'మా' ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
on Mar 28, 2015
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో నెలకొన్స సస్పెన్స్‌కు తెరపడింది. మా అధ్యక్ష ఎన్నికలు యధాతథంగా నిర్వహించుకోవచ్చునని శుక్రవారం సాయంత్రం సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆదివారం (29వ తేదీన) మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్నరాజేంద్రప్రసాద్ ప్యానల్‌కు చెందిన కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై శుక్రవారం కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికలు నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. ఫీజులు విపరీతంగా పెంచారని వైస్ ప్రెసిడెంట్‌కు రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంచారని, అధ్యక్షుడుగా పోటీ చేసేవారికి రూ. 10 వేలుకు పెంచారని… ఇది మా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వారి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే మురళీమోహన్, ఆలీ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు. వారి ప్యానల్ తరపున ఇతర పదవులకు బరిలో నిలిపారు.