయన తెరమీద కనిపించాడంటే నవ్వులు గ్యారంటీ. కొంతమంది హావభావాలతో, రకరకాల బాడీ విన్యాసాలతో నవ్విస్తారు. వారికి భిన్నంగా డైలాగ్స్‌తో నవ్వించడం కృష్ణ భగవాన్ స్టైల్. అలాంటి ఆయన ఉన్నట్టుండి కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం మానేశారు. కారణం ఆయన ఎడమ కాలుకు సమస్య రావడం. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఇబ్బంది పడ్డారు. దాంతో సహజంగానే ఆయనకు వేషాలు ఇవ్వడానికి దర్శకులు, నిర్మాతలు వెనుకాడారు.
అయితే తనకు వేషాలు రావట్లేదని బాధపడుకుండా ఆయన ఓ వ్యాపకం పెట్టుకున్నారు. మంచి మంచి పుస్తకాలు చదువుతున్నారు. అలాగే సినిమా స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన వంశీ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన విషయం ఇక్కడ గమనార్హం. 'ఏప్రిల్ 1 విడుదల' స్క్రిప్టు ఆయనదే. ఇప్పటికే రెండు సబ్జెక్టులు రెడీ చేశారు. ఒకదాని పేరు 'ఆలీ మంచోడే కానీ..' అయితే, ఇంకో దాని పేరు 'భాస్కర్ మంచి బ్యాట్స్‌మన్'.
ఆయనకు డైరెక్టర్ కావాలనే కోరిక కూడా ఉంది. అవకాశం వస్తే, తను రెడీ చేసుకున్న స్క్రిప్టులతో డైరెక్టర్ కావాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. చూద్దాం.. ఆయనకు ఏ నిర్మాతైనా చాన్స్ ఇస్తారేమో!