రాజమౌళి Vs శంకర్
on Jul 29, 2015
ఇది వరకు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడంటే శంకర్ పేరు చెప్పుకొనేవారు. మగధీర వరకూ అగ్ర దర్శకుల జాబితాలో రాజమౌళి ప్రస్తావనే ఉండేది కాదు. రోబోతో యావత్ భారతీయ చిత్రసీమని తనవైపుకు తిప్పుకొన్నాడు శంకర్. ఐకి ముందూ ఇంతే! హాలీవుడ్ సినిమాని తలదన్నే సినిమా తీసుంటాడని శంకర్ గురించి ఆశించారు. అయితే.. ఈ సినిమాతో శంకర్ నిరాశపరిచాడు. శంకర్ కూడా ఒక్కోసారి మామూలు దర్శకుల్లానే తప్పులు చేస్తాడని ఈ సినిమా నిరూపించింది. దానికి తోడు బాహుబలితో శంకర్‌ని దాటుకొంటూ వచ్చేశాడు రాజమౌళి. తెలుగు సినిమాకి రూ.500 కోట్ల క్లబ్‌లో చేర్చేస్తాడేమో అన్నంత రేంజులో బాహుబలి వసూళ్లు సాగుతున్నాయి. రాజమౌళి హవాతో శంకర్ పరపతి కాస్త తగ్గిన మాట వాస్తవం. ఈ సంగతి శంకర్‌కీ తెలుసు. అందుకే రోబో 2తో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకొన్నాడట.
రోబో 2ని భారతీయ చలన చిత్రపరిశ్రమ కలలో కూడా ఊహించని విధంగా రూపొందించాలని శంకర్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ సినిమా కోసం రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వస్తున్న వార్తలు అటు తమిళ వర్గాలనే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమనూ షాక్‌కి గురిచేస్తున్నాయి. బాహుబలి రెండు భాగాలకూ పెట్టిన పెట్టుబడి అది. ఒక్క సినిమాకే శంకర్ రూ.250 కోట్లు ఖర్చు పెట్టాలని చూడడం.. అతని గట్స్‌కి నిదర్శనం. అయితే బాహుబలి వేరు, రోబో 2 వేరు! బాహుబలి స్ట్రాటజీ వేరు, రోబో 2 వేరు. అయితే ఈ లెక్కలేం పట్టించుకోకుండా శంకర్ భారీ మొత్తంతో ఈ సినిమా తీయడం పరిశ్రమకు షాక్‌కి గురిచేసే విషయమే.
సినిమాలో దమ్ముంటే ఎన్ని వసూళ్లయినా సాధించుకోవచ్చని బాహుబలి నిరూపించింది. బాహుబలి స్ఫూర్తితోనే శంకర్ కూడా ఈ సాహసానికి ఒడిగడుతున్నాడు. మరి ఈ సినిమాతో శంకర్ రాజమౌళికి పోటీ ఇస్తాడా? మళ్లీ సౌత్ ఇండియా నెంబర్ వన్ దర్శకుడిగా కితాబులు అందుకొంటాడా?? వేచి చూడాల్సిందే.