అనుక్షణం.. యూజర్ రివ్యూ..అంతా భ్రమ..
on Sep 13, 2014
వర్మకి దండం పెట్టాలి. ఏంటా స్పీడు? సినిమా తరవాత సినిమా. గ్యాప్ ఇవ్వడు. ఊపిరి తీసుకొనే టైమ్ ఇవ్వడు. అసలు ఎప్పుడు మొదలెడుతున్నాడో, ఎప్పుడు పూర్తి చేస్తున్నాడో కూడా అర్థం కాదు. షర్టు మార్చినంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నాడు. భేష్! కానీ దురదృష్టమో, దౌర్భాగ్యమో.. ఆ సినిమాలు కూడా అంతే వేగంగా వచ్చి వెళ్లిపోతున్నాయ్. వర్మ సినిమాల లిస్టు ఇప్పుడు తీరిగ్గా వేసుకొంటే... అందులోంచి కొన్ని `ఆణిముత్యాలు` ఎగిరిపోతాయ్. కారణం... అవంతగా రిజిస్టర్ కాలేదు. వర్మ సినిమా తీస్తే బాగుణ్ణు... అనుకొనే ఫ్యాన్స్ - ఇప్పుడు `వర్మ నుంచి సినిమా వచ్చిందా...` అంటూ బెంగ పడుతూ, భయపడుతూ థియేటర్లకు వెళ్లాల్సివస్తోంది. ఎందుకంటే.. వర్మలోని టెక్నీషియన్ రోజు రోజుకీ దిగజారిపోతూ - అతనిలోని దర్శకుడు రోజు కూలీలా మారి రోజుకో సినిమా తీసిపారేస్తున్నాడు. అలాంటి ఓ రోజువారీ సినిమా మరోటొచ్చింది. అదే... అనుక్షణం. సినిమాలకు కథ అవసరం లేదన్నది వర్మలాంటి మేధావుల సిద్ధాంతం. ఇక సైకో సినిమాకీ, యాక్షన్ థ్రిల్లర్‌కీ కథ రాసుకొంటాడనుకోవడం మన తెలివితక్కువదనం. అయినా కథ చెప్పాల్సిందే అంటే.. అనుక్షణం కథ ఇలా సాగింది...
హైదరాబాద్ నగరంలో వరుసగా అమ్మాయిలు హతం అవుతుంటారు. రాత్రి మాయమైన అమ్మాయి... పొద్దుట శవంలా కనిపిస్తుంది. ఓ సైకో కిల్లర్ దారుణంగా చంపేస్తున్నాడని పోలీసులు నిర్థారణకు వస్తారు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎలా ఉంటాడు? అనే విషయాలు మాత్రం తెలీవు. ఈలోగా మరింతమంది అమ్మాయిలు బలవుతుంటారు. ఆ సైకోని సిన్సియర్ పోలీస్ అధికారి గౌతమ్ (విష్ణు) ఎలా పట్టుకొన్నాడన్నదే ఈ సినిమా కథ. ప్రతీ ఛానల్‌లోనూ క్రైమ్ పోగ్రాం ఒకటొస్తుంది. నేరస్థుడిని పోలీసులు ఎలా పట్టుకొన్నారన్నదే... ఆ కార్యక్రమం. అరగంటలో కథంతా చెప్పేస్తారు. అలాంటి ఓ క్రైమ్ వాచ్‌ని రామూ గంటన్నర పాటు తీస్తే... అదే అనుక్షణం.
యాక్షన్ థ్రిల్లర్స్‌కు కథ అవసరం లేదు. కరెక్టే. కానీ ఆ యాక్షన్, థ్రిల్ అయినా ఉండాలి కదా..?! సైకో అమ్మాయిల్ని ఎలా తన క్యాబ్‌లో తీసుకెళ్తాన్నాడు? వాళ్లని ఎంత దారుణంగా చంపేస్తున్నాడు? అనే విషయాలపై వర్మ ఫోకస్ చేశాడు. దీని వల్ల ఉపయోగం ఏముంది?? జనాలు ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది ఏముంది? నా సినిమాలతో సందేశాలివ్వను అంటుంటాడు వర్మ. సందేశం ఇవ్వమని ఎవరడిగారు? పాడు చేయకపోతే చాలు. సైకోలు అమ్మాయిల్ని ఎలా చంపాలి? అనే విషయంపై ఈ సినిమా ఓ థీరీలా సాగిందంతే. క్రైమ్ సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ అనే పార్ట్ ఉంటుంది. నేరస్థుడిని పోలీస్ ఎలా పట్టుకొన్నాడన్నది చాలా చాలా కీలకం. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయ్యేది అక్కడే. హంతకుడు క్లూలు వదులుతుంటాడు. వాటిని ఆధారంగా చేసుకొని... ఛేజ్ చేయాలి. అప్పుడు క్రైమ్ సినిమాలు రక్తిగడతాయి. అయితే ఈ సినిమాలో ఈ పాయింట్ మిస్సయ్యింది. ఫోన్ ట్రాప్ చేస్తే హంతకుడిని పట్టుకోవచ్చన్నది... చిన్న పిల్లాడు సైతం చెబుతాడు. అదేదో హీరో గారి మేధాశక్తి అయినట్టు, అందులోనో హీరోయిజం ఉన్నట్టు చూపించారు.
వర్మ కొన్ని కీలక పాయింట్లు ఈ సినిమాలో మిస్సయ్యాడు. రాష్ట్ర్రాన్ని గడగడలాడిస్తున్న ఓ హంతకుడ్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తూ వెళ్తూ.. ఓ సైకాలజిస్ట్ (రేవతి)ని తీసుకెళ్తారా? పోలీసులు సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆమె కూడా తగుదునమ్మా అంటూ సలహాలిస్తుంటుంది. దొరక్క దొరక్క హంతకుడు దొరికితే... వాడి మానాన వాడ్ని గదిలో వదిలేసి... పారిపోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎపిసోడ్ చూస్తే.. మేధావి వర్మ ఇంత తెలివితక్కువగా ఆలోచించాడేంటి? అనే అనుమానం వస్తుంది. హంతకుడు సైకోనా? సీరియల్ కిల్లర్‌నా? అనే అనుమానాలు వేస్తాయి.
గంటన్నరలో ఈ సినిమా ముగించడం ప్రేక్షకుల అదృష్టం. అయితే ఇందులో ఇరికించిన బ్రహ్మానందం కామెడీ మరీ ఎబ్బెట్టు వ్యవహారం. ఆ ఎపిసోడ్లు లేకుంటేనే మేలు. విష్ణు బాగానే నటించాడు. డైలాగులు పలికే విధానం కూడా బాగుంది. రేవతి, కోట... అందరూ ఉద్దండులే. వారి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? నవదీప్‌ది ప్రాధాన్యం లేని పాత్ర. సైకోగా నటించిన సూర్యని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో గానీ సైకోలానే ఉన్నాడు. సాంకేతికంగా వర్మ సినిమాలెప్పుడూ బాగుంటాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాని క్వాలిటీగా తీర్చిదిద్దుతాడు. ఆర్, ఆర్, ఎడిటింగ్, కెమెరా.. ఇవన్నీ ఆయన స్థాయిలోనే ఉన్నాయి. అయితే.. వర్మ టేకింగ్‌లోని మెరుపులే మిస్సయ్యాయి.
-కీర్తి ప్రదీప్