English | Telugu

పూజ ఏ బిందె నడుం మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్‌గా పంపిస్తావా?

on Sep 18, 2019

 

రాఘవేంద్రరావు: "నాదొక చిన్న కోరిక. పూజా నువ్విస్తావా? హరీశ్ నువ్వు చెప్పు.. పూజ ఏ బిందె నడుం మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్‌గా ఇచ్చి పంపిస్తావా?"

హరీశ్ శంకర్: "పూజని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపించింది?"

రాఘవేంద్రరావు: "అనుమానం లేకుండా చెర్రీ అయితే బాగుంటుంది."

.. ఈ సంభాషణ 'వాల్మీకి' మూవీ 'ఎల్లువొచ్చి గోదారమ్మా' వీడియో ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'దేవత' సినిమాలో శోభన్‌బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన 'ఎల్లువొచ్చి గోదారమ్మా వెల్లాకిల్లా పడ్డాదమ్మో' పాట ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పటికీ ఆ పాట ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. వెయ్యి బిందెలతో ఆ పాటను రాఘవేంద్రరావు చిత్రీకరించారు. అదే పాటను 'వాల్మీకి'లో వరుణ్‌తేజ్, పూజా హెగ్డే జంటపై డైరెక్టర్ హరీశ్ శంకర్ చిత్రీకరించాడు. ఆ ఐకానిక్ సాంగ్‌కు నీరాజనంగా ఆయన కూడా బిందెలతోటే ఈ పాటను తియ్యడం గమనార్హం. ఈ పాటకు మిక్కే జె. మేయర్ స్వరాలు సమకూర్చాడు.

ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ పాట వీడియో ప్రోమోను రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఆ పాటను తిలకించిన తర్వాత ఆయన మాట్లాడారు. "ముందుగా ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్ఠలు రావడానికి కారణమైన 'దేవత' నిర్మాత రామానాయుడుగారు, గేయరచయిత వేటూరి సుందరరామ్మూర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తిగార్లను తలుచుకుంటున్నాను. ఈ సినిమా యూనిట్‌ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే మళ్లీ నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాట తీసేముందు లొకేషన్స్‌ చూడటానికి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఉండ్రాజవరం అనే ఊళ్లో మా ఫ్రెండ్‌ డాబా మీద మడత మంచం మీద పడుకొని ఈ పాట ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఊరంతా ఠంగ్‌ ఠంగ్‌మని సౌండ్స్‌ వస్తున్నాయి. 'ఏమిటా సౌండ్‌?' అని అడిగితే.. 'ఇక్కడ బిందెలు తయారు చేస్తారు?' అని చెప్పారు. వెంటనే 'చాలా బిందెలుంటాయా?' అని అడిగాను. ప్రొడ్యూసర్స్‌ బాగుండాలని 'బిందెలు కొనే బదులు అద్దెకి ఇస్తారేమో అడుగు'.. అన్నాను. వారు ఒప్పుకొని పాట షూట్‌ చేసేటప్పటికి 1000 బిందెలు రెడీ చేసి ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ రాస్తూ ఒక విలేకరి 'సినిమా అంతా బావుంది కానీ.. పాట వచ్చేటప్పటికి 1000 బిందెలు ఎట్లా వస్తాయో దర్శకుడికే తెలియాలి' అని రాశారు. తర్వాత నేనతన్ని కలిసినప్పుడు.. 'నువ్వుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ ఎవర్నైనా లవ్‌ చేశారా?' అనడిగితే.. 'మా ఫ్రెండ్స్ చేశారండీ' అన్నాడు. 'వాళ్లెప్పుడైనా డ్యూయెట్‌ పాడటం చూశావా? డ్యూయెట్‌ ఒప్పుకుంటే.. బిందెలు కూడా ఒప్పుకోవాలి' అన్నాను. పాట అనేది ప్రేక్షకుల కళ్లకి, చెవులకి ఆనందం కలిగించేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిక్కీ పాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. 'గోపికమ్మా' దగ్గర నుండి నాకు ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. పూజాని చూసినరోజే 'ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌' అవుతుంది అన్నాను. వరుణ్‌ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రొడ్యూసర్స్‌తో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈవిధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. 'దేవత' సినిమా 25 వారాలు ఆడినట్టు 'వాల్మీకి' సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి" అన్నారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here