రాజమౌళి మహాభారతంలో నేను ఉంటా.!
on Sep 19, 2017
బాబీ దర్శకత్వంలో జైలవకుశ చిత్రం ద్వారా కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా సినిమా గురించి..జైలవకుశ అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు. రేపు ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా విశేషాలు మీకోసం.
17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నటునిగా ఎలా వుంది?
ఇష్టమైన పనికదండీ.. చాలా బావుంది
ఇందులో మూడు పాత్రలు చేశారు కదా. మూడు సినిమాలు చేసినట్లుందా?
వంద సినిమాలు చేసినట్లుంది(నవ్వుతూ). కష్టంలోనే ఆనందం ఉంటుంది. చివరకు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే సంతృప్తిగా ఉంటుంది.
బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైనట్టున్నారు?
అవునండీ... అంతకు ముందు నేను ఓ నటుడ్ని మాత్రమే. ఇప్పుడు ప్రతి ఇంట్లో సభ్యుడ్నయ్యాను. ఈ ఫీలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా.
ఫ్యూచర్ లో చేస్తారా?
చెప్పలేం అండీ. 24న ఫైనల్. అది అయిపోయిన తర్వాత సెకండ్ సీజన్ గురించి ఆలోచిస్తా. ‘బిగ్ బాస్’ నేను ఛాలెంజ్ గా తీసుకొని చేసిన షో. జనాలు చూస్తారో చూడరో అనే భయం మొదట్లో ఉండేది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ గ్రాండ్ సక్సెస్. కొత్త దనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘బిగ్ బాస్’తో మరోసారి రుజువైంది.
‘జై లవకుశ’లో మూడు పాత్రలు చేశారు కదా. ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
హోమ్ వర్క్ అంటే అండీ... అంతకు ముందు నేను చేసిన పాత్రలనే రిఫరెన్స్ గా తీసుకొని వీటిల్లో రెండు పాత్రలు చేసేశా. ‘లవ’ కేరక్టర్ కి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో చేసిన పాత్రలను రిఫరెన్స్ పాయింట్ గా తీసుకున్నా. ‘కుశ’ పాత్రకు నా ‘యమదొంగ’లో పాత్రే రిఫరెన్స్. ‘జై’ పాత్రకు మాత్రం ఎక్కడా రిఫరెన్స్ దొరకలేదు. దాంతో రీసెర్చ్ చేయాల్సొచ్చింది. రావణాసురుడ్ని ఆరాధించే పాత్ర ‘జై’ది. మనం ఎవర్ని ఎక్కువగా ఇష్టపడతామో... వాళ్ల ప్రభావం మనపై ఉంటుంది. అలా రావణుడి ప్రభావం ‘జై’మీద ఉండాలి.
నిలిచునే విధానంలో, ఆహార్యంలో రావణుడు గుర్తుకు రావాలి. రావణుడు 18 లోకాలకు రారాజు. మరి అంతటి మనిషిలో ఇగో ఏ స్థాయిలో ఉంటుంది? అది చూపించాలి. నవ్వులో కూడా అంతుచిక్కని భావం పలకాలి. ఎదుటి మనిషిని కళ్లతోనే స్కాన్ చేస్తుంటాడు రావణుడు. అలా తీక్షణంగా చేసీ చేసీ కళ్లు చిన్నవిగా అయిపోయుంటాయ్ కదా. అందుకే నేను కూడా కళ్లు చిన్నవి చేసి నటించా. లక్షలాదిమందిని శాసించే రావణుడి కంఠం కొంచెం కఠినంగా బొంగురుపోయి ఉంటుంది కదా! అనుకొని వాయిస్ ని కూడా బోల్డ్ గా ఉండేలా చూసుకున్నా. మిగిలిన రెండు పాత్రలతో పోలిస్తే...‘జై’ పాత్రను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశా.
మీ తాతగారు కూడా రావణుని పాత్ర విషయంలో ఇంత ఆలోచించలేదండీ!
ఆయన చేశారు కాబట్టే ఇంత ఆలోచించాల్సొచ్చిందండీ. ఆయన రావణ పాత్రకు ఓ పారామీటర్ పెట్టారు. దాని దరిదాపులకు కూడా మనం వెళ్లలేం. అదృష్టవశత్తూ మనకు ఆ గెటప్ లేదు. లేకపోతే ఇంకా కష్టమయ్యేది. అసలైనా... తాతగారు అంత ఆలోచించాల్సిన అవసరం లేదండీ. ఆయన నవ్వు చాలు.. అవతలవాళ్లకు తడిసిపోడానికి.
ఇంత హోమ్ వర్క్ చేశారు మరి నత్తి ఎందుకు పెట్టారు?
అది బాబీ ఆలోచనండీ. ఇంత భయంకరంగా ఇంతమందిని శాసించేవాడికి నత్తి ఉంటే ఎలా ఉంటుంది? అనేది బాబీ ఆలోచన. వాడు నత్తిగా మాట్లాడుతుంటే నవ్వవాడనికి కూడా భయపడాలి. ఇంకా మాట్లాడితే... నత్తి వచ్చినప్పుడు ఇంకా భయపడాలి. అలా సెట్ చేశాడు ఆ పాత్రను.
ఫ్యూచర్లో ఇలా యాంటీ హీరోగా చేయమంటే చేస్తారా?
నేను నటుడ్నండీ. ఏ పాత్ర అయినా చేయాలి. కెరీర్ పూర్తయ్యే లోపు సాధ్యమైనంతవరకూ ఎక్కువ పాత్రల్లో నటించాలి. అదే నా లక్ష్యం.
ముగ్గురిలో డాన్స్ ఎవరు బాగా చేస్తారు?
లవ, కుశ.. ఇద్దరూ మంచి డాన్సర్లేనండీ. అయితే.. ‘జై’ డాన్స్ చేయడు. తాండవం చేస్తాడు(నవ్వుతూ)
మీ ‘తాతగారి అన్నదమ్ముల అనుబంధం’ సినిమాకీ.. దీనికీ ఏమైనా పోలిక ఉంటుందా?
అన్నదమ్ముల కథంలే ఎక్కడో ఒక చోట పోలిక రావడం సహజమే. అంతేతప్ప.. ఈ కథకూ ఆ కథకూ అసలు సంబంధమే ఉండదు.
‘జై లవకుశ’లో అన్నదమ్ముల అనుబంధాలను చూపిస్తారా? విరోధాలను చూపిస్తారా?
అనుబంధాలంటే.. అన్నీ ఉంటాయండీ.. విభేధాలు... విచారాలు... విరహాలు.. సరదాలు.. అన్నీ ఉంటాయ్.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ఏం చెబుతారు?
దేవిశ్రీ మ్యూజిక్ గురించి ఏం మాట్లాడతామండీ... అతను సినిమా సినిమాకూ సంగీత దర్శకునిగా తనకు తాను నిరూపించుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఈ సినిమా ప్రతి పాట నిజంగా అద్భుతమే కదండీ. ముఖ్యంగా రీ-రికార్డింగ్ అయితే... సినిమా హార్ట్ అనాలి.
తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు? మీ తాతగారు చేసిన సినిమాలు ఏమైనా చూశారా? పాత్రకూ పాత్రకూ మధ్య తేడా చూపించే విషయంలో ఆయన పాత్రల్ని ప్రేరణగా ఏమైనా తీసుకున్నారా?
తాతగారి పాత్రలు నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటాయ్. వాటిని ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. వాటిని ప్రేరణగా తీసుకొని నా శైలిలో నేను చేశాను. ఆయన సినిమాలు లెక్కలేనన్ని చూశాను. ఆయన ప్రభావం ఉంటుంది కదా. అయితే.. ప్రత్యేకించి ఏమీ రిఫరెన్స్ గా తీసుకోలేదు.
ఇప్పుడున్న యువ హీరోల్లో పౌరాణికాలు చేసే సత్తా ఉన్న నటుడు మీరు. మీ నుంచి అలాంటి ఆశించొచ్చా?
తప్పకుండా అండీ. అయితే... హ్యాండిల్ చేసేవారెవరండీ?
మీ ఫ్రెండ్ ఉన్నాడుగా రాజమౌళి?
ఆయన కూడా రెడీగా ఉండాలి కదండీ. మొన్న ఎవరో అడిగారు.. ‘రాజమౌళి ‘మహాభారతం’లో మీరు ఉంటారా?’ అని. ఎందుకుండను.. తప్పకుండా ఉంటాను.
వేషం మీరే అడుగుతారా?
అడిగితే చేస్తా. నేనడగను.
ఒక వేళ అడిగితే ఏ పాత్ర చేస్తారు?
ఏ పాత్ర ఇవ్వాలో రాజమౌళికి తెలుసు కదండీ.(నవ్వుతూ).. అయితే.. పౌరాణిక చిత్రాలు రావాలి. ఈ జనరేషన్ కు కూడా ఆ కథలు తెలియాలి.
రాజమౌళితో మీ సినిమా విషయంలో బయట చాలా వార్తలు వినిపిస్తున్నాయ్..?
వాటిల్లో నిజం లేదండీ. మేం చేస్తాం. ‘ఎప్పుడు చేస్తాం?‘ అనేది జక్కన ఇష్టం. నాకు తగ్గ పాత్ర అనుకున్నప్పుడు తనే కబురు చేస్తాడు. రాజమౌళీ ప్రతి వేదిక మీదా.. ఎన్టీయార్ అంటే నాకిష్టం అంటుంటారు. నాక్కూడా జక్కన్నంటే ఇష్టమండీ(నవ్వుతూ). మేం ముందు మంచి ఫ్రెండ్స్ అంటే.
అన్నయ్య సినిమా కదా. స్సెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా?
స్పెషల్ కేర్ కంటే... స్పెషల్ ప్రజర్ మాత్రం ఉందండీ. ఎందుకంటే.. మా హోమ్ బ్యానరే అవ్వడం వల్ల.. ముందు హీరో, నిర్మాత అనే ట్యాగ్ ని తీసేశాం. ఒక్కోసారి నేను కూడా డెసిషన్లు తీసుకున్నాను. ఇది మా ఇంటి సినిమా. అందుకే.. ప్రజర్ ఎక్కువ అనుభవించా. మేం విజయం సాధిస్తే.. ఆనందించేది తల్లిదండ్రులు. ఆ తర్వాత అభిమానులు. వారందికీ నచ్చేలా ఉంటుంది సినిమా.
మీ నాన్న హరికృష్ణకు సినిమా చూపించారా?
లేదండీ. మా కుటుంబం మొత్తం సినిమా రిలీజైన రోజే చూస్తామండీ.
మీ బాబాయ్, మీ తమ్ముడు మోక్షజ్ఙ సినిమా చూసి మిమ్మల్ని మెచ్చుకున్నట్లు వార్తలొచ్చాయ్?
అంతా అబద్ధం అండీ. సోషల్ మీడియాలో నిమిషానికో న్యూస్ వస్తుంటుంది. వాటిని నమ్మక్కర్లేదు.
మీ తాతగారి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు?
ఆయన పాత్రల్ని మనం టచ్ చేయకూడదండీ.
మీరు దానవీరశూర కర్ణ చేస్తే బావుంటుందని మా అభిప్రాయం?
ఊరుకోండి. ఆ పేరెత్తితేనే భయం వేస్తుంది.
మహానటి సావిత్రి బయోపిక్ లో తాతగారి పాత్ర మీరే చేస్తున్నరటగా?
నన్నడగలేదండీ... ఆ టాపిక్ ఇప్పుడొద్దులేండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
