వాళ్లతోనే.. ‘నా’ పోటీ!
on Sep 19, 2017
‘తాత సొత్తుపై హక్కు మనవడిదే...’ అనేట్టు ఉండేవాడు ఒకప్పుడు తారక్. కొన్ని సినిమాల్లో ఈ డైలాగును వాడాడు కూడా. ఈ మాటలో ఎంత గూఢార్థం ఉందో అందరికీ తెలుసు. మహానటుడు ఎన్టీయార్ సినీ రంగంలో ఉన్నంతవరకూ ఎదురులేని సూపర్ స్టార్. దాదాపు 35 ఏళ్లు పాటు ‘నంబర్ వన్’ పీఠం ఆయనదే. సో... ‘మనవడ్ని వచ్చాను కాబట్టి... ఇప్పుడు నాది’ అని దానర్థం.
తారక్ సైలెంట్ గా హీరో అయినా... స్టార్ అయ్యాక నంబర్ వన్ స్థానంపైనే తన దృష్టంతా ఉండేది. అప్పట్లో నంబర్ వన్ గా చిరంజీవి ఉన్నా కూడా... ‘తాత సొత్తుపై హక్కు మనవడిదే’ అనే ధోరణిలో ప్రవర్తించి పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు తారక్. అదంతా కుర్రతనపు చేష్టలనుకోవచ్చు.
ఇప్పుడైతే.. మనోడు ఫుల్ మెచ్యుర్డ్ పర్సన్. పెళ్లయి, తండ్రి అయ్యాక అతని ఆలోచనా ధోరణి కూడా మారింది. తాను ఎదుగుతూ... సాటి నటీనటులను గౌరవిస్తూ... ఒద్దికగా ముందుకెళ్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయనుకున్నారూ! ‘పోటీ అనేది ఉండాలి. అయితే... అది ఆరోగ్యంగా ఉండాలి. ఒకప్పుడు ఒకేరోజు అరడజను సినిమాలొచ్చేవి. అన్నీ బాగా ఆడేవి. అది మంచి పోటీ అంటే. అలా జరిగితే... సినిమా నమ్ముకొని బ్రతుకుతున్న చాలామంది బాగుపడతారు. ‘జై లవకుశ’తో పాటు వారం గ్యాప్ తో వస్తున్న ‘స్పైడర్’కూడా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే... 29న వస్తున్న ‘మహానుభావుడు’ కూడా బాగా ఆడాలి’ అని చెప్పుకొచ్చాడు తారక్.
ఇంకా చెబుతూ ‘సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ విడుదలైంది. చిరంజీవిగారి కెరర్ లోనే పెద్ద హిట్. అలాగే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’..మా బాబాయ్ కెరీర్ లోనే పెద్ద హిట్. వారిద్దరి మధ్య శర్వానంద్ ‘శతమానం భవతి’ విడుదలైంది. అది కూడా సూపర్ హిట్. అదే ఫీట్ ఇప్పుడూ రిపీట్ అవుతుందని నా నమ్మకం. నా కెరీర్ లోనే ‘జై లవకుశ’ పెద్ద హిట్ అవ్వాలి. మహేశ్ కెరీర్ లోనే ‘స్పైడర్’ నంబర్ వన్ మూవీ అనిపించుకోవాలి. శర్వానంద్ సంక్రాంతి ఫీట్ ని రిపీట్ చేయాలి. నేను కోరుకునేది అదే’ అన్నాడు తారక్.
అర్రెర్రెర్రె... బుడ్డ ఎన్టీయార్ లో ఎన్ని మార్పులు. అదే ఒకనాటి తారక్ అయితే... ‘మా రక్తం.. మా సత్తా’ అని రెచ్చిపోయేవాడు. కానీ... ఇప్పుడు! అదేదో సినిమాలో తారక్కే అంటాడులేండీ... ‘జీవితం... ఎవడి సరదా వాడికి తీర్చేస్తది’ అని. అంటే ఇదేనేమో!