బెంగాల్ టైగర్ రివ్యూ
on Dec 10, 2015
కథ.. అస్సలుండదు!
లాజిక్కులు... అడక్కూడదు!
స్ర్కీన్ ప్లే... అడ్డదిడ్డంగా ఉంటుంది.
సీన్లు.. ఇష్టం వచ్చినట్టు వచ్చిపోతుంటాయ్.
హీరో.. నచ్చింది చేసేస్తుంటాడు
హీరోయిన్లు.. పెద్దగా పనేం ఉండదు.
విలన్.. శుద్ధ దద్దమ్మ.
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా రెసిపీ ఇదే. తెలుగు సినిమా ఇలానే ఉండాలి.. ఇలానే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కొలతలతో రవితేజ మరో సినిమా తీశాడు. అదే బెంగాల్ టైగర్! ఎప్పుడో వచ్చేసిన, ఇప్పుడొస్తున్న సవాలక్ష తెలుగు సినిమాకి నకలు కాపీలా కనిపిస్తుంటుంది బెంగాల్ టైగర్. టైటిల్‌లో తప్ప రవితేజ తీరులో, యాక్టింగ్‌లో, ఎనర్జీలో, విసిరే పంచుల్లో... ఎలాంటి తేడా లేని ఈ టైగర్ దమ్మెంటో తెలియాలంటే.. కథలోకి వెళ్లిపోవాలి.
ఆత్రేయపురంలో ఆకాష్ (రవితేజ) ఓ జులాయి. తిని.. తిరుగుతుంటాడు. ఇంట్లోవాళ్లకూ భారంగా తయారవుతాడు. పెళ్లి చూపుల్లో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక... నేనూ ఏదో ఓ రోజు ఫ్యామస్ అవుతా అని ప్రతిజ్ఞ పూనతాడు. అందులో భాగంగా ఆత్రేయపురం వచ్చిన వ్యవసాయ శాఖామంత్రి సాంబు (సాయాజీ షిండే)ని రాయి ఇచ్చుకొని కొడతాడు. అదేంటో కొట్టినోడ్ని ఇంట్లో తెచ్చిపెట్టుకొంటాడు మంత్రి. పైగా నెలకు లక్ష జీతంతో. నాలుగు లక్షలిస్తానంటే... హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్) దగ్గర వాలిపోతాడు. నాగప్ప కూతురు శ్రద్ధ (రాశీఖన్నా) ఆకాష్ గట్స్ చూసి ఇష్టపడుతుంది. అయితే అప్పటికే శ్రద్దకు మరో మినిస్టర్ కొడుకు (హర్షవర్థన్)తో పెళ్లి ఫిక్సవుతుంది. కూతురి కోసం ఆ సంబంధాన్ని కూడా క్యాన్సిల్ చేయిస్తాడు నాగప్ప. అయితే.. నేను ప్రేమించింది నీ కూతుర్ని కాదు, ముఖ్యమంత్రి ఆశోక్ గజపతి (బొమన్ ఇరాని) కూతురు మీరా (తమన్నా)ని అంటాడు ఆకాష్. అక్కడ ఇంట్రవెల్. అసలు మీరా ఎవరు? మీరానే ఆకాష్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఆకాష్ గోల్ ఏంటి? అన్నది సెకండాఫ్ చూసి తెలుసుకోవాల్సిందే.
ముందే చెప్పినట్టు.. ఈ కథకి ఓ తలా తోకా ఉండదు. హీరో ఏం అనుకొంటే అది జరిగిపోతుంటుంది. మంత్రిని రాయిచ్చుకొని కొడితే ఫ్యామస్ అవుతారు సరే! మరీ లక్ష ఎదురిచ్చి పన్లో పెట్టుకొంటారా? సిల్లీ కాకపోతే. సీఎమ్ ని పదవిలోంచి అర్థాంతరంగా దింపేస్తే.. జడ్ క్యాటరిగీ భద్రత మొత్తం సడన్‌గా మాయం అయిపోతుందా? అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా హుందాగా ఉన్న వ్యక్తి.. కత్తి పుచ్చుకొని రోడ్లపై హీరోని చంపడానికి దిగిపోతాడా? హీరోగారు వేసే తింగరి చేష్టలకు ముఖ్యమంత్రి కూతురు ఫ్లాటైపోయి, ఐ లవ్ వ్యూ చెప్పేస్తుందా? ఇలాంటి సిల్లీ సెట్యువేషన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. హీరో చేతిలో మంత్ర దండం ఉన్నట్టు అన్నీ తాను అనుకొన్నట్టే చకచక జరిగిపోతుంటాయి. ఏ సన్నివేశంలోనూ లాజిక్ కనిపించదు. తన లక్ష్యం కోసం ఇద్దరమ్మాయిల జీవితాలతో హీరో ఆడుకోవడంతోనే ఈ సినిమా కథలో దమ్మెంతో అర్థం చేసుకోవచ్చు. ఓ ఫైటు, పాట, హీరోయిజం, లాజిక్‌కి అందని సన్నివేశాలు, గరమ్ గరమ్ పాటలూ... ఇవుంటే ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అయిపోతాడన్న భ్రమల్లో ఉండి తీసిన సినిమా ఇది. ఫ్యూచర్ స్టార్‌గా ఫృద్వీ, సెలబ్రెటీ శాస్త్రిగా పోసాని ఎంటర్‌టైన్ చేయకపోతే.. ఈ సినిమాని, సొదని, రవితేజ ఓవర్ యాక్టింగ్‌నీ భరించడం చాలా చాలా కష్టం.
ఫృద్వీ, పోసానీ... ఇద్దరూ పండించిన కామెడీ ఈ సినిమాని ఫస్టాఫ్ వరకూ ఏదోలా నడిపిస్తుంది. ఫృద్వీ ఎంటర్‌టైన్ చేశాడులే.. ఈ సినిమాలో అదైనా ఉందీ అనుకొని ఇంట్రవెల్‌కి బయటకు వస్తాడు ఆడియన్. ఆ తరవాత నుంచీ ఆ ఆనందమూ మిస్. తెరపై ఏదేదో జరిగిపోతుంటుంది. విలన్ పాత్ర తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం బాలేదు. కాసేపు.. శక్తిమంతుడిగా, ఇంకాసేపు శక్తి హీనుడిగా చూపించారు. హీరోని చంపడానికి ముఖ్యమంత్రి రంగంలోకి దించిన రౌడీ మూకని చూస్తేనే ఆ సంగతి అర్థమైపోతుంది. బ్రహ్మానందం పాత్ర మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆయన కంటే షకలక శంకరే బెటర్! ఆ పాత్రకు కాస్తయినా జస్టిఫికేషన్ ఉంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏవే అద్భుతాలు జరిగిపోయనట్టు బిల్డప్ ఇచ్చారు. అదీ పండలేదు. ఎప్పుడైతే ఎమోషన్ డ్రామా పట్టుతప్పిందో, అప్పుడే ఈ సినిమా పూర్తిగా లెక్క తప్పేసింది. ఎండ్ కార్డ్ కోసం చూడ్డం మినహా.. ప్రేక్షకుడూ చేసేదేం లేదు.
రవితేజ గత సినిమాల్లో ఏం చేశాడో, ఎలా నటించాడో డిట్టో ఈ సినిమాలోనూ అదే చేశాడు. అయితే కిక్ 2లోలానే ఇందులోనూ మరీ పీలగా కనిపించాడు. రవితేజ బరువు తగ్గడం మాటేమోగానీ, అలా తనని చూడడం మాత్రం ప్రేక్షకులకు బరువుగా అనిపిస్తోంది. మళ్లీ యధాస్థాయికి వచ్చేస్తే బెటరు. తమన్నా ది చిన్న పాత్రే. మహా అయితే నాలుగైదు సన్నివేశాల్లో మూడు పాటల్లో కనిపిస్తుంది. రాశీఖన్నా కూడా అంతే. అయితే తమన్నాతో పోలిస్తే రాశీకే కొన్ని సీన్లు ఎక్కువ ఉన్నాయి. బొమన్ ఇరానీ స్థాయికి తగిన పాత్ర కాదది. దానికి తోడు సెకండాఫ్ వరకూ బొమన్‌ని చూడం. తమన్నా కూడా ఇంట్రవెల్ ముందే కనిపిస్తుంది. రావు రమేష్, షాయాజీవి రొడ్డకొట్టుడు రొటీన్ పాత్రలే. ఫృద్వీకి మరోసారి మంచి పాత్ర పడింది. తన కామెడీ టైమింగ్‌తో అల్లాడించేశాడు. ఈ సినిమాలో ఏకైక రిలీఫ్ తనే.భీమ్స్ సంగీతం అంతా హడావుడి హడావుడిగా ఉంది. బీట్ పరంగా ఓకే. కానీ పాటల్లో మ్యాజిక్ లేదు. ఆర్.ఆర్ కూడా చిన్నా చేసిందే. యాక్షన్ సీన్లు బాగా కంపోజ్ చేశారు. హైవేపై ఫైటు మాస్‌కి నచ్చుతుంది. కెమెరా వర్క్ బ్రహ్మాండంగా ఉంది. విజువల్ రిచ్ నెస్ కనిపించింది. సంతప్ అక్కడక్కడ డైలాగులు బాగానే పేల్చాడు. అయితే... సీన్లు రాసుకోవడంలో ఇంకా శ్రద్ధ పెట్టాలి. చూసిందే చూడమంటే... అందులో ఎన్ని మంచి డైలాగులు ఉన్నా.. ఆడియన్ కి ఎక్కదు. సెకండాఫ్ పూర్తిగా గాడితప్పింది. స్ర్కీన్ ప్లేలో ప్రధాన లోపం అది.
మొత్తానికి రవితేజ ఎప్పట్లా తనదైన దారిలో వెళ్లి ఓ కథ ఎంచుకొన్నాడు. అయితే.. ఆ కథలో నవ్యత, సన్నివేశాల్లో వైవిద్యం ఏమీ లేకపోవడంతో టైగర్.. తుస్సుమంది.
పంచ్ లైన్: ఈ టైగర్ చూడ్డం కంటే టైగర్ బిస్కెట్ కొనుక్కొని తినడం బెటర్!