థియేటర్లను తెరచి మళ్లీ మూసేసిన చైనా
on Mar 28, 2020
రెండు వారాలుగా చైనాలో వందలాది థియేటర్లు తెరుచుకుంటూ వచ్చాయి. అయితే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ తిరగబెడితే పరిస్థితి మరింత జటిలమవుతుందని ప్రభుత్వం భయపడుతున్నట్లు అంతర్గత వర్గాలు నమ్ముతున్నాయి. క్రమక్రమంగా ఆ దేశంలోని సినిమా హాళ్లను తెరుస్తూ రావాలనే ఆలోచనకు అక్కడి సినిమా పెద్దలు బ్రేకులు వేశారు. గడచిన వారం రోజులుగా చైనా వ్యాప్తంగా 600 సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడానికి అనుమతులు లభించాయి. కానీ శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక తెరుచుకున్న థియేటర్లను అన్నింటినీ మూసివేయాలని బీజింగ్‌లోని 'ఫిల్మ్ బ్యూరో' నోటీసులు జారీ చేసింది.
అయితే మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెంటనే షట్డౌన్కు ఎందుకు నోటీసులు జారీ చేశారనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరణను ఫిల్మ్ బ్యూరో ఇవ్వలేదు. కరోనా వైరస్ తిరగబెడుతుందనే భయంతోనే ప్రభుత్వ సూచనల మేరకు ఈ నోటీసు జారీ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
ఈ నిర్ణయం చాలామందిని షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే శనివారం నుంచి తమ నగరంలోని 205 థియేటర్లను తెరవడానికి అనుమతి లభించిందని గురువారమే షాంఘై మునిసిపల్ అధికారులు ప్రకటించారు. చైనాలోనే అతి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన 'చైనా ఫిల్మ్ గ్రూప్' ఈ వారం ప్రారంభంలో సినిమా హాళ్లను ఓపెన్ చేయడానికీ, ప్రేక్షకులకు తిరిగి వినోదాన్ని అందించడానికీ ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. అందులో భాగంగా చైనా సినిమాలు 'వూల్ఫ్ వారియర్ 2', 'ది వాండరింగ్ ఎర్త్', హాలీవుడ్ సినిమాలు 'ది అవెంజర్స్' సిరీస్, గత ఏడాది ఆస్కార్ బెస్ట్ పిక్చర్ అయిన 'గ్రీన్ బుక్'ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసింది. అంతలోనే మళ్లీ షట్‌డౌన్ నోటీసు వచ్చింది.
Also Read