'కత్తి' లాంటి హీరో-హీరోయిన్స్
on May 3, 2015
చిత్ర సీమలో తమకంటూ స్థానం ఏర్పరచుకోవాలంటే కసరత్తు తప్పదు. అవలీలగా నాలుగు డైలాగ్‌లు చెప్పేసి ఐపోయిందంటే సరిపోదు. ఒళ్లొంచి కష్టపడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే పద్ధతి కొనసాగుతోంది. మూసకథల నుంచి దర్శకులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసుకున్నారు. తేడావస్తే తొలిరోజే చివరిరోజు అవుతుందని అర్థమైంది. అందుకే ప్రయోగాలు చేసేందుకు-చేయించేందుకు సిద్ధపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రావడంతో సినిమాకు సొబగులు అద్దుతున్నారు. బ్లూమ్యాట్‌లో చిత్రీకరణ పాతపద్దతే అయినా....దీనికి ఇప్పుడు గ్రాఫిక్ హంగులు అద్దుతున్నారు. ఈ కోవలో వచ్చిన ఈగ, మగధీర, అరుంధతి అత్యంత ప్రేక్షకాదరణ పొందగలిగాయి.
అయితే ఇప్పుడు సాంకేతిక నిపుణులతో పాటుగా ఆర్టిస్టులకు పనిపెరిగింది. గ్రాఫిక్ సహకారంతో తీసే చిత్రాల్లో ఆర్టిస్టులకు కొత్త కొత్త గెటప్‌లు వేస్తున్నారు. దాంతో పాత్రపోషణకు కసరత్తు తప్పడం లేదు. జీన్‌ప్యాంట్, టీ షర్టు, షూస్ ధరించి నటించే హీరోలు ఇప్పుడు జానపద గెటప్‌లోకి మారుతున్నారు. కత్తులు చేతపట్టి కసరత్తులు చేస్తున్నారు. అయితే కత్తి తిప్పిన హీరోల్లో సక్సెస్ అయిన వారి సంఖ్య మాత్రం తక్కువే అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
పాతతరం హీరోలంతా కత్తితిప్పినా...తాజా హీరోల్లో కత్తి చేతపట్టి వారిసంఖ్య తక్కువే అని చెప్పొచ్చు. నాగవల్లిలో వెంకటేశ్, మగధీరలో రామ్‌చరణ్, శక్తిలో ఎన్టీఆర్, బద్రినాథ్‌లో అల్లు అర్జున్, అనగనగా ఒకధీరుడి చిత్రంకోసం సిద్దార్థ కత్తిపట్టారు.అరుంధతిలో అనుష్క, చండీలో ప్రియమణి సైతం కత్తితిప్పారు. అయితే వీటిలో మగధీర, అరుంధతి మినహా అన్నీ నెగెటివ్ రిజల్ట్ ఇచ్చిన సినిమాలే. దీంతో అందరి కళ్లు ఇప్పుడు బాహుబలి, రుద్రమదేవిపై పడ్డాయి.
చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కించిన నాగవల్లిలో ద్విపాత్రాభినయం చేసిన వెంకటేశ్ ఓ సీన్లో కత్తిపట్టాడు. ప్రయోగాత్మకంగా ఉంటుందిలే అనుకున్న వెంకీ ఆశ నిరాశే అయింది. చంద్రముఖికి లభించినంత ఆదరణ నాగవల్లికి దక్కలేదు. పైగా రజనీకాంత్ దగ్గర వెంకీ తేలిపోయాడనే కామెంట్స్ వచ్చాయి. వరుస ఫ్లాపుల్లో కొట్టుకుపోతున్న ఎన్టీఆర్ కత్తి పట్టి ఫ్లాపుల లోతుకి కొట్టుకుపోయిన చిత్రం శక్తి. అప్పటికే ఆంధ్రావాలాలో ద్విపాత్రాభినయం చేసిన యంగ్ టైగర్ మరోసారి శక్తిలో ఆ ప్రయోగం చేశాడు. పైగా రెండు విభిన్న తరహా పాత్రల్లో మెప్పిద్దామనుకున్నాడు. 'శక్తి'వంచన లేకుండా కృషిచేశాడు. కానీ ఫలితం శూన్యం.
మగధీర విషయానికొస్తే రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పక తప్పదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీరలో సైనికాధిపతిగా చెర్రీ నటన అద్భుతం. వందమందిని ఒకేసారి పంపించు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్.....ఒకే సీన్ లో కత్తితో వందమందిని తెగనరికే సీన్ సినిమాకే హైలెట్ . కథకు ప్రాణం కూడా అదే సీన్ మరి. ఏదేమైనా చెర్రీ పట్టిన కత్తికి పదునెక్కువే. రాజీపడకుండా చెర్రీని మగధీరిడిగా తీర్చి దిద్దిన జక్కన్న నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు.
సినిమా సినిమాకి తన స్టైల్ మార్చుకుంటూ ఎంతోకొంత మెరుగుపడుతూ ముందుకెళుతున్న నటుడు అల్లు అర్జున్. సినిమా ఫ్లాప్ అయినా బన్నీ నటనకు ఫుల్ మార్క్స్ పడతాయి. కానీ బన్నీక కూడా కత్తి కలసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బద్రీనాథ్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న రుద్రమదేవిలో అల్లు అర్జున్ మరోసారి కత్తిపడుతున్నాడు. గోనగన్నారెడ్డిగా బన్నీ గెటప్ బావుందంటూనే....కత్తి కలిసిరాదు కదా!సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లవర్ బాయ్ గా పాపులర్ అయి ప్రస్తుతం ఫ్లాపులతో సావాసం చేస్తున్న సిద్ధార్థ సైతం అనగనగా ఓ థీరుడు కోసం కత్తిపట్టాడు. కానీ అక్కడ మొదలైన ఫ్లాపుల పరంపర నుంచి ఇప్పటికీ బయటపడలేదు. సిద్ధూపై కత్తి ఆ స్థాయిలో వేటేసింది మరి.
అన్ని విషయాల్లో మగాళ్లతో పోటీపడే మహిళా మణులు మాకేం తక్కువ అంటూ కత్తి తిప్పారు. అరుంధతిలో కత్తి తిప్పి జేజమ్మగా అనుష్క జేజేలు పలికించుకుంది కానీ...చండీగా ప్రియమణి ఆకట్టుకోలేకపోయింది. బొమ్మాళికి ఇప్పటికే కత్తి తిప్పిన అనుభవం ఉండడంతో బాహుబలి, రుద్రమదేవిలో సైతం యుద్ధాలు చేస్తోంది. మరి అరుంధతిలా ఈ రెండు సినిమాలు విజయబావుటా ఎగరేస్తాయో లేదో చూడాలి.
అయితే హీరోలు కత్తిపట్టిన చిత్రాల్లో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ అయినవే ఎక్కువ ఉన్నాయి. దీంతో బాహుబలి, రుద్రమదేవి గురించి జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి బాహుబలి...మగధీరుడిని మెప్పిస్తుందా?రుద్రమదేవి...అరుంధతిని మరపిస్తుందా? అల్లు అర్జున్ కత్తి సెంటిమెంట్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? ప్రభాస్-రానా కసరత్తులు ఆకట్టుకుంటాయా? వెయిట్ అండ్ సీ!