ENGLISH | TELUGU  

మెగా స్పెషల్ స్టొరీ: ''మెగా దగా'' పార్ట్ -2

on Sep 30, 2015

మెగా కుటుంబం గత సంవత్సరం నుండీ ఇదోగో అదిగో అంటూ చిరంజీవి 150వ సినిమా గురించి, ప్రేక్షకుల్ని ఊరిస్తూ వస్తోంది. కానీ ఏ స్టెప్ తీసుకోడానికయినా భయంగానే ఉంది వాళ్ళకి. మొన్న ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి మాట్లాడుతూ" 150 వ సినిమా గురించి తనకు భయంగానే ఉందన్న విషయాన్నిచెప్పడం గమహర్షం.( తను మనసులో ముందుగానే నిర్దేశించేసుకున్న భారీ విజయాన్ని అందుకోలేకపోతామేమోనన్న భయం ఇది. ఇదొక అత్యాశ మరియు దురాశ కూడా! ) చిరంజీవి నిజవ్యక్తిత్వం ప్రజలకు సరిగా తెలియని దశలో, ఆయన వెండితెరపై చెప్పిన మహా డైలాగులకు చప్పట్లు కొట్టాం. అయితే రాజకీయ చరిత్ర ద్వారా చాలా వరకూ ఆయనలోని నిజవర్తన బట్టబయలయింది. ఈ పరిస్థితుల్లో దేనికయినా చప్పట్లుకొట్టే పరిస్థితుల్లో ప్రేక్షకులు లేరు. ఇకపోతే మరో విషయం! తన కొడుకులూ, మనవలూ హీరోలుగా చేస్తున్న తరుణంలో కూడా 'వారికంటే నేనే గొప్పవాణ్ణి, వారికి ఫ్లాట్ ఫార౦ ఏర్పరిచిందే నేను' అంటూ మనవరాలి వయసు అమ్మాయిలతో పిచ్చిగెంతులు వేస్తానని, వందమంది విలన్లను ఒక గుద్దుతో చంపేస్తానని చెప్పే వెకిలితనం నుండి, పాత (ముసలి) హీరోలు బయటపడితే మంచిది. ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు పెడుతూ రెచ్చిపోయి, థియేటర్లను అదరగొట్టేలా తన సినిమా ఉండితీరాలనే తపన, చిరంజీవికి మరీ ఎక్కువైపోయింది. ఇంత వయస్సు వచ్చిన తర్వాత కూడా ఇంతగా ఇలాంటి పిచ్చివుండడం విచారకరం. వయసుకు తగ్గ బాధ్యతగల ఉదాత్తపాత్రలో నటించాలనే సద్ద్భుద్ది ఆయనకు కలగాలి. శరీరానికి బలం రావడం కోసం ఒక వంద విటమిన్ టానిక్కులు కలుపుకుని తాగేశాడట వెనకటికెవడో!. అలావుంది చిరంజీవి పరిస్థితి చూస్తే!! ఇక్కడ ఆయన మరో విషయం కూడా గ్రహించగలగాలి. 150వ సినిమా అంటే అదేదో మనకోసం తంటాలు పడితీస్తున్న సినిమాగా తను అనుకోకూడదు. ఆ సినిమా మనల్ని ఉద్దరించడానికేమి కాదు. తన కోసం, తన మనుగడ కోసం ఆయన చేసుకుంటున్న ప్రయత్నం మాత్రమే ఇది.! అత్తవారింట్లో ( అంటే...రాజకీయాల్లో) ఛీ కొట్టించుకుని, పుట్టింటికి ( అంటే..సినీ రంగానికి) వస్తున్న అమ్మాయి పాత్రలో వున్నారు చిరంజీవి గారు. అదీ సంగతి!!

ఇక ఆయన షష్ఠిపూర్తి ప్రహసనం! ఈ సంవత్సరం ఆగస్ట్ 22వ తేదికి చిరంజీవికి 60సంవత్సరాలు నిండుతున్నాయని అందరికీ తెలిసిందే! అయితే ఆ తేదిన  షష్ఠిపూర్తి మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తామని, అంతకు ముందు మెగా ఫ్యామిలీ మరియు అభిమానులు ప్రకటించడం జరిగింది. అయితే సమయం దగ్గరపడే కొలదీ 'షష్ఠిపూర్తి' అనే పదాన్ని బ్యాన్ చేసి, 'సెలబ్రేషన్ 60' అనే పదాన్ని ప్రయోగించింది ఫ్యామిలీ. ఆ సందర్భంగా ఎవరి నోటివెంటా కూడా  'షష్ఠిపూర్తి' అనే పదం రాకుండా( టీవి ఛానల్స్ లోనూ, ఇతర వేడుకల్లోనూ కూడా) జాగ్రత్త పడింది ఫ్యామిలీ. షష్ఠిపూర్తి అనేపదం ప్రజల నోళ్ళలో పడితే, రాబోయే 150వ సినిమాలోని గ్లామర్ భావనకు ఇబ్బంది కలగవచ్చని వారు భావించారు. సరే...అది వారి స్వంత విషయం అనుకోండి. సినీ రంగ పునఃప్రవేశానికి ఒక మంచి అవకాశంగా ఈ 'సెలబ్రేషన్ 60' ని బాగా ఊపయోగించుకున్నాడు చిరంజీవి. డబ్బులు వీపరీతంగా ఖర్చు చేసి వేడుకలు, టీవి ఛానెల్స్ లో వివిధ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించుకున్నాడు. టీవి ప్రోగ్రామ్స్ లో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే...ఏ ఇంటర్వ్యూలోనూ కూడా ప్రజారాజ్యం గురించి గానీ, జనసేన గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ, రాష్ట్రవిభజన గురించి గానీ....మొత్తం మీద ఎలాంటి రాజకీయ అంశం కూడా రాకుండా ముందుగానే జాగ్రతలు తీసుకున్నాడు చిరంజీవి. తన రాబోయే సినిమా ఫోకస్ కు అనుగుణంగా అన్నీ జాగ్రత్తగా నడిపించుకుని, ప్రజల దృష్టిని కాస్త మార్చగలిగాడు. మొత్తం మీద ఎన్ని పథకాలు వేసినా, ప్రస్తుత సినీరంగ పరిస్థితి కొరకరాని కోయ్యగానే ఉంది. ఆయనకు!

'బాహుబలి' వంటి సూపర్ బ్లాక్ బ్లాస్టర్ రావడంతో , చిరంజీవి పరిస్థితి మరీ కష్టంగా మారింది. బహుబలిని మించి పోయేలా ఉంటేనే చిరంజీవి 150వ సినిమా అభిమానులను తృప్తిపరచగలదంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం, చిరంజీవి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. 150వ సినిమాగా పూరీ జగన్నాథ్ 'ఆటో జానీ'ని క్యాన్సల్ చేసేశాడు. పెద్ద డైరెక్టర్ల నుండి పిల్ల డైరెక్టర్ల వరకూ అందరికీ ఓపెన్ ఆఫర్ అంటూ ''బాబూ! ఓ మంచి కథ చూడండీ" అంటూ అడుగుతుండడం ఆయన అయోమయావస్థను సూచిస్తోంది. ఇన్నాళ్ళూ తానే కింగ్ అనుకున్న సినీరంగంలో భారీ క్రెడిట్ ను బాహుబలి కొట్టేయడంతో, దాన్ని దాటించే ఆలోచనలతో చిరంజీవి, రామ్ చరణ్ లు వున్నట్లుగా ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇందుకోసం ఏనాడో చిరంజీవితో కాస్త చిత్రీకరించి వదిలేసినా ఓ హాలీవుడ్ చిత్రాన్ని బయటకు తీసి పూర్తి చేస్తే ఎలా వుంటుందని రామ్ చరణ్ ఆలోచించాడని కూడా వార్తలొచ్చాయి. ఎవరినో మించి పోదాం, ఓడించేద్దాం అనే ఆలోచనలు కట్టిపెట్టి ...నేలపై నిలబడి నిదానంగా ఆలోచిస్తే, ఎవరికైనా మంచిది. పోటీతత్వం ఉండవచ్చు. అది ఆరోగ్యకర స్థాయిలో ఉండడం ఉత్తమం.

నేటి పరిస్థితుల్లో సోలో హీరోగా 150వ సినిమా చేయడం బహుకష్టం అని చిరంజీవికి అర్ధమైపోయింది. అందుకే మెగా ఫ్యామిలీతో మల్టీ స్టారర్ కూడా పాలన్ చేయడానికి చూసారు. ఈలోగా కాస్త హడావుడి చేసో ఓ రకం ట్రెండ్ సృష్టించుకోవడానికి, రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా బ్రూస్ లీ లో అతిథి పాత్రలో చిరంజీవి ప్రవేశిస్తున్నాడు. డైరెక్ట్ గా వస్తే కష్టం కనుక, ఈ విధమైన ఎంట్రీ నిర్ణయించుకున్నారు. చివరికి  దీన్నే 150 వ సినిమాగా చూసుకోమని చెప్పేసే ఆలోచన కూడా మెగా ఫ్యామిలీకి వుంది. ఎందుకంటే 'బ్రూస్ లీ' మినిమం గ్యారంటీ హిట్ కొట్టగాలదనే నమ్మకమైన వుంది వారికి. దీన్ని కాదనుకొని మరో 150వ సినిమా అంటూ తీసి వదిలితే అదిగాని తుస్సుమంటే...పరువు పోతుందని భయపడుతున్నారు. ఈలోగా ఈ మధ్య చిరంజీవి దృష్టి తమిళ హిట్స్ మీదకు మళ్ళింది. ఆ మధ్య హిట్ అయిన విజయ్ తమిళ సినిమా 'కత్తి'ని కాస్త అలా ఇలా మార్చి రీమేక్ చేసేస్తే , ఎలా వుంటుందని ఆలోచిస్తూ మల్లగుల్లలు పడుతోంది మెగా ఫ్యామిలీ. ఇంకా ఇలా ఎన్ని తిప్పలు పడతారో (మనల్ని పెడతారో) ఆ భగవంతునికే ఎరుక!

మొత్తం మీద ఎదిఎమైనా..అంతులేని ఆత్రం పడకుండా, పిచ్చి పిచ్చి ఇమేజ్ ల కోసం కలలు కనకుండా, ఎగబడకుండా, వయస్సుకు తగ్గ మనసుతో ఆలోచిస్తూ పదికాలాలు గుర్తుండే పదిలమైన పాత్రల్ని పోషిస్తూ, నిజ జీవితాన కూడా నిస్వార్ధ ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని గడపడం చిరంజీవికి శ్రేయోదాయకం.

చివరిగా ఓ మాట! చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే ..మనకు ఊహల్లోనైనా ఓ మెగాస్టార్ మిగిలి వుండేవాడు. అయితే ఆ అదృష్టం చిరంజీవికి లేదు. 'మెగాస్టార్' అంటూ పొగిడిన ప్రజానీకం, ఆయన్ని ' దగాస్టార్! ' అంటూ నిరసించింది. ఎంతయినా బుద్దీ కర్మాను సారణీ!' అన్నారు కాదా !! ఎవరి రాతకు ఎవరు కర్తలు...? ఏ నాటికైనా ప్రజలు క్షమించినా, చరిత్ర మాత్రం ఎన్నడూ చిరంజీవిని క్షమించబోదు. ఇది అక్షర సత్యం!!

........పోలిశెట్టి వేణు గోపాల రావు


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.