సినిమాటోగ్రాఫర్ కి అడ్డుపడుతున్న రాజమౌళి
on Jun 30, 2015
దర్శకుడవ్వాలంటే దర్శకత్వ శాఖలోనే చేరాలనేం లేదు. 24 శాఖల్లో ఎందులో పని చేసినా దర్శకుడు కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చు. నటుడు, రచయిత, కొరియోగ్రాఫర్, ఎడిటర్, కెమెరామన్.. ఇలా ఎవ్వరైనా మెగా ఫోన్ పట్టేయొచ్చు. ఇలా వేరే విభాగం నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టిన వాళ్లు చాలామందే ఉన్నారు.
టాలీవుడ్ టాప్ కెమెరామన్ సెంథిల్‌కు కూడా మెగా ఫోన్ కలలు ఉన్నాయట. ఎప్పట్నుంచో దర్శకత్వం చేయాలని అనుకుంటున్నా ఆ కల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉందట. అందుకు ప్రధాన కారణం రాజమౌళే అని చెబుతున్నాడు సెంథిల్.
దర్శకుడిగా సినిమా చేయాలనే కోరిక ఎప్పుట్నుంచో ఉంది. ఎప్పటికప్పుడు దర్శకత్వం చేయాలనుకుంటాను. అంతలోనే రాజమౌళి గారు ఒక అద్భుతమైన కథ చెబుతారు. సినిమా చేద్దామంటారు. ఈ సినిమా పూర్తయ్యాక దర్శకత్వం గురించి ఆలోచిద్దాంలే అనుకుంటూ నా కలను వాయిదా వేసేస్తా. బాహుబలి రెండో భాగం కూడా పూర్తయ్యాక కచ్చితంగా దర్శకత్వం చేయాలని ఆలోచిస్తున్నా. కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నా” అని చెప్పాడు సెంథిల్. ఐతే బాహుబలి రెండో భాగం కూడా అయ్యాక రాజమౌళి మరో మంచి కథతో వస్తే సెంథిల్ ఏం చేస్తాడో మరి.