వాళ్లు పార్టీ పెడితే ఎలా ఉండేదో?
on Jan 20, 2018
తెలుగు నాట తొలి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అన్న విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు కొన్ని పుట్టుకొచ్చినీ... ఏవీ నిలబడలేదు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ మాత్రం బాగానే హల్ చల్ చేసింది. ఇప్పుడు వైయస్ ఆర్ సీపి. అయితే...చాలామందికి తెలీని విషయం ఏంటంటే... ఎన్టీయార్ ‘తెలుగుదేశం’ తర్వాత... 80ల్లోనే మరో ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి తెలుగునాట పార్టీ పెట్టాలనుకున్నారట. ఆ స్టార్ హీరోలను ‘పార్టీ పెట్టండి.. కలిసి పోటీ చేయండి..’ అని చాలామంది ప్రాధేయపడ్డారట కూడా. వాళ్లిద్దరూ కూడా పార్టీ పెట్టాలనుకున్నా... తర్వాత ‘రాజకీయాలు మనకు పడవులే.. ఆ భారాలను మనం మోయలేం లే’ అనుకుని వెనక్కు తగ్గారట.
ఇంతకీ ఆ సూపర్ స్టార్లు ఎవరు? అనేగా మీ ప్రశ్న. వారిలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ అయితే... మరొకరు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తెర వెనుక కూడా మంచి స్నేహితులైన వీరిద్దరూ అప్పుడు కలిసి పార్టీ పెడితే... అప్పటి రాజకీయ చిత్రపటం ఎంత మారేదో తెలీదు కానీ... కొంతవరకైతే ప్రభావం చూపించేవారేమో కదూ. ప్రస్తుతం తమిళనాట కూడా ఎక్కువ మంది కోరుకుంటోంది అదే.. రజనీకాంత్, కమల్ హాసన్ వేరే వేరుగా కాకుండా.. కలసి పార్టీని స్థాపించాలనీ.. కలిసే.. రాజకీయాలను ప్రక్షాళనం చేయాలని అందరి ఆకాంక్ష. చూద్దాం ఏం జరుగుతుందో.