ఆర్జీవీ 'ఐస్ క్రీమ్' మేకింగ్ కాస్ట్ ఎంతో తెలిస్తే.. షాకే!
on Dec 2, 2020
రామ్‌గోపాల్ వర్మ ఆరేళ్ల క్రితం 'ఐస్ క్రీమ్' అనే మూవీ తీశారు.. గుర్తుందా? ఆ మూవీని రూపొందించడానికి ఆయనకు అయిన ఖర్చు అక్షరాలా 2 లక్షల 12 వేల రూపాయల లోపే! అవును. ఈ విషయం ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇందులో రెండే రెండు ప్రధాన పాత్రలు.. నవదీప్, తేజస్వి. వీళ్లిద్దరికీ పారితోషికాలు కాకుండా, సినిమాలో వాటా ఇస్తామని చెప్పారు. అంటే విడుదల తర్వాత లాభాలను బట్టి వాళ్ల డబ్బులు వాళ్లకు పర్ఫెక్ట్గా అందాయన్న మాట.
ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటూ ఎవరూ లేరు. సీన్‌కి తగ్గట్టు వాళ్ల కాస్ట్యూమ్స్ వాళ్లే వేసుకొచ్చేశారు. అలాగే మేకప్మెన్లు లేరు. ఏవైనా టచప్‌లు ఉంటే వాళ్లే చేసుకున్నారు. షూటింగ్‌కి వాళ్ల కారులోనే వచ్చారు. బ్రేక్ ఫాస్ట్ ఎవరింట్లో వాళ్లు చేసి రావడమే. లంచ్ ఎవరికి నచ్చింది వాళ్లు ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే. సెట్లో కాఫీ, టీలు మాత్రమే ఇచ్చారు.
సినిమా షూటింగ్నంతా వర్మ ఒక్క బిల్డింగ్‌లోనే చేశారు. ఆ బిల్డింగ్ రెంట్ రోజుకి రూ. 30 వేలు. 7 రోజుల షూటింగ్‌కి 2 లక్షల 10 వేల రూపాయలు అయ్యింది. కాఫీ, టీలకు 1, 832 రూపాయలు ఖర్చు అయ్యింది. అంటే మొత్తం 2 లక్షల 11 వేల 832 రూపాయలు ఖర్చయినట్టు. ఇదీ ఐస్ క్రీమ్ మేకింగ్ కాస్ట్! ఈ యూనిట్ మొత్తం 8 మంది మాత్రమే. రామ్‌గోపాల్ వర్మ, నలుగురు కెమేరా ఆపరేటర్లు, ఒక అసిస్టెంట్ డెరైక్టర్, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ అసిస్టెంట్. క్లైమాక్స్‌కి మాత్రం ఇంకొంతమంది పెరిగారు.